– గౌడ సంఘం తాలూకా అధ్యక్షులు చుక్క అల్లాజీ గౌడ్
– ఆమనగల్‌లో తాలూకా స్థాయి గౌడ సంక్షేమ సంఘం సమావేశం
– వైన్స్ షాపుల టెండర్లు రాకుంటే గౌడ, ఎస్సీ, ఎస్టీ ల రుసుము తిరిగి చెల్లించాలని డిమాండ్
– 18న సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలని పిలుపు
నవతెలంగాణ-ఆమనగల్
దళిత బంధు తరహాలో ప్రభుత్వం గౌడ బంధు ప్రకటించి రాష్ట్రంలోని గౌడ బిడ్డలందరికి గౌడ బంధు పథకం అమలు చేయాలని గౌడ సంక్షేమ సంఘం తాలూకా అధ్యక్షులు చుక్క అల్లాజీ గౌడ్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆమనగల్ పట్టణంలోని భవానీ గార్డెన్‌లో తాలూకా స్థాయి గౌడ సంఘం, యువజన సంఘం ముఖ్య నాయకుల ప్రత్యేక సమావేశం జరిగింది. ముందుగా రాష్ట్ర అప్కారి పాలసీలో గౌడలకు 14 శాతం రిజర్వేషన్ అమలు చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తోపాటు మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు కతజ్ఞతలు తెలిపారు. అనంతరం గౌడ సంఘం సీనియర్ నాయకులతో పాటు తాలూకా స్థాయి నాయకులు వివిధ అంశాలపై చర్చ నిర్వహించి చేపట్టాల్సిన వివిధ కార్యక్రమాలను తీర్మానించారు. వైన్స్ షాపుల టెండర్లలో గౌడ, ఎస్సీ ఎస్టీలకు టెండర్ రుసుము రద్దు చేయాలని, టెండర్లు దక్కని వారికి రుసుము తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీ యాక్ట్ లాగా బీసీ యాక్టును అమలు చేయాలని అన్నారు. ఈ నెల 18వ తేదీన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను గ్రామ స్థాయి నుంచి తాలూకా స్థాయి వరకు ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో భాగంగా ఇటీవల ఆమనగల్ లయన్స్ క్లబ్ అధ్యక్షులుగా ఎన్నికైన యాచారం వెంకటేశ్వర్లు గౌడ్‌ను పూలమాలలు శాలువాలతో ఘనంగా సన్మానించి సత్కరించారు. కార్యక్రమంలో తాలూకా గౌడ సంఘం మాజీ అధ్యక్షులు ఆయిళ్ళ శ్రీనివాస్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ విజేందర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి రాఘవేందర్ గౌడ్, యువజన సంఘం అధ్యక్షులు రుక్కుల్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఆనంద్ గౌడ్, ప్రధాన కార్యదర్శి జగన్ గౌడ్, కోశాధికారి రవీందర్ గౌడ్, బీసీ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు దుర్గయ్య గౌడ్, సీనియర్ నాయకులు బాలస్వామి గౌడ్, లాలయ్య గౌడ్, ఎల్లయ్య గౌడ్, గంగా రవీందర్ గౌడ్, చుక్క నిరంజన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.