కదం తొక్కిన పోలవరం నిర్వాసితులు

Trampled Residents of Polavaram– సీపీఐ(‘ఎం) ఆధ్వర్యంలో జంతర్‌ మంతర్‌లో ధర్నా
– వివిధ ప్రజా సంఘాల సంఘీభావం
– పోలవరం నిర్వాసితులది జాతీయ సమస్య
– పరిహారం, పునరావాసం కేంద్రం బాధ్యతే
– ప్రధాని మోడీ, సీఎం జగన్‌ది ఆత్మ సమర్పణ: సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
పునరావాసం కల్పించాలని, పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ పోలవరం నిర్వాసితులు కదం తొక్కారు. తమ గోడును దేశ రాజధానిలో వినిపించారు. సోమవారం నాడిక్కడ జంతర్‌ మంతర్‌లో సీపీఐ(ఎం) ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. తొలిత హరికిషన్‌ సింగ్‌ సుర్జీత్‌ (హెచ్‌కేఎస్‌) భవన్‌ నుంచి సీపీఐ(ఎం) నేతలు, పోలవరం నిర్వాసితులు పాదయాత్ర చేసుకుంటూ కన్నట్‌ ప్లేస్‌ మీదుగా జంతర్‌ మంతర్‌కు చేరుకున్నారు. అక్కడ ప్లకార్డులు చేబూని మోడీ సర్కార్‌కు
పోలవరం నిర్వాసితులది జాతీయ సమస్య
న్యూఢిల్లీ : పోలవరం నిర్వాసితుల సమస్య జాతీయ సమస్యగా మారిందని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. పరిహారం, పునరావాసం కేంద్రం బాధ్యతేనని, అది పూర్తి కాకపోతే..ప్రాజెక్టు కొనసాగదని హెచ్చరించారు. సోమవారం నాడిక్కడ జంతర్‌ మంతర్‌లో సీపీఐ(ఎం) ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పోలవరం నిర్వాసితుల సమస్యలపై ధర్నా జరిగింది. ఈ ధర్నాను సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రారంభించి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఢిల్లీలో ధర్నా చేస్తున్నామని, ఢిల్లీ ద్వారా దేశం ముందుకు ఈ సమస్యను తీసుకొచ్చామని అన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు అని, దీనిపై నిర్ణయాలు తీసుకునే బాధ్యత కేంద్రంపై ఉంటుందని తెలిపారు. పునరావాసం అవసరమైన వనరులను సమకూర్చడం కేంద్రం బాధ్యతని పేర్కొన్నారు. ఏవైనా సమస్యలుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించుకోవాలని, అంతేతప్ప పోలవరం నిర్వాసితులను ఇబ్బంది పెట్టకూడదని పేర్కొన్నారు. రెండు ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాల్సి ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోడీకి జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం ఆత్మ సమర్పణ చేసుకుందని విమర్శించారు. 2014 రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్లో పోలవరం గురించి లేవనెత్తానని, కాంగ్రెస్‌ జాతీయ ప్రాజెక్టుగా విభజన చట్టంలో పొందుపరించిందని అన్నారు. అప్పుడు బీజేపీ కూడా పోలవరం పునరావాసం, పరిహారంపై ఒప్పుకుందని, కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చి నిధులు ఇవ్వటం లేదని విమర్శించారు.
గిరిజన హక్కులపై మోడీ సర్కార్‌ బుల్డోజర్‌ . బృందాకరత్‌
గిరిజన హక్కులపై మోడీ సర్కార్‌ బుల్డోజర్‌తో దాడి చేస్తుందని సీపీఐ(ఎం) పొలిట్‌ బ్యూరో సభ్యురాలు బృందాకరత్‌ ధ్వజమెత్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మద్దతుతో అభివృద్ధి పేరుతో పెట్టుబడిదారులు ఆదివాసీ గుండెలపై ప్రాజెక్టులు నిర్మిస్తున్నారని విమర్శించారు. జాతీయ ప్రాజెక్టు అంటున్నారని, ఆదివాసులు జాతీయులు కాదా? అని ప్రశ్నించారు. రాజ్యాంగంలోని 5, 6 షెడ్యూల్‌లో, అటవీ హక్కుల చట్టం, పంచాయతీ విస్తరణ షెడ్యూల్డ్‌ ప్రాంతాల చట్టం ఆదివాసుల హక్కులను స్పష్టం చేసిందని తెలిపారు. కానీ అందుకు భిన్నంగా పెట్టుబడిదారుల అభివృద్ధి కోసం మోడీ పని చేస్తున్నారని. మణిపూర్‌లోని గిరిజనుల భూములను కార్పొరేట్లకు ఇస్తున్నారని, జార్ఖండ్‌లో కూడా గిరిజనుల భూములను లాక్కొంటున్నారని, బెంగాల్‌లో కోల్‌ ప్రాజెక్టు పేరుతో వేలాది ఎకరాల ఆదివాసీ భూములను కేంద్రం తీసుకున్నదని విమర్శించారు. దీంతో ఆదివాసీ భూములు, హక్కుల, గుర్తింపు సవాల్‌గా మారిందని పేర్కొన్నారు. పార్లమెంట్‌లో అటవీ సంరక్షణ సవరణ చట్టం చేశారని, ఇది ఆదివాసులకు ఉండే హక్కులను హరిస్తుందని విమర్శించారు. గిరిజన భూములు తీసుకోవాలంటే గ్రామ సభలు నిర్వహించాలని, అయితే ఈ చట్టం గ్రామ సభల అవసరం లేకుండానే భూములు లాక్కొవచ్చని పేర్కొందన్నారు. మోడీ ప్రభుత్వం అదానీ, అంబానీ పక్షంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. ఈడీ, సీబీఐకి భయపడి ఏపీలో జగన్మోహన్‌ రెడ్డి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావటం లేదని, పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పక్షాన మాట్లాడటం లేదని విమర్శించారు.
జీవన్మరణ పోరాటం : అశోక్‌ ధావలే, విజ్జు కృష్ణన్‌
పోలవరం నిర్వాసితులు జీవన్మరణ పోరాటం చేస్తున్నారని ఏఐకెఎస్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అశోక్‌ ధావలే, విజ్జు కృష్ణన్‌ అన్నారు. పోలవరం నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండా కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తోందని విమర్శించారు. జగన్‌, చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ బీజేపీకి సేవ చేస్తున్నారని, పోలవరం నిర్వాసితుల సమస్యలను గాలికొదిలేశారని దుయ్యబట్టారు. ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చే వైసీపీ, టీడీపీ, బీజేపీలకు సరైన సమాధానం ఇవ్వాలని పిలుపునిచ్చారు.
టీడీపీకి పట్టిన గతే, వైసీపీకి పడుతుంది : బి.వెంకట్‌
ఏపీలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు గిరిజనులు, పేదల పక్షాన లేకుండా బీజేపీ పంచన చేరాయని ఏఐఎడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌ పేర్కొన్నారు. గతంలో టీడీపీకి పట్టిన గతే, వైసీపీకి పడుతుందని అన్నారు. బీజేపీతో ఉన్న పవన్‌ కళ్యాణ్‌ మరో జగన్మోహన్‌ రెడ్డిగా మారాడని విమర్శించారు.
గిరిజనులు జాతిలో భాగం కాదా?ణజితిన్‌ చౌదరి
ప్రధాని మోడీ ఎప్పుడూ జాతి అంటారని, గిరిజనులు జాతిలో భాగం కాదా? అని ఆదివాసీ అధికార్‌ రాష్ట్రీయ మంచ్‌ (ఎఎఆర్‌ఎం) జాతీయ కన్వీనర్‌, మాజీ ఎంపీ జితిన్‌ చౌదరి ప్రశ్నించారు. గిరిజన హక్కులను కేంద్ర ప్రభుత్వం హరిస్తోందని, గిరిజనులను భూముల నుంచి తరిమేసి, ప్రాజెక్టులు కడుతోందని విమర్శించారు. ఆదివాసీ కార్పొరేట్లకు కట్టబెట్టడమే లక్ష్యంగా చేసుకుందని దుయ్యబట్టారు. పోలవరం నిర్వాసితుల పోరాటానికి తమ సంఘం పూర్తి మద్దతు ఉంటుందని అన్నారు. నిర్వాసితుల సమస్యలు పరిష్కారం కాకుండా, ప్రాజెక్టు ఎలా ముందుకు సాగుతోందని ప్రశ్నించారు.
పార్లమెంట్‌లో లేవనెత్తుత్ణాం వి.శివదాసన్‌
పోలవరం నిర్వాసితుల సమస్యలపై పార్లమెంట్‌లో లేవనెత్తుతామని సీపీఐ(ఎం) రాజ్యసభ ఎంపీ వి.శివదాసన్‌ హామీ ఇచ్చారు. ఏపీ ప్రభుత్వానికి ప్రజల సమస్యలు పట్టవని, వారు బీజేపీకి మద్దతుగా ఉన్నారని అన్నారు. కార్పొరేట్లకు సాగిలపడటమే ధ్యేయంగా పని చేసే బీజేపీలానే, వైసీపీ కూడా కార్పొరేట్ల కోసమే పని చేస్తుందని విమర్శించారు.