– మొన్న ఫలితాలు నిన్న అభ్యంతరాల స్వీకరణ
– నేటి సాయంత్రం 5లోగా చేరాల్సిందే
– అభ్యర్థులకు సరైన గడువివ్వని వైనం
– సెలవు రోజుల్లోనే హడావుడిగా ప్రక్రియ పూర్తి
– రిజర్వేషన్లకు తిలోదకాలు
– సమగ్ర శిక్ష అధికారుల ఇష్టారాజ్యం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు (కేజీబీవీ), అర్బన్ రెసిడెన్షియల్ స్కూళ్లు (యూఆర్‌ఎస్)లో కాంట్రాక్టు పోస్టుల భర్తీ ప్రక్రియ అంతా గుట్టుగా సాగుతున్నది. పాఠశాల విద్యాశాఖలో సమగ్ర శిక్ష అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గురువారం సాయంత్రం పరీక్షా ఫలితాలను విడుదల చేసి, శుక్రవారం ఉదయం 10 గంటలకే అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలనకు రావాలంటూ అధికారులు ఆదేశాలు జారీచేశారు. వచ్చిన వాళ్లతో ఆ ప్రక్రియను మమా అనిపించి, శనివారం తుది జాబితాను ప్రకటించారు. ఆయా పోస్టులకు ఎంపికైన వారు ఆదివారం సాయంత్రం ఐదు గంటల్లోపు చేరాలంటూ ఆదేశాలిచ్చారు. అసలు ఫలితాలను సరిగ్గా చూసుకోక ముందే రెండ్రోజుల్లోనే అదీ సెలవు దినాల్లో ఈ ప్రక్రియను పూర్తి చేస్తుండడంపై పలు అనుమానాలకు తావిస్తున్నది. అభ్యర్థులు ఫలితాలను చూసుకుని, అభ్యంతరాలను చెప్పేందుకు సరిపోయినంతగా గడువు ఇవ్వకపోవడమే అందుకు నిదర్శనం. ఇంకోవైపు ఈ నియామకాల్లో రిజర్వేషన్లకు తిలోదకాలిచ్చారంటూ అభ్యర్థులు విమర్శిస్తున్నారు. ఇంత గుట్టుగా నియామకాలు చేపట్టడం వెనుక ఎంపికైన అభ్యర్థుల నుంచి అధికారులు ముడుపులు తీసుకోవడమే కారణమని పలువురు ఆరోపిస్తున్నాయి.
వర్షాల సమయంలోనూ పరీక్షల నిర్వహణ
కేజీబీవీ, యూఆర్‌ఎస్‌లో ఖాళీగా ఉన్న 1,241 సీఆర్టీ, పీజీసీఆర్టీ, స్పెషల్ ఆఫీసర్ తదితర పోస్టులకు గతనెల 24,25,26 తేదీల్లో సమగ్ర శిక్ష అధికారులు ఆన్‌లైన్‌లో పరీక్షలను నిర్వహించారు. ఈ పోస్టులకు మొత్తం 43,056 మంది దరఖాస్తు చేసుకుంటే, 34,797 మంది పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షల నిర్వహణ సమయంలో భారీ వర్షాలు వచ్చినా.. ప్రభుత్వం అధికారికంగా సెలవులు ప్రకటించినా వాటిని మాత్రం యధాతథంగా నిర్వహించారు. ఈ సమయంలో చాలామంది అభ్యర్థులు అనేక ఇబ్బందులతో పరీక్షలకు హాజరుకాగా, కొందరు వర్షాలతో రాయలేకపోయారు. గురువారం రాత్రి వాటి ఫలితాలను విడుదల చేసి, పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్‌లో వ్యక్తిగత ర్యాంకు కార్డులను అందుబాటులో ఉంచారు. ఒక్కో పోస్టుకు1:3 నిష్పత్తిలో శుక్రవారం ఉదయం 10 గంటలకే డీఈఓ కార్యాలయాల్లో ధ్రువపత్రాల పరిశీలనకు రావాలంటూ అభ్యర్థులను ఆదేశించారు. రాత్రి ఎనిమిది నుంచి 12 గంటల వరకు డీఈవో కార్యాలయాల్లోని అధికారులు ఫోన్ చేసి సమాచారం అందించారు. అయితే కొందరు అభ్యర్థుల ఫోన్ కలవకపోవడంతో వారికి సమాచారం అందలేదు. మరికొందరు హైదరాబాద్‌లో ఇతర పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. ఇంకొందరు గురుకుల బోర్డు నిర్వహిస్తున్న పరీక్షలు రాస్తున్నారు. కొందరు ధ్రువపత్రాలు కాలేజీల్లో ఉన్నాయంటూ సమాచారమిచ్చారు. ఇలా వివిధ కారణాలతో చాలా మంది అభ్యర్థులు హడావుడిగా ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కాలేకపోయారు. అయితే చాలా మంది అభ్యర్థులకు ఎస్‌ఎస్‌ఏలోని కొందరు అధికారులు ధ్రువపత్రాలను అందుబాటులో ఉంచుకోవాలంటూ ముందుగానే సమాచారం ఇచ్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కనీసం 1:3 అభ్యర్థుల మెరిట్ లిస్టు కూడా బయట పెట్టకుండా చేయడం ఏంటని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో ఓ సబ్జెక్టు టాపర్‌కు సమాచారం అందలేదని తెలిసింది. ఇంకోవైపు ధ్రువపత్రాల పరిశీలనకు కనీసం వారంరోజులపాటు సమయం ఇవ్వాల్సి ఉంటుందని అభ్యర్థులు వాపోతున్నారు. ఈ నియామక కమిటీకీ చైర్మెన్‌గా కలెక్టర్, వైస్ చైర్మెన్‌గా జాయింట్ కలెక్టర్ ఉన్నారు. సెలవు రోజుల్లో వారు అందుబాటులో ఉంటారో ఉండరో అనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఉత్తర్వులివ్వడంపై డీఈఓలూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనివెనుక భారీగా డబ్బులు చేతులు మారాయంటూ అభ్యర్థులు విమర్శలు చేస్తున్నారు. మరోపక్క కొందరు కోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నారు.