ఒక్కసారొచ్చి పో బిడ్డా…!

ఒక్కసారొచ్చి పో బిడ్డా...!అభిరామ్‌,
ఎలా ఉన్నావ్‌! కోడలు పవిత్ర, పిల్లలు ఎలా ఉన్నారు. మీరు క్షేమమని తలుస్తాను. నేను మీ జ్ఞాపకాల్ని, మీ నాన్నతో నా అనుబంధాన్ని నెమరు వేసుకుంటూ ఒంటరిగా కాలం నెట్టు కొస్తున్నాను. మీరు జర్మనీ వెళ్ళి మూడేళ్లు దాటి పోయింది. పోయిన శ్రావణమాసంలో వస్తారనుకున్నాను. కాని, రాలేదు. ముసలి దాన్ని ప్రాణం ఉండబట్టలేక ఉత్తరం రాస్తున్నాను. నా ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంది. జీవితంలో ఇలాంటి రోజు వస్తుందని నేను ఊహించ లేదు. అనుకున్నవి జరగక పోవడమేగా జీవితమంటే! మీతో నా ఎడబాటు ఈ వయసులో నాకు ఇది పెద్ద శిక్షలాంటిదే!
మనిషికి జీవితం ఎన్ని గుణ పాఠాలు నేర్పుతుందో! ఎన్ని కష్టాలు కన్నీళ్లు కలబోసిన అనుభవాలను ఆవిష్క రిస్తుందో! తలుచుకుంటేనే, గుండె బరువెక్కుతుంది. నాకు బాగా గుర్తు… నువ్వు పుట్టినప్పుడు ముగ్గురు ఆడబిడ్డల తరవాత, మగబిడ్డ పుట్టావని ఎంత సంతోషించామో! నువ్వు మా నోముల పంటవు. ఎన్ని ఒక్క పొద్దులుండి, ఎందరో దేవుళ్లకు మొక్కుకున్నానే. పుట్టిన వారసుడివి.. నువ్వు విజయదశమి రోజు పుట్టినా పండగలన్ని ఒక రోజు జరుపుకున్నట్టు సంబర పడ్డాం. నిజం చెప్పాలంటే నిన్ను పాలతో కాదు మా రక్తాన్ని ధారపోసి, ప్రాణంగా పోషించుకున్నాం. నువ్వు పసివాడిగా ఉన్నప్పుడు నాన్న పడే కష్టం చూడలేక, మీ పెద్దక్క నాన్నలో పాటు కూలి పనికెళ్తానని, మారాం చేసింది. ”ఈ గొడ్డు చాకిరి నాతోనే పోవాలి. ఈ కూలి పని బదుకు నాతోనే అంతం కావాలి. మీరంతా పెద్దపెద్ద చదువులు చదువుకొని గొప్ప ఉద్యోగాలు చెయ్యాలి” అని నాన్న అక్కకు నచ్చచెప్పేవాడు. మా రెక్కల కష్టంతోనే మిమ్మల్ని చదివించి ప్రయోజకుల్ని చేశాం. నీ స్థితిని చూడకుండానే మీ నాన్న కాలం చేశారు.
పోయిన గోదావరి పుష్కరాలకు మనం రాజమండ్రి వెళ్ళినపుడు మీ నాన్న అన్న మాటలు నా మనసులో అలాగే ఉండిపోయాయి. ”మనం ఎన్ని కష్టాలుపడ్డా పిల్లల్ని పస్తులు లేకుండా సాకాం. అయినా మన పిల్లలు మంచివాళ్లే! తీర్చలేని కోరికలు ఎప్పుడూ అడగలేదు. వాళ్లకు తెలుసనుకుంటాను. నాన్న కుచేలుడని. కాలం కలిసిరాక నేను భగవంతుడు దగ్గరకు వెళ్ళిపోయినా! నీకేం పర్వాలేదు. నీ ముద్దుల కొడుకు అభిరావమ్‌ ఉన్నాడుగా! నిన్ను ప్రాణంగా చూసుకుం టాడులే!” అనే మాట కడుపు నిండా నవ్వుతూ అనేవాడు. అలాంటి సందర్భంలో మీ నాన్ననే చూడాలనిపించేది. బాధ్యతల్ని తీర్చుకొని, బంధాలన్ని తెంచుకొని వెళ్ళిపోయాడు.
అత్తగారిళ్లకు ఆడపిల్లలు, ఉద్యోగాల పేరుతో మీరు దిక్కులు పంచుకొని వెళ్ళిపోయారు. నేను మాత్రం ఒంటరి పిట్టలా మీ జ్ఞాపకాల మధ్య కాలం నెట్టుకొస్తున్నాను. మన ఊరి కరణం పెద్ద కొడుకు రామనర్సయ్య మామయ్య వాళ్ల పిల్లలు అమెరికా వెళ్ళి ఆరేళ్లయినా తిరిగి రాలేదు. వాళ్లను వద్ధాశ్రమానికి వెళ్ళమని ఉత్తరం రాశారట. ఊళ్లో ఎట్టా బతికినోళ్లు చివరకు అనాధల్లా శేషజీవితం గడపాల్సి వస్తుందని తులసమ్మత్త కన్నీరు మున్నీరవుతుంది. మనం ”బిడ్డల్ని కనగలం గాని, వాళ్ల తలరాతల్ని కాదుగా” అంటూ బాధపడుతుంది. మన ఇల్లు రాములోరి గుడికి పై ఎత్తు నాయినా! నేను పొద్దుటేలకి మాపిటేలకి మధ్య నలిగిపోతున్నాను. మహాశివరాత్రి నుండి ఆరోగ్యం బాగా దెబ్బతింది. శరీరం సహకరించడం లేదు. ఇంకా ఎంత కాలం బతుకుతానో తెలియదు. చూపు మందగించింది. నాకు నేనే భారంగా మారిపోయాను.
అయ్యా!-
”మీకు వీలుంటే ఒక్కసారి వచ్చి చూసిపోండి. ఒంటరి తనం చాలా నరకంగా ఉంది. చివరి రోజుల్లో మీ దగ్గర ఉండాలని ఆశగా ఉంది. మన ఊరు, పొలం, వ్యవ సాయం, రచ్చబండ, రామాలయం, చర్చి వీధి ఈ మాకులు విన్నప్పు డల్లా మీనాన్న పసిబిడ్డలా, నాతో మాట్లా డుతూ ! నా చుట్టూ తిరుగుతున్నట్టే ఉంది. ఊరు పొమ్మం టుంది. కాడి రమ్మం టుంది. మీ నాన్న, మీరు లేని ఇల్లు శూన్యంగా కనిపిస్తుంది. రాత్రయితే చాలు నా మంచం చుట్టూ మీరంతా కూర్చోని కబుర్లు చెప్తున్నట్టుగా ఉంది. ఒంటరిగా నువ్వక్కడ ఎందుకు నా దగ్గరకొచ్చెరు అని మీ నాన్న అన్నట్లుగా ఉంది. కానీ, మీ జ్ఞాపకాలే నన్ను బతికిస్తున్నాయి. కన్నీళ్లతో సహజీవనం చేయడం తప్ప ఈ వయసులో నేనేం! చెయ్యగలను.
ఈ పరుగుల ప్రపంచంలో ఆత్మీయతల్ని పంచుకునే సమయం లేని మానవ యంత్రాలు మీరు. అందరు ఉన్నా ఎవ్వరు లేని అనుభవం నాది. కనుక ఈ ఉత్తరం చేరిన వెంటనే వస్తారని ఆశగా ఎదురు చూస్తుంటాను. ఒక వేళ మీరు వచ్చేలోపు నేను కాలం చేస్తే! నన్ను నాన్న సమాధి పక్కనే దహనం చేయించండి. అమ్మగా ఇది నా చివరి కోరిక. తీరుస్తావుగా! ఉంటాను మరి.

శుభాశీస్సులు-

ప్రేమతో…
నీ తల్లి
బద్దిపూడి యశోదమ్మ