నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి/ఆదిభట్ల
ఆదిభట్ల సమీపంలోని ద ఫుడ్ ట్రైన్ రెస్టారెంట్లో షార్ట్ సర్క్యూట్ చోటుచేసుకోవడంతో ఏసీలు, ఫర్నిచర్స్, విద్యుత్ పరికరాలు దగ్ధమయ్యాయి. సుమారు రూ.20లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్టు నిర్వాహకులు వాసుదేవన్, అఖిల్ తెలిపారు. పోలీసులు, నిర్వహకులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని ఆదిభట్ల టీసీఎస్ సమీపంలో ఉన్న దా ఫుడ్ ట్రైన్ రెస్టారెంట్ లోపలి నుంచి ఉదయం 7 గంటల సమయంలో తీవ్రమైన పొగ బయటకు వచ్చింది. గమనించిన స్థానికులు రెస్టారెంట్ యజమాని అఖిల్‌కు ఫోన్లో సమాచారం ఇచ్చారు. దాంతో తన రెస్టారెంట్లో పని చేసే సిబ్బందిని అతను అప్రమత్తం చేశారు.
తాను వెంటనే రెస్టారెంట్‌కు చేరుకున్నారు. రెస్టారెంట్ తలుపులు తీసి చూడగా కౌంటర్ మంటలతో తగలబడుతోంది. రెస్టారెంట్ పూర్తిగా పొగతో నిండిపోవడంతో వారు మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నించారు. అది సాధ్యం కాకపోవడంతో వెంటనే ఫైర్ స్టేషన్ అధికారులకు సమాచారం అందించగా.. వారు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అనంతరం పరిశీలించగా.. రెస్టారెంట్ కౌంటర్ వద్ద ఉన్న ఫర్నిచర్, రెస్టారెంట్‌కు సంబంధించిన పత్రాలు, ఐదు ఏసీలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి.