ఎమ్మెల్యే ఓకే అంటేనే గృహాలకిë

– అవి కూడా అందరికి కాదు.. కొందరికే
– రంగారెడ్డి జిల్లాకు 22,150 గృహాలు
– ప్రతి నియోజకవర్గానికీ మూడువేల లోపే
– ఆన్‌లైన్‌ ద్వారానే గృహలక్ష్మి దరఖాస్తులు
– ఇంకా ప్రారంభం కాని దరఖాస్తుల స్వీకరణ
– సొంతింటి జాగా ఉంటేనే రూ.3లక్షల సాయం
– ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నిర్మాణం చేయాలి
– ఎమ్మెల్యే, మంత్రికి దరఖాస్తులు ఇచ్చే అవకాశం
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
స్వరాష్ట్రంలో సొంతింటి కల నెరవేరుతుందనుకున్నారు. దశాబ్ద కాలం పూర్తయింది. ప్రభుత్వ ఇల్లు రాలేదు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లకు చరమగీతం పాడింది. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు ఇస్తామన్నది. ఒకటీ రెండు ప్రాంతాల్లో నిర్మాణం జరిగినా లబ్ధిదారుల ఎంపిక జరగలేదు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్టుగా ఉంది. ఇక సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం గృహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా సొంతింటి జాగ ఉన్న పేదలకు రూ.3లక్షల ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించింది. ఆ మేరకు మార్గదర్శకాలు తయారు చేసింది. అయితే రంగారెడ్డి జిల్లాలో ఇప్పటికే డబుల్‌ ఇండ్లపేరుతో కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు వచ్చి పడుతుంటే గృహాలకిë ద్వారా రంగారెడ్డి జిల్లాకు కేవలం 22,150 మందికి మాత్రమే ఇండ్లను కేటాయిచింది. నియోజకవర్గాల వారీగా ఎంతమంది అర్హులు దరఖాస్తు చేసుకున్న తామిచ్చేది మాత్రం 3000లోపే అని ఖరాకండిగా ప్రకటించింది. ఒక్కో నియోజకవర్గంలో 1500 మొదలు 3వేల లోపు ఇండ్లను మంజూరు చేసింది. ఎన్నికల తరుణంలో గృహలక్ష్మి దారానైన తమ సొంతింటి కల నెరవేరుతుందని ఆశపడిన పేదలకు నాశనీపాతంగా మారింది. పైగా ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు స్వీకరిస్తామని చెప్పిన ఇంకా సైట్‌ ఓపెన్‌ కాలేదు. దాంతో అనేకమంది లబ్దిదారులు రెవెన్యూ, మున్సిపల్‌, గ్రామపంచాయతీ కార్యాలయాల చుట్టూ దరఖాస్తులు పట్టుకుని తిరుగుతున్నారు. తమకు సంబంధం లేదని అధికారులు తిప్పి పంపిస్తున్నారు. అయినా అన్ని అర్హతలున్నా.. ఎమ్మెల్యే ఓకే అంటేనే గృహలకిë వరిస్తుంది.

రంగారెడ్డి జిల్లాలోని మొత్తం ఎనిమిది అసెంబ్లీ స్థానాలున్నాయి. ఒక్కొ నియోజకవర్గంలో నాలుగు నుంచి ఐదు మండలాలకు తగ్గకుండా ఉన్నాయి. ఇదిలా ఉంటే మున్సిపాలిటీలు ఉండనే ఉన్నాయి. ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ఆయా నియోజకవర్గాలకు 1500 నుంచి 3000 వరకు గృహలక్ష్మి ఇండ్లను మంజూరు చేస్తామని ప్రకటించింది. వాటిని పరిశీలిస్తే శేరిలింగంపల్లికి 3000, చేవెళ్లకు 2500, ఇబ్రహీంపట్నానికి 3000, రాజేంద్రనగర్‌కు 3000, మహేశ్వరానికి 3000, కల్వకుర్తికి 1650, షాద్‌నగర్‌కు 3000కు, ఎల్బీనగర్‌ నియోజకవర్గానికి 3000 చొప్పున గృహలక్ష్మి ఇండ్లను కేటాయించింది. దాంతో అనేకమంది లబ్ధిదారులు పథకంపై ఆరంభంలోనే పెదవి విరుస్తున్నారు. ఎన్నికల స్టంటు అంటూ మండిపడుతున్నారు. ఎన్నికల ముందు కొద్ది మందికి ఇచ్చి ఓట్లు దండుకోవడానికేనంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరో దళితబంధు, మూడెకరాల భూమి మాదిరిగానే మారుతుందేమోనని విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. దరఖాస్తు చేసుకున్న అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి గృహలక్ష్మి మంజూరు చేయాలని పేదలు డిమాండ్‌ చేస్తున్నారు.
ఎమ్మెల్యే అనుకున్నోళ్లకే..
గృహలక్ష్మి పథకం కింద రూ.3 లక్షల ఆర్థిక సాయం అందించనున్నారు. గృహలక్ష్మి పథకానికి ఆన్‌లైన్‌లో త్వరలోనే దరఖాస్తులు స్వీకరించేలా రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించింది. తాజాగా దరఖాస్తుల ప్రక్రియ షురూ అయ్యిందని ప్రభుత్వం చెబుతోందని కానీ ఇంకా ఆన్‌లైన్‌ సైట్‌ ఓపెన్‌ కావడం లేదు. సొంత జాగా ఉన్న వారు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ ద్వారా స్థానిక ఎమ్మెల్యేకు దరఖాస్తులు పంపాల్సి ఉంటుంది. ఆ దరఖాస్తులను కలెక్టర్‌ నేతృత్వంలో పరిశీలన చేసి అర్హులైన వారిని గుర్తిస్తారని ప్రభుత్వం పేర్కొంది. ఇలా గుర్తించిన అర్హుల జాబితాను జిల్లా మంత్రి సబితారెడ్డి మంజూరు చేస్తారు. ప్రతి నియోజకవర్గానికి 1500 నుంచి మూడు వేల ఇండ్ల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఒక్కోఇంటికి రూ.3 లక్షల ఆర్థిక సాయం. ఇది పూర్తిగా సబ్సిడీ. లబ్ధిదారులు తిరిగి చెల్లించాల్సిన పని లేదు. ప్రతి నియోజకవర్గంలో ఎస్సీలకు 20శాతం, ఎస్టీలకు 10శాతం, వికలాంగులకు 5శాతం, బీసీలు, మైనార్టీలకు 50శాతం తగ్గకుండా ప్రాధాన్యం కల్పిస్తారు.
జీవో 59 లబ్దిదారులు అనార్హులు
గతంలో ఇంటి నిర్మాణం చేసుకున్న వారు, 59 జీవోతో లబ్ది పొందినవారు ఈ పథకానికి అనర్హులు. గృహలక్ష్మి పథకం కింద మంజూరయ్యే ఇంటిని మహిళ పేరు మీద ఇస్తారు. లబ్ధిదారుడు స్థానిక వాస్తవ్యుడై ఉండాలి. లబ్ధిదారులు నిర్మించుకునే ఇండ్లను మండల స్థాయిలో మండల అధికారులు పర్యవేక్షణ చేస్తారు. నిర్మాణాల పురోగతిని ఎప్పటికప్పడు పర్యవేక్షణ చేసి ఆ ఇంటి నిర్మాణ వివిధ దశల ఫొటోలను సేకరిస్తారు. ఇంటి నిర్మాణంలో లబ్ధిదారుడి ఇష్టం వచ్చిన డిజైన్‌లో నిర్మాణం చేసుకోవచ్చు. ఇంటి నిర్మాణంలో కనీసం రెండు గదులు, మరుగుదొడ్డి మాత్రం తప్పనిసరిగా ఉండాలని మార్గదర్శకాల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇంటి నిర్మాణ పనుల్లో భాగంగా బేస్‌మెట్‌, రూప్‌లేవల్‌, పూర్తిస్థాయి నిర్మాణం ఇలా అన్ని దశలో ఫొటోలను తీసుకుంటారు. నిర్మాణ పురోగతిని బట్టి మూడు దశలో బిల్లులు అందిస్తారు. లబ్దిదారుల చేత ప్రత్యేకంగా బ్యాంక్‌ ఖాతా తీయించి ఒక్కో దశకు రూ.లక్ష చొప్పున నేరుగా లబ్దిదారుడి వ్యక్తిగత బ్యాంక్‌ ఖాతాలో జమ చేస్తారు.
అందరికీ ఇవ్వాల్సిందే
దరఖాస్తు చేసుకున్న అందరికీ గృహలకిë ఇవ్వాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వం ఇండ్ల పేరుతో ఓట్లు దండుకోవాలనుకుంటుంది. నియోజకవర్గానికి కేవలం 3వేలలోపు ఇండ్లు ఇవ్వడం సరికాదు. అది కూడా జిల్లా కలెక్టర్‌ పర్యవేక్షణలోనే లబ్ధిదారుల ఎంపిక జరగాలి. ఎమ్మెల్యేలు, మంత్రుల జోక్యం అవసరం లేదు. పేదలు చేసుకున్న దరఖాస్తు ఎమ్మెల్యేలు పరిశీలించడం, కలెక్టర్‌కు పంపడం, మంత్రి ఇండ్లను మంజూరు చేయడం సరికాదు. పేదలందరికి న్యాయం చేయాలి.
సామెల్‌ (సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు )