– బీజేపీ సర్కార్ రైతు వ్యతిరేక విధానాలు తీసుకురాలేదా?
– బీజేపీ నేతలపై తెలంగాణ ఫుడ్స్ చైర్మెన్ మేడే రాజీవ్‌సాగర్ విమర్శలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీఆర్‌ఎస్ పార్టీని తిట్టడంలో పోటి పడుతున్న బీజేపీ నేతలు కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో ఎందుకు పోటిపడడం లేదని తెలంగాణ ఫుడ్స్ చైర్మెన్ మేడే రాజీవ్‌సాగర్ ప్రశ్నించారు. అసలు రైతులకు బీజేపీ పార్టీ ఏం చేసిందని ఖమ్మంలో రైతు సభ పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం సభకు వచ్చిన అమిత్‌షా రైతులకు చేసిన మేలు ఏమి లేకపోవడంతో కేసీఆర్‌పై అసత్య ప్రచారం చేశారని మండిపడ్డారు. తెలంగాణలో ఎక్కడ లేనివిధంగా రైతుబీమా పథకం అమలవుతుందని తెలిపారు. తెలంగాణ రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు రైతుబంధు పథకానికి శ్రీకారం చుట్టిందన్నారు.
దీనినే ఆదర్శంగా తీసుకుని కేంద్రంలో కిసాన్ సమ్మాన్ యోజన పథకం తీసుకువచ్చిందని విమర్శించారు. రైతు వ్యతిరేక బిల్లులు తీసుకురావాలని చూసిన నీచమైన చరిత్ర బిజేపీ పార్టీదని ఎద్దేవా చేశారు. వేలాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో నెలల తరబడి ధర్నాలు చేసిన విషయం యావత్ దేశ ప్రజలు మరిచిపోలేదన్నారు.