ఇప్పటి వరకూ సమ్మెను విరమించలేదు

– తెలంగాణ గ్రామ పంచాయతీ కార్మికులు, ఉద్యోగుల జేఏసీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
గ్రామపంచాయతీ కార్మికులు చేస్తున్న సమ్మెను ఇప్పటి వరకూ విరమించలేదనీ, అది కొనసాగుతుందని తెలంగాణ గ్రామ పంచాయతీ కార్మికులు, ఉద్యోగుల జేఏసీ స్పష్టం చేసింది. సోమవారం ఈ మేరకు జేఏసీ చైర్మెన్‌ పాలడుగు భాస్కర్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యజ్ఞనారాయణ, కన్వీనర్లు వెంకటరాజం, పి.అరుణ్‌కుమార్‌, శివబాబు, ఎన్‌.దాస్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. సమ్మెపై జేఏసీ పునరాలోచన చేస్తే సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ముందుకు వస్తుందని మంత్రుల నివాస సముదాయంలో జరిగిన చర్చల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు విజ్ఞప్తి చేశారని తెలిపారు. సమ్మె విరమిస్టే ఆర్థిక సంబంధం లేని డిమాండ్లను మూడు,నాలుగు రోజుల్లో హరీశ్‌రావుతో చర్చించి పరిష్కరిస్తామనీ, ఆర్థిక సంబంధమున్న అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్తామని మంత్రి హమీనిచ్చారని తెలిపారు. అవసరమైతే జేఏసీ నేతలను సీఎం కేసీఆర్‌ దగ్గరకు తీసుకెళ్తామనీ, సమ్మె విరమించాలని సూచించారని తెలిపారు.
తాము ఇప్పటికిప్పుడూ నిర్ణయం ప్రకటించలేమని జేఏసీ తరఫున మంత్రికి చెప్పామని పేర్కొన్నారు. మొదట యూనియన్లు విడివిడిగా సమావేశాలను నిర్వహించుకునీ, ఆ తర్వాత మంగళవారం హైదరాబాద్‌లో జేఏసీ సమావేశం పెడ్తామని తెలిపారు. ఆ సమావేశంలో కార్మికుల అభిప్రాయం మేరకు సమ్మెపై తుది నిర్ణయం ప్రకటిస్తామని స్పష్టం చేశారు. సమ్మె ప్రస్తుతం కొనసాగుతుందని తెలిపారు.