
– ఆశా వర్కర్లు చేసే పని ప్రభుత్వం లో ఉన్న మంత్రులు ఎవరైనా ఒక్కరోజైనా చేయగలరా
– మంత్రి వర్గానికి సిఐటియు నూర్జహాన్ సూటి ప్రశ్న
నవతెలంగాణ- కంటేశ్వర్
పనిని బట్టి వేతనం తీసుకోవాల్సి వస్తే ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేల కంటే ఆశ వర్కర్లకే ఎక్కువ జీతం ఇవ్వాలని ఆశ వర్కర్లు చేసే పని ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఎవరైనా ఒక్కరైనా చేయగలరా అని మంత్రివర్గానికి సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ సూటిగా ప్రశ్నించారు.రాష్ట్రం లో కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో పని చేసిన ఆశా వర్కర్లు పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర వివక్ష ప్రదర్శిస్తూ,పనిని బట్టి పారితోషకం ఇస్తున్నారని,అట్లా పనిని బట్టి వేతనం తీసుకోవాల్సి వస్తే మంత్రి వర్గం లో ఉన్న వారందరి కంటే ఎక్కువ వేతనాలు ఆశా వర్కర్లు కి ఇవ్వాలని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం తెలంగాణా ఆశా వర్కర్లు యూనియన్, సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఖానాపూర్ చౌరస్తా నుండి కొత్త కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు.ప్రదర్శన అనంతరం ఆశా వర్కర్లు యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ..ఉదయాన్నే 7 గంటల మొదలు రాత్రి 7 గంటల వరకు గ్రామాల్లో, పిహెచ్సి లలో ప్రజల ఆరోగ్యాలతో పట్ల అత్యంత బాధ్యత గా ఆశా వర్కర్లు పని చేస్తున్నారని అన్నారు. తీవ్రమైన పని భారం ఉన్నప్పటికీ ప్రభుత్వం పని భారాన్ని తగ్గించడం కానీ,ఆంధ్ర ప్రదేశ్ లో మాదిరిగా ఆశా వర్కర్లు కి ఫిక్స్ డ్ వేతనం నిర్ణయించడం కానీ చేయడం లేదన్నారు.పనిని బట్టి పారితోషకం విధానం స్థానం లో నెలకు 18 వేల రూపాయలు ఫిక్స్ డ్ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.ధనిక రాష్ట్రం అని చెప్పుకునే బి.ఆర్.ఎస్ పాలకులకు క్షేత్ర స్థాయిలో కష్టపడి పని చేసే ఆశాలకు వేతనాలను నిర్ణయించడం లో ఎందుకు అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారని ప్రశ్నించారు.ప్రభుత్వం లో ఉన్న ఏ ఒక్క మంత్రైనా ఒక్క రోజు ఆశా వర్కర్లు చేసే పని చేయగలరా ఆని సవాల్ విసిరారు.తెలంగాణా రాష్ట్రం వచ్చిన దగ్గర నుండి ప్రభుత్వాన్ని ఫిక్స్ డ్ వేతనాన్ని డిమాండ్ చేసినప్పటికీ హామీలు మాత్రమే వస్తున్నాయని ఎద్దేవా చేసారు.ఈ పథకాన్ని మొత్తంగా రద్దు చేసి ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడానికి కూడా కేంద్రం బిజెపి వెనకాడటం లేదని అన్నారు.ఆశా డే రోజున మహిళలుగా ఉన్న ఆశా వర్కర్లు కి టాయిలెట్స్ సౌకర్యం,డ్రస్ మార్చుకునే సౌకర్యం లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.రెండవ ఏఎన్ఎం ట్రైనింగ్ తీసుకున్న ఆశా వర్కర్లు ని ఏఎన్ఎం లుగా రిక్రూట్మెంట్ లో తగిన వేయిటేజ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పారితోషకం లేని అదనపు పనులు ఆశా వర్కర్లు తో చేయించవద్దని,లెప్రసి సర్వేలో వస్తున్న ఇబ్బందులను పరిష్కరించడానికి ఒక వాలంటీర్ నియర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.2021 జూలై నుండి డిసెంబర్ వరకు ఆరు నెలల పి ఆర్ సి ఏరియర్స్ ని వెంటనే చెల్లించాలని కేంద్రం చెల్లించిన కరోనా రిస్క్ అలవెన్స్ నెలకు వెయ్యి చొప్పున పదహారు నెలల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.ప్రమాద భీమ, పిఎఫ్, ఈఎస్ఐ, సౌకర్యం అమలు చేయాలని,రిటైర్మెంట్ బెనిఫిట్స్ 10 లక్షలు ఇవ్వాలని లేని యెడల రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని ఆమె హెచ్చరించారు.నిజామాబాద్ జిల్లా జేసీ అడిషనల్ కలెక్టర్ యాదిరెడ్డి కి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారుకార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గోవర్ధన్ ఆశ యూనియన్ జిల్లా నాయకులు రేణుక సుకన్య బాలమణి రమ రాజమణి నీలోఫర్ లావణ్య సుజాత రేవతి రేణుక, లలిత భూలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.