– బెఫీి సదస్సు ప్రారంభోత్సవంలో తపన్‌సేన్
చెన్నై : ప్రభుత్వ రంగాన్ని మొత్తంగా నిర్వీర్యం చేసి ప్రయివేటీకరణను పెద్ద ఎత్తున అమలు చేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యంగా వుందని సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తపన్ సేన్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ ప్రయివేటీకరణ చర్యలను వ్యతిరేకించాల్సిందిగా పిలుపునిచ్చారు. బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఈఎఫ్‌ఐ-బెఫీ) 11వ అఖిల భారత సదస్సును తపన్‌సేన్ ఇక్కడ ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. దేశ ఆర్థిక రంగ వ్యవహారాలకు సంబంధించి ప్రభుత్వం పాల్పడుతున్న నేరాలను, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లడం కార్మికవర్గం కర్తవ్యమని తపన్‌సేన్ అన్నారు. 1991లో సరళీకత ఆర్థిక విధానాలు అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఈ ప్రజా వ్యతిరేక విధానాలు ముమ్మరమయ్యాయన్నారు. 1960వ దశకంలో అమలు చేయబడిన బ్యాంకులు, బీమా సంస్థల జాతీయీకరణ వంటి ప్రయోజనకరమైన నిర్ణయాలకు నేడు ఎదురుదెబ్బ తగిలిందన్నారు. బ్యాంకింగ్ రంగంలో కొత్త సంస్కరణలను వేగంగా అమలు చేయడంతో బ్యాంకుల స్వరూపమే మారిపోయిందని అన్నారు. సదస్సు ప్రారంభోత్సవానికి ముందు నగరంలోని వైఎంసీఏ నుంచి సదస్సు జరిగే సభా స్థలి వరకు జరిగిన ర్యాలీలో పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు. బెఫీ అఖిల భారత అధ్యక్షులు సిజె నందకుమార్ జెండాను ఎగురవేశారు. అనంతరం అమరవీరుల మండపం వద్ద పూలమాలలు వేసి అమరవీరులకు నివాళులర్పించారు. ప్రారంభ సభకు నందకుమార్ అధ్యక్షత వహించారు. నిర్వాహక కమిటీ వైస్ చైర్మెన్ సింగరవేలన్ స్వాగతం పలికారు. ఈ సదస్సు సందర్భంగా సంస్థ తొలితరం నాయకులు, మాజీ ఆఫీస్ బేరర్లను సన్మానించారు. బ్యాంకింగ్ , బ్యాంకింగ్‌యేతర రంగాలకు చెందిన ట్రేడ్ యూనియన్ నాయకులు మరియు ప్రజా సంఘాల నాయకులు ప్రారంభ సభలో ప్రసంగించారు. బెఫీ తమిళనాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి రవికుమార్ కతజ్ఞతలు తెలియచేశారు. ఈ సదస్సు సోమవారం వరకు కొనసాగనుంది.