పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులను సహించం : డీజీపీ

నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
పని ప్రదేశాల్లో మహిళలపై లైంగికవేధింపులను ఏ మాత్రమూ సహించబోమనీ, ఈ విషయంలో జీరో టాలరెన్స్‌తో వ్యవహరిస్తామని రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్‌ హెచ్చరించారు. పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధానికి సంబంధించి డీజీపీ కార్యాలయంలో రాష్ట్ర మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యాన జరిగిన ఒక్కరోజు వర్క్‌షాప్‌ను శుక్రవారం అంజనీకుమార్‌ ప్రారంభించారు. ఈ వర్క్‌షాప్‌లో రాష్ట్రవ్యాప్తంగా 54 యూనిట్ల నుంచి 108 మంది మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంజనీకుమార్‌ మాట్లాడుతూ.. పని ప్రదేశాల్లో మహిళల పట్ల లైంగిక వేధింపులు జరగకుండా చూసేందుకు నియమించబడ్డ అంతర్గత కమిటీలు ఇలాంటి వ్యవహారాలపై చురుకుగా వ్యవహరించాలని ఆయన కోరారు. ముఖ్యంగా, ఈ వేధింపులను నిరోధించడానికి సంబంధించిన పోష్‌ చట్టంపై మహిళల్లో మరింత అవగాహనను పెంచాల్సిన అవసరం ఉన్నదన్నారు. ముఖ్యంగా, లైంగిక వేధింపులకు సంబంధించిన ఫిర్యాదులు వస్తే వాటిపై తీసుకునే చర్యలు పారదర్శకంగా ఉండాలని తెలిపారు. రాష్ట్రంలో మహిళల భద్రత పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో చర్యలు తీసుకుంటున్నదనీ, అందుకు సంబంధించి పోలీసు శాఖకు పూర్తి సహకారాన్ని అందిస్తున్నదన్నారు. పోలీసు శాఖ వైపు నుంచి కూడా షీటీమ్స్‌ ఏర్పాటు చేసి తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాలనిస్తున్నాయని తెలిపారు.
రాష్ట్ర మహిళా భద్రతా విభాగం అదనపు డీజీ షికా గోయెల్‌ మాట్లాడుతూ.. పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధానికి ఉద్దేశించిన పోష్‌ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయటానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.