– పెట్రోల్ పోసి కాల్చిన దుండగులు
– పూర్తిగా కాలిన మృతదేహం
శంషాబాద్‌లో మహిళ దారుణ హత్య
నవతెలంగాణ-శంషాబాద్
శంషాబాద్‌లో ఓ మహిళను దుండగులు దారుణంగా హత్య చేసి, ఆపై పెట్రోల్ పోసి నిప్పుంటించారు. ఆనవాళ్లు కూడా లేకుండా చేశారు. మృతదేహం గుర్తుపట్టలేనంతగా కాలిపోయింది. జన సంచారం ఉన్నచోట ఈ దారుణ హత్య జరగడం స్థానికంగా సంచలనం రేపింది. విషయం తెలుసుకున్న ఏసీపీ రామచంద్రరావు, స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఆర్.శ్రీనివాస్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఆర్‌జీఐ ఎయిర్‌పోర్టు పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం వెలుగుజూసింది. ఏసీపీ తెలిపిన వివరాల ప్రకారం.. అస్సాం రాష్ట్రం టీన్సుకే జిల్లా లేకపని గ్రామానికి చెందిన సూరజ్‌రావు శంషాబాద్‌లోని డీటీసీపీలో లేబర్‌గా పనిచేస్తున్నాడు. శ్రీనివాస ఎన్‌క్లేవ్ ఎస్వీ నిలయంలో ఒక గదిలో నివాసం ఉంటున్నాడు. గురువారం అర్ధరాత్రి డీటీసీపీలో పని ముగించుకొని తన నివాసానికెళ్లాడు. ఈ క్రమంలో సమీపంలో ఏదో తగలబడుతున్నట్టుగా గమనించాడు. వెంటనే తన సహచరులు జీవన్ తాపా, లలిత్ ప్రధాన్‌కు ఫోన్ చేసి విషయం చెప్పాడు. వారితో కలిసి ఘటనాస్థలానికెళ్లారు. అక్కడ ఎవరినో చంపేసి తగలబెట్టినట్టు గుర్తించి వెంటనే 100 నెంబర్‌కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. సుమారు 35- 40 ఏండ్ల వయసున్న గుర్తు తెలియని మహిళను హత్య చేసి పెట్రోల్ పోసి నిప్పంటించినట్టు గుర్తించారు. గుర్తుపట్టరానంతగా కాలిపోయింది. మృతురాలి కాళ్లకు మెట్టెలు, ఇతర ఆధారాలతో వివాహితగా తేల్చారు. పోలీసులు క్లూస్ టీంతో ఘటనా స్థలాన్ని తనిఖీ చేసి ఆధారాలు సేకరించారు. సీసీ టీవీ పుటేజ్‌లను పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను పట్టుకోవడం కోసం గాలింపు చేపట్టారు.