– మూడేండ్లవుతున్నా పట్టింపులేదు
– రూ. లక్ష ఆర్థిక సహకారానికి దూరం
– ఎంబీసీ, ఓబీసీ జాబితాలో చేర్చని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
– ఆత్మగౌరవ భవనాల ఊసే లేదు.. కలగానే కృతజ్ఞతా సభ
నవతెలంగాణ-నవీపేట్
రాష్ట్ర ప్రభుత్వం కరోనా కాలంలో 17 కులాలను గుర్తిస్తూ బీసీ జాబితాలో చేర్చడంతో తమ తలరాతలు మారాయని ఆయా కులాల వారు సంబురాలు చేసుకున్నారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం సైతం చేశారు. అయితే కులాలను గుర్తించి మూడేండ్లవు తున్నా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంబీసీ, ఓబీసీ జాబితాలో చేర్చలేదని లబ్దిదారులు వాపోతున్నారు. తమ సంక్షేమానికి ఎలాంటి చర్యలూ తీసుకోలేదని, పథకాలూ ప్రవేశ పెట్టలేదని, అన్ని కులాలకు ఇస్తున్న సంక్షేమ పథకాలు సైతం తమకు అమలు కావడం లేదని 17 కులాల ప్రతినిధులు చెబుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం 2020 సెప్టెంబర్ 9వ తేదీన 17 కులాలను గుర్తించి.. జీవో ఎమ్‌ఎస్ నెంబర్ 03 విడుదల చేసింది. వాటిలో 13 కులాలు ఓడ్, బైలు కమ్మర(గిసాడి), క్షత్రియ రామ జోగి, బాగోతుల, తెర చీరల, ఏనుటి, గంజికూటివారు, గౌడ జెట్టి, కాకి పడగల, పటం వారు, సన్నాయిలా, తోలుబొమ్మలాట వారు (బొప్పల) సంచార కులాలను బీసీ-ఏ జాబితాలో, గౌలి, అహిర్, యాదవ్ కులాలను బీసీ-డీలో బీసీ కమిషన్ ద్వారా క్షేత్రస్థాయి విచారణ చేపట్టి చేర్చారు. కాగా, కుల వృత్తులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బీసీ జాబితాలోని కుల వృత్తుల కుటుంబాలకు లక్ష రూపాయల సహకారాన్ని అందిస్తుంది. కానీ ప్రభుత్వం ప్రకటించిన జాబితాలో ఈ కులాలను చేర్చకపోవడంతో నిరుత్సాహానికి గురవుతున్నారు. 100 శాతం అర్హత ఉన్న కులాలను ఎందుకు మరిచిపోతున్నారని కులాల ప్రతినిధులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తమ కులాలను ఆర్థిక సహకారంలో చేర్చాలని కోరారు.
ఆత్మగౌరవ భవనాల ఊసేలేదు..
2018 ఎన్నికల కంటే ముందు గుర్తింపు లేని కులాలను గుర్తించి హైదరాబాద్ కేంద్రంగా ఆత్మగౌరవ భవనాలు నిర్మించి సమాజంలో ఆత్మగౌరవాన్ని కల్పిస్తామని అప్పటి బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న ప్రకటించారు. మళ్లీ అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఈ కులాలను గుర్తించి ఆత్మగౌరవ భవనాలను కేటాయించలేదన్నారు. అలాగే, 2022 ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీడ్ పథకంలో, ఓబీసీ జాబితాలోనూ తమ కులాలను చేర్చాలని ఆయా కులాల ప్రతినిధులు కోరుతున్నారు.
రాజకీయ కృతజ్ఞతా సభ..
77 ఏండ్ల స్వతంత్య్ర భారతదేశంలో గుర్తించని అనేక కులాలను తెలంగాణ ప్రభుత్వం మూడేండ్ల కిందట గుర్తించింది. దాంతో తమకు సమాజంలో ఆత్మగౌరవాన్ని పెంపొందించడంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఈ కులాల ప్రతినిధులు కృతజ్ఞతా సభ ఏర్పాటు చేయాలని భావించారు. కానీ ఆ సమయంలో కరోనా కారణంగా జరగలేదు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. మూడేండ్ల తర్వాత జీవో జారీ చేసిన తేదీ సెప్టెంబర్ 9న హైదరాబాద్‌లో కృతజ్ఞతా సభకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. ఈ 17కులాల కింద రాష్ట్రంలో సుమారు 2 లక్షల జనాభా ఉండటంతో వీరి ప్రభావం 40 స్థానాలపై ఉందని తెలుస్తోంది. ఈ కులాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుతోనే న్యాయం జరుగుతుందని కులాల ప్రతినిధులు ఆశిస్తున్నారు.
ఐక్యతతో కృతజ్ఞతా సభను విజయవంతం చేస్తాం..
తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి, దశాబ్దల అలుపెరగని ప్రయత్నాలతో రాష్ట్ర ప్రభుత్వం తమ కులాలకు గుర్తింపు ఇచ్చి ఆత్మగౌరవాన్ని ఇచ్చింది. దానికి కృతజ్ఞతగా హైదరాబాద్‌లో 17 కులాల ప్రతినిధుల ఐక్యతతో సభను ఏర్పాటుచేస్తున్నాం. దాన్ని విజయవంతం చేసి తమ న్యాయమైన కోరికలను సాధించుకునే దిశగా ముందడుగు వేస్తాం.
జాదవ్ శరత్, ఓడ్ కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నవీపేట్, నిజామాబాద్ జిల్లా
సామాజిక న్యాయం జరుగుతుందనే నమ్మకంతో ఉన్నాం
రాష్ట్ర ప్రభుత్వంతోనే తమకు విద్య, ఉపాధి, సామాజిక న్యాయం లభిస్తుందనే నమ్మకంతో ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు స్పందించి ప్రత్యేక పథకాలతో అభివృద్ధికి కృషి చేయాలని కోరుతున్నాం.
కొంగల రాంప్రసాద్, కరీంనగర్
స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినం
లక్ష రూపాయల ఆర్థిక సహకారం లో ఎంపికైనప్పటికీ కులవృత్తుల జాబితాలో కులం పేరు లేదని శాంక్షన్ అయిన చెక్కును పక్కన పెట్టారు. ఈ విషయాన్ని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు న్యాయం జరగలేదు. దశాబ్దాలుగా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరంగా ఉన్న మాలాంటి సంచార కులాలకు ప్రభుత్వ పెద్దలే న్యాయం చేయాలి.
రాన్మతి నగేష్, బైలు కమ్మర(గిసాడి), జాకోర, బాన్సువాడ