నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్ర వ్యాప్తంగా గృహలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసేందుకు గడువు పొడిగించాలని డీవైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండీ జాదేద్ బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. దరఖాస్తు చేసేందుకు మూడు రోజులే సమయం ఇవ్వడంతో అన్ని మండల కార్యాలయాల్లో కులం, ఇతర సర్టిఫికెట్లను తీసుకోవడానికి సమయం సరిపోవడం లేదని తెలిపారు. దీంతో అర్హులైన ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైన్ షాపులు, బార్ షాపుల టెండర్ల దాఖలుకు మాత్రం 15 రోజులపాటు సమయమిచ్చిన ప్రభుత్వం, గృహలక్ష్మి పథకానికి మూడు రోజులే ఇవ్వడం సరైంది కాదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఈనెల 30 వరకు గృహలక్ష్మి పథకం దరఖాస్తులను స్వీకరించాలని కోరారు.