– ఎస్సీ,ఎస్టీ డిక్లరేషన్ ప్రకటనపై సంబురాలు
– గాంధీభవన్లో బాణా సంచా పేల్చి, మిఠాయిలు పంచుకున్నారు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కాంగ్రెస్ ఆధ్వర్యంలో శనివారం చేవెళ్లలో ప్రకటించిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటన నేపథ్యంలో ఆదివారం గాంధీభవన్లో సంబురాలు చేసుకున్నారు. బాణ సంచా పేల్చి, మిఠాయిలు పంచుకున్నారు. నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా ఆదివాసి, దళిత సంఘాల నాయకులు ఉత్సాహంలో ఉత్సవాలలో పాల్గొని ఆనందాన్ని వ్యక్తం చేసారు. అంబేద్కర్ అభయహస్తం పేరు మీద ప్రతి పేద దళిత కుటుంబానికి 12 లక్షల రూపాయలు ప్రకటించడం చారిత్రాత్మకమని ప్రకటించారు. దళిత, గిరిజన డిక్లరేషన్ ట్రైలర్ మాత్రమే పూర్తి మ్యానిఫెస్టోతో మా పూర్తి సినిమా చూపిస్తామని నేతలు ప్రకటించారు. టీపీసీసీ ఎస్సీ విభాగం చైర్మెన్ ప్రీతం మాట్లాడుతూ రాష్ట్రంలో దళిత, గిరిజనుల అభ్యున్నతే లక్ష్యంగా శనివారం చేవెళ్ళ సభలో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించామని తెలిపారు. ఆదివాసి కాంగ్రెస్ పార్టీ చైర్మెన్ బెల్లయ్య నాయక్ మాట్లాడుతూ రాష్ట్రంలో దళిత, ఆదివాసి, గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కోసం ప్రతిపాదనలు పంపడంలో గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ విఫలమయ్యారని విమర్శించారు. తమ పార్టీని విమర్శించే స్థాయి మంత్రికి లేదన్నారు.