– 5,089కి అనుమతించడం కంటి తుడుపు చర్యే
– ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలి : ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను డీఎస్సీ ద్వారా వెంటనే భర్తీ చేయాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి శనివారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్ పాఠశాలల్లో 5,089 పోస్టులకే డీిఎస్సీ వేస్తామంటూ ప్రభుత్వం జీవో జారీ చేయడం, నిరుద్యోగులకు కంటితుడుపు చర్య మాత్రమేనని పేర్కొన్నారు. వాస్తవంగా 22 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులకు ఖాళీలుంటే, అందులో నాల్గవ వంతు కూడా భర్తీ చేసేందుకు డీఎస్సీ వేయకపోవటం శోచనీయమ ని తెలిపారు. పాఠశాల విద్యలో 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఐదు లక్షల మందికి చదువు చెప్పే గురుకులాలను చూపించి, మిగిలిన ప్రభుత్వ పాఠశాలల్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ, మండల పరిషత్, గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలలు ఒక్కరు, ఇద్దరు ఉపాధ్యాయులతో మనుగడ కోల్పోతున్నాయని తెలిపారు. రెండేండ్ల నుంచి ఉపాధ్యాయుల సర్దుబాటు పేరుతో తంతు నిర్వహిస్తూ, విద్యార్థులున్న పాఠశాలలకు ఉపాధ్యాయులను సర్దుబాటు చేయలేకపోతున్నారని తెలిపారు. దీంతో చేరిన విద్యార్థులు కూడా తిరిగి ప్రయివేటు పాఠశాలలకు వెళ్ళిపోతున్నారని పేర్కొన్నారు. భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని బొమ్మనపల్లి ప్రాథమిక పాఠశాలను ఆగస్టు 23న సందర్శించాననీ, అక్కడ ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారని తెలిపారు. ఐదు తరగతులకు ఇద్దరే ఉపాధ్యాయులున్నారనీ, 70పైగా ఉన్న విద్యార్థుల్లో 10 మంది విద్యార్థులు ప్రయివేటు పాఠశాలలకు వెళ్ళారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాథమిక పాఠశాలల్లో 60 లోపు విద్యార్థులుంటే ఇద్దరే ఉపాధ్యాయులను కొనసాగిస్తే రాబోవు మూడు, నాలుగు సంవత్సరాలలో ప్రభుత్వ, మండల పరిషత్, గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలల్లో నమోదు తగ్గి, మూతపడే అవకాశముంటుందని తెలిపారు. నల్లగొండ జిల్లా, చిట్యాల మండలంలోని వట్టిమర్తి ప్రాథమిక పాఠశాలలో 150 పైగా విద్యార్థులున్నారని పేర్కొన్నారు. ప్రధానోపాధ్యాయుడితో పాటు ఐదుగురు ఉపాధ్యాయులు ఉండాల్సిన అవసముండగా, ముగ్గురు మాత్రమే ఉన్నారని తెలిపారు. నాలుగేండ్ల నుంచి గ్రామస్తులే చందాలు వేసుకొని ముగ్గురు టీచర్లను నియమించుకుంటున్నారని తెలిపారు. పిల్లలున్న పాఠశాలలకు ఉపాధ్యాయులనిచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా ఏడుగురు సబ్జెక్ట్ టీచర్లుండాలని తెలిపారు. హిందీ, బయాలజికల్ సైన్స్, సోషల్ స్టడీస్ సబ్జెక్ట్ టీచర్ల కొరత చాలా ఎక్కువగా ఉన్నదని గుర్తుచేశారు. విద్యార్ధులు తక్కువగా ఉన్న హైస్కూల్లో ఒక సబ్జెక్ట్ టీచర్ లేకున్నా ఏమీ కాదని అధికారులు చెప్పటం సరికాదన్నారు. ఆ సబ్జెక్ట్ ఎవరు బోధన చేస్తారని ప్రశ్నించారు. హన్మకొండ జిల్లాలోని గంగదేవిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను గ్రామస్తులు అద్భుతంగా అభివృద్ధి చేసుకున్నారని తెలిపారు. ఒక్కొక్క తరగతిలో రెండు సెక్షన్లు ఉన్నాయని పేర్కొన్నారు. కానీ ఆరేండ్లయినా ఆ పాఠశాలకు సబ్జెక్ట్ టీచర్లను ఇవ్వలేదని గుర్తు చేశారు. మేడ్చెల్ జిల్లాలో సూటికి ఎనభై రెండు మంది విద్యార్థులు ప్రయివేటు పాఠశాలల్లో చదువుచున్నారని తెలిపారు. వరంగల్ నగరంలో కూడా సూటికి ఎనభై మంది విద్యార్థులు ప్రయివేటు పాఠశాలల్లో చదువుతున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 22 వేల ఉపాధ్యాయ పోస్టులకు డీఎస్సీ నిర్వహించి, ప్రభుత్వ, జిల్లా , మండల పరిషత్, గిరిజన సంక్షేమ పాఠశాలల్ని బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు..