ఈసెట్‌లో 88.53 శాతం మందికి సీట్ల కేటాయింపు

– సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ గడువు 29
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో ఇంజినీరింగ్‌, బీ ఫార్మసీ, బీఎస్సీ మ్యాథమెటిక్స్‌ కోర్సుల్లో 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి ద్వితీయ సంవత్సరంలో (లాటరల్‌ ఎంట్రీ) ప్రవేశాలకు నిర్వహించిన ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (ఈసెట్‌) రెండో విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియలో శుక్రవారం సాంకేతిక విద్యాశాఖ సీట్లు కేటాయించింది. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌, ఈసెట్‌ ప్రవేశాల కన్వీనర్‌ వాకాటి కరుణ ఒక ప్రకటన విడుదల చేశారు. 170 ఇంజినీరింగ్‌ కాలేజీల్లో 11,855 సీట్లుంటే, 10.496 (88.53 శాతం) మంది అభ్యర్థులకు సీట్లు కేటాయించామని పేర్కొన్నారు. 1,359 (11.47 శాతం) సీట్లు మిగిలిపోయాయని తెలిపారు. 117 ఫార్మసీ కాలేజీల్లో 1,228 సీట్లుంటే, 77 (6.27 శాతం) మంది అభ్యర్థులకు సీట్లు కేటాయించామని వివరించారు. ఇంకా 1,151 (93.73 శాతం) సీట్లు మిగిలిపోయాయని వివరించారు. రెండోవిడతలో స్లైడింగ్‌ ద్వారా 1,901 మంది అభ్యర్థులు పొందారని తెలిపారు. కొత్తగా 1,639 మందికి సీట్లు కేటాయించామని పేర్కొ న్నారు. సరిపోయినన్ని వెబ్‌ఆప్షన్లను నమోదు చేయక పోవడం వల్ల 2,603 మంది అభ్యర్థులు సీట్లు పొందలేక పోయారని తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన తరగతులు (ఈడబ్ల్యూఎస్‌) కోటా కింద 640 మంది సీట్లు పొందారని పేర్కొన్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు అలాట్‌మెంట్‌ ఆర్డర్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు. ఆన్‌లైన్‌ ద్వారా ట్యూషన్‌ఫీజును చెల్లించాలని కోరారు. సీట్లు కేటాయించిన అభ్యర్థులు వెబ్‌సైట్‌ ద్వారా సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేసే గడువు ఈనెల 29 వరకు ఉందని వివరించారు. సీట్లు పొందిన అభ్యర్థులు ఈనెల 26 నుంచి 29 వరకు కాలేజీల్లో రిపోర్టు చేయాలని కోరారు.
కంప్యూటర్‌ సైన్స్‌లో 84.75 శాతం మంది చేరిక
కంప్యూటర్‌ సైన్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) అనుబంధ కోర్సుల్లో 6,989 సీట్లుంటే, 5,923 (84.75 శాతం) మంది అభ్యర్థులకు సీట్లు కేటాయించామని వాకాటి కరుణ తెలిపారు. 1,066 (15.25 శాతం) సీట్లు మిగిలాయని వివరించారు. ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రికల్‌ కోర్సుల్లో 2,932 సీట్లకుగాను 2,783 (94.92 శాతం) మంది అభ్యర్థులు సీట్లు పొందారని పేర్కొన్నారు. ఇందులో 149 (5.08 శాతం) సీట్లు మిగిలిపోయాయని తెలిపారు.
సివిల్‌, మెకానికల్‌ అనుబంధ కోర్సుల్లో 1,639 సీట్లుంటే, 1,598 (97.50 శాతం) మంది అభ్యర్థులకు సీట్లు కేటాయించామని వివరించారు. ఇందులో కేవలం 41 (2.5 శాతం) సీట్లు మిగిలాయని పేర్కొన్నారు. ఇతర ఇంజినీరింగ్‌ కోర్సుల్లో 295 సీట్లకుగాను 192 (65.08 శాతం) మందికి సీట్లు కేటాయించామని తెలిపారు. ఇందులో 103 (34.92 శాతం) సీట్లు మిగిలాయని వివరించారు. బీ ఫార్మసీలో 1,228 సీట్లుంటే, 77 మందికి సీట్లు కేటారుంచామనీ, 1,151 సీట్లు మిగిలాయని తెలిపారు. సీట్ల కేటాయింపు, ఇతర వివరాలకు https://tsecet.nic.in  వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.