పాత పెన్షన్‌ అమలు చేయాలి : టీఎస్‌ఈఈఎఫ్‌ డిమాండ్‌

Old pension should be implemented: TSEEF demandsనవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్ర విద్యుత్‌ సంస్థలు సహా ప్రభుత్వరంగంలో 1999 తర్వాత నియమితులైన ఉద్యోగులందరికీ పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని తెలంగాణ స్టేట్‌ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ ఫోరం (టీఎస్‌ఈఈఎఫ్‌) డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఫోరం నాయకులు శ్రీనివాస్‌, సురేష్‌బాబు పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ అంశంపై శనివారం నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో జరిగిన పాత పెన్షన్‌ సాధన సాకార సభలో పాల్గొని, టీఎస్‌సీపీఎస్‌ఈయూ అధ్యక్షులు స్థితప్రజ్ఞను కలిసి సంఘీభావం తెలిపామన్నారు. వారి ఆందోళనకు సంపూర్ణ మద్దతు ప్రకటించినట్టు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ ఉద్యోగుల ఫోరమ్‌ తరఫున విద్యుత్‌ సంస్థల్లో పనిచేస్తున్న 1999 తరువాత నియమితులైన ఉద్యోగులందరికీ పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని కోరుతున్న విషయాన్ని ఈ సందర్భంగా వారితో చర్చించామన్నారు. ఇటీవల రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌, పంజాబ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ తదితర రాష్ట్రాలు నూతన పెన్షన్‌ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేస్తున్నాయని గుర్తుచేశారు. తెలంగాణ లోను అదేవిధంగా అమలు చేయాలని గత పదిహేను సంవత్సరాలుగా టీఎస్‌సీపీఎస్‌ఈయూ ఆధ్వర్యంలో డిమాండ్‌ చేస్తున్నామనీ, న్యాయమైన తమ కోరికను తెలంగాణ ప్రభుత్వం తప్పని సరిగా నెరవేరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు