– అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకుల ప్రయత్నం షూరు
– తాండూర్‌లో టికెట్ కోసం తీవ్ర పోటీ
– బీఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మధ్య పోరు
– బీజేపీ నుంచి డీసీసీబీ మాజీ చైర్మెన్ లక్ష్మారెడ్డి, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీకృష్ణగౌడ్ పోటీ
– టికెట్ మాకే వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్న నాయకులు
నవతెలంగా-తాండూరు
తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో కేంద్ర, రాష్ట్ర అధికార పార్టీల నాయకులు టికెట్ల వేటలో తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. ఎలాగైనా అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరపున నిలబడేందుకు నాయకులు తమదైన శైలిలో ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. దీంతో తీవ్ర పోటీ కొనసాగుతోంది. తమ పార్టీ టికెట్ తమకే వస్తుందని నాయకులు దీమా వ్యక్తం చేస్తున్నారు. వివిధ సందర్భాల్లో ఏర్పాటుచేసిన సమావేశాల్లో కూడా ప్రకటిస్తున్నారు.తాండూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి వివిధ అభివృద్ధి కార్యక్రమాలతో బిజీగా ఉంటూ తనదైన శైలిలో ముందుకు పోతున్నారు. తాండూర్ టికెట్ తనకే వస్తుందని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాండూరు ప్రజల కోసం ‘నేనున్నానని’ చెబుతున్నారు. అదేవిధంగా తాండూరు టికెట్ తనకే వస్తుందని ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి కూడా చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి అనుచరులు ఎవరు కలిసినా తాండూరు టికెట్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌కే వస్తుందని ప్రకటించుకుంటున్నారు. ఇదిలా ఉంటే మహేందర్‌రెడ్డి కాంగ్రెస్‌లోకి పోతారనే ప్రచారం జరుగుతోంది. కానీ ఎమ్మెల్సీ మాత్రం బీఆర్‌ఎస్ టికెట్‌పైనే ఆశలు పెట్టుకున్నారు. ఇందులో భాగంగానే పీఎంఆర్ ట్రస్టు పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతో బీఆర్‌ఎస్‌లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మధ్య టికెట్ రేస్ తీవ్రంగా ఉంది. ఇరువురు నేతలు తమకు టికెట్ వస్తుందనే దీమాతో ఉన్నారు.
బీజేపీలో టికెట్ కోసం పెరిగిన పోటీ..
బీజేపీ టికెట్ కోసం డీసీసీబీ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ మురళీకృష్ణగౌడ్ పోటీ పడుతున్నట్టు తెలుస్తుంది. ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి నుంచి దూరమైన లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నుంచి దూరమైన మురళీకృష్ణగౌడ్ ఈ ఇద్దరు నాయకులు బీజేపీలో టికెట్ కోసం పోటీ పడుతున్నారు. వీరు బీఆర్‌ఎస్ నుంచి కేంద్ర పెద్దల సమక్షంలో బీజేపీలో చేరారు. ఢిల్లీలో కేంద్ర నాయకులతో తమకే సత్సంబంధాలు ఉన్నాయని తమకే టికెట్ వస్తుందని ఇద్దరు నాయకులు దీమాతో ఉన్నారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్ కూడా టికెట్ కోసం పోటీలో ఉన్నట్టు సమాచారం. ఎవరు లేనప్పుడు పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్ పార్టీ కార్యక్రమాలను కొనసాగిస్తూ వచ్చారు. పెద్దేముల్ మండలానికి చెందిన ఈ ముగ్గురు నాయకులు టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు చేస్తున్నారు. అయితే బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు ఎవరికి టికెట్ ఇస్తాయో తెలియాలంటే మరిన్ని రోజులు వేచి చూడాల్సిందే.