– వీడియోలు తీసి..బెదిరింపులు
నవతెలంగాణ-హైదరాబాద్
బెంగుళూరులో దారుణం చోటు చేసుకుంది. మాజీ ప్రియురాలిని బెదిరించి అనేక సార్లు లైంగికదాడికి పాల్పడ్డాడో ఓ వ్యక్తి. అంతేకాదు.. ఆ లైంగిక వీడియోలను అడ్డంగా పెట్టుకుని, ఆమెను తన స్నేహితుల వద్దకు కూడా పంపి, వారి నుంచి డబ్బులు వసూలు చేశారు. ఈ దారుణమైన ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటు చేసుకుంది. విద్యారణ్యపురకు చెందిన ఆండీ జార్జ్(28) ఓ ప్రయివేటు స్కూల్‌లో డ్యాన్స్ టీచర్‌గా పని చేస్తున్నాడు. జార్జ్‌కు ఓ యువతి ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో ఇద్దరు తరుచూ కలుస్తుండేవారు. జార్జ్ ప్రవర్తన నచ్చక అతన్ని దూరం పెట్టింది ఆమె. అయితే ఆమెతో సన్నిహితంగా ఉన్న సమయంలో తీసుకున్న ఫొటోలు, వీడియోలను చూపించి బెదిరించాడు. అలా ఆమెపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు జార్జ్. ఆ ఆగడాలు అంతటితో ఆగలేదు. తన స్నేహితులైన సంతోష్(28), శశికుమార్(30) వద్ద కూడా సన్నిహితంగా ఉండాలని ఆమెను కోరాడు. కానీ యువతి అతని ప్రతిపాదనను తిరస్కరించింది. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తానంటూ మళ్లీ బెదిరించి, బలవంతంగా ఆమెను ఒప్పించాడు. అతని స్నేహితులతో ఆమె ఉన్న సమయంలో కూడా వీడియోలను రికార్డు చేశాడు. స్నేహితుల నుంచి కూడా డబ్బులు వసూలు చేశాడు. ఈ ముగ్గురి ప్రవర్తన నచ్చక.. వారిని కలవడం మానేసింది బాధితురాలు. దీంతో వీడియోలను, ఫొటోలను జార్జ్ తన స్నేహితులకు షేర్ చేశాడు. జార్జ్ వేధింపులు భరించలేని బాధితురాలు.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జార్జ్‌ను అరెస్టు చేసి, అతని నుంచి ల్యాప్‌టాప్, ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.