– కాళేశ్వరానికి ఒక్క పైసా ఇచ్చినట్టు నిరూపిస్తే…
– బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబేపై బీఆర్ఎస్ ఎంపీల సభా హక్కుల ఉల్లంఘన నోటీసు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఒక్క పైసా ఇచ్చినట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తామని బీఆర్ఎస్ ఎంపీలు స్పష్టం చేశారు. కాళేశ్వరానికి రూ.86 వేల కోట్లు ఇచ్చామని పార్లమెంట్లో బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే తప్పుడు ప్రకటన చేశారని విమర్శించారు. గురువారం నాడిక్కడ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎంపీలు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కాళేశ్వరానికి కోట్లు కాదు, ఒక్క రూపాయి, కనీసం ఒక్క పైసా ఇచ్చినట్టు నిరూపించినా తామంతా తమ పదవులకు రాజీనామా చేస్తామని తెలిపారు. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు మాట్లాడుతూ ప్రపంచంలోని పెద్ద ప్రాజెక్టు కాళేశ్వరానికి రూపాయి సహాయం చేయని కేంద్ర ప్రభుత్వం తామే నిధులు ఇచ్చామని అబద్ధాలు చెబుతోందని విమర్శించారు. బీఆర్ఎస్ లోక్‌సభా పక్షనేత నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం చర్చలో రాష్ట్ర విభజన చట్టంలోని హామీలు అమలు చేయకపోవడం, వైద్య కళాశాలలు, నవోదయ, విద్యాలయాల మంజూరు విషయంలో మొండిచేయి చూపడాన్ని దేశం దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం చూపుతున్న వివక్షను, కక్షసాధింపును వివరిస్తుంటే స్పీకర్ తన మైక్ కట్ చేసి పాయింట్ అఫ్ ఆర్డర్ కింద నిషికాంత్ దూబేకు అవకాశం ఇచ్చారన్నారు. దూబే కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.86 వేల కోట్లు ఇచ్చామని పచ్చి అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. సభను తప్పుదోవ పట్టించినందున ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చామని తెలిపారు. రూపాయి నిధులు ఇవ్వకపోగా తామే కట్టి ఇచ్చామన్నట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు డీపీఆర్ ప్రకారం రూ. 80 వేల కోట్లు ఖర్చు చేస్తే, రూ.86 వేల కోట్లు ఇచ్చామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తామెన్నిసార్లు అడిగినా కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హౌదా ఇవ్వలేదని విమర్శించారు. బీఆర్ఎస్ లోక్‌సభ పక్ష ఉపనేత కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం రుణాలు తీసుకుందని, కేంద్రానికి చిత్తశుద్ధి, దమ్ము ఉంటే ఆ రుణాలు మాఫీ చేయాలని కోరారు. అలా చేస్తే తామే ప్రధాని మోడీకి సన్మానం చేస్తామన్నారు. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి లిక్కర్, నిక్కర్ అంటూ పిచ్చి వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. రేవంత్ రెడ్డి రాజకీయంగా పోరాడాలే తప్ప దూషణలు చేయడం తగదన్నారు. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దేశానికి ఏం చేసిందో చెప్పలేక చెబుతూ సభను పక్కదోవ పట్టిస్తోందన్నారు. కేసీఆర్ నిజామాబాద్‌లో పోటీ చేయాలని ధర్మపురి ఆరవింద్ అంటున్నారని, ఆయనపై పోటీకి కేసీఆర్ అవసరం లేదని, తాము నిలబెట్టే వాళ్లపై అరవింద్ గెలిస్తే చాలన్నారు. రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ కేసీఆర్‌ను విమర్శించే స్థాయి రేవంత్ రెడ్డికి లేదన్నారు. సమావేశంలో ఎంపీలు మన్నె శ్రీనివాసరెడ్డి, వెంకటేష్ నేత, పి. రాములు, ఎం. కవిత, బిబి పాటిల్, పసునూరి దయాకర్ తదితరులు పాల్గొన్నారు.