– ఖాజన్ సింగ్‌పై భయాన్ని వ్యక్తం చేస్తున్న మహిళలు
న్యూఢిల్లీ: సీఆర్పీఎఫ్‌కు చెందిన కానిస్టేబుల్(30).. డీఐజీ స్థాయితో సమానమైన చీఫ్ స్పోర్ట్స్ ఆఫీసర్ (సీఎస్‌ఓ) ఖాజన్ సింగ్‌పై ‘సెక్స్ స్కాండల్’, లైంగిక వేధింపులు, లైంగికదాడి, బెదిరింపులకు పాల్పడ్డారని మూడేండ్ల క్రితం ఆరోపించారు. పలువురు మహిళలు సైతం ఆయనపై ఇవే ఆరోపణలు చేశారు. అయితే, ఈ ఆరోపణల నేపథ్యంలో బాధిత మహిళలు భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఖాజన్ సింగ్ అనేక ఏండ్లు తన స్థానం, అధికారం, సీఆర్పీఎఫ్‌లోని ఇతర కోచ్‌లు, అధికారుల మద్దతును ఉపయోగించారనీ, తమపై ప్రతీకార చర్యలకు దిగే అవకాశం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గతంలో జాతీయ స్విమ్మింగ్ ఛాంపియన్ అయిన ఖాజన్ సింగ్ 1984లో అర్జున అవార్డును పొందారు. అతను 1982లో కామన్వెల్త్ గేమ్స్, 1988లో ఒలింపిక్స్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. కానిస్టేబుళ్లను లైంగికంగా వేధించినందుకు సీఆర్పీఎఫ్‌లో తన పదవీకాలంలో అతనిపై ఫిర్యాదులు ఫిర్యాదులున్నాయి. తన చివరి సంవత్సరం సర్వీస్‌లో ఉన్న ఖాజన్ ఢిల్లీలో తన సొంత స్విమ్మింగ్ అకాడమీని నడుపుతున్నాడు. మహిళా సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్‌లు ఖాజన్, అతని సిబ్బంది తమను లైంగికంగా వేదించారని ఆరోపించారు. ఖాజన్‌పై ఫిర్యాదు చేసిన మహిళలు మీడియాతో మాట్లాడుతూ తమ ప్రాణాలను ఫణంగా పెట్టాలని కోరుకోవడం లేదని చెప్పారు. ఖాజన్‌కు ఉన్న అధికారంతో.. బహిరంగంగా అతనిపై ఆరోపణలు చేసినందుకు తమను డిస్మిస్ చేస్తారనే భయం కూడా ఉందని వారు తెలిపారు. ఖాజన్ న్యాయ వ్యవస్థను కూడా తప్పుదోవ పట్టించగలడని ఆరోపించారు.
2014లో మహిమ.. ఖాజన్ సింగ్, కోచ్ సుర్జిత్ సింగ్‌పై ఫిర్యాదు చేసింది. వారు లైంగిక వేధింపులు, బెదిరింపులకు పాల్పడ్డారని పేర్కొన్నది. వేధింపులపై ఆమె సీఆర్‌పీఎఫ్‌లోని పలువురు అధికారులకు ఫిర్యాదు చేసింది. బెదిరింపులపై ఎఫ్‌ఐఆర్ కూడా దాఖలైంది. కొన్నేండ్లుగా అంతర్గత ఫిర్యాదుల కమిటీ విచారణలో.. మహిమ, ఆమె వంటి ఇతర మహిళలు పదేపదే ప్రశ్నల వల్ల మానసికంగా గాయపడ్డారు. అక్కడ వారు డ్రగ్స్ ఉపయోగించే అథ్లెట్‌లుగా లేదా ఖాజన్ స్థానాన్ని కించపరిచే మోసపూరిత మహిళలుగా ఖాజన్ న్యాయవాది రంగు మార్చారు. ఖాజన్‌పై ఫిర్యాదు చేయకపోవడమే సురక్షితమని కొందరు నిర్ణయించుకున్నప్పటికీ, మహిమా వంటి వారు ఇప్పటికీ తమ భయాలతో పోరాడుతూ క్రాస్ ఎగ్జామినేషన్‌లకు హాజరవుతున్నారు.
ఖాజన్ సింగ్, అతని సహచరుడిపై తాను ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన వెంటనే, తనకు కాలం కష్టతరంగా మారిందని మహిమ ఆరోపించింది. ఆమెను బెదిరించడమే కాకుండా ప్రభుత్వ క్వార్టర్‌ను ఖాళీ చేయాలని ఆదేశాలు వచ్చాయన్నారు. తన ఫిర్యాదు తర్వాత, ఒక సీఆర్పీఎఫ్ ఉద్యోగి తనను సంప్రదించారనీ, ఖాజన్‌కు క్షమాపణ లేఖ రాయాలని, కేసును ఉపసంహరించుకోవాలని కోరటం గమనార్హం.