– పీఎన్ఎం సీనియర్ నాయకులు కె.శాంతారావు
నవతెలంగాణ-అబ్దుల్లాపూర్ మెట్
ప్రజా సంస్కృతిపై మతోన్మాదం దాడులను నిలువరించాలని పీఎన్ఎం సీనియర్ నాయకులు కె.శాంతారావు అన్నారు. ప్రజానాట్యమండలి నాలుగు రోజుల శిక్షణా తరగతులు రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండల కేంద్రంలోని రాకేష్ మాస్టర్ నిలయంలో సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కె.శాంతారావు మాట్లాడుతూ.. దేశంలో, రాష్ట్రంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలు, బాలికలపై హత్యలు, లైంగికదాడులు పెరిగిపోతూ, మానవ సంబంధాలు నశించిపోయాయన్నారు. దాడులు, దౌర్జన్యాలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మానవ సంబంధాలు పూర్తిగా ఆర్థిక సంబంధాలుగా మారిపోయాయన్నారు. పాలకులు పేద, దళిత మహిళలపై దాడులను ప్రేరేపించే విధంగా వ్యవహరిస్తూ.. చట్టాలను తుంగలో తొక్కి రాజ్యాంగాన్ని కాలరాస్తున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను ఎండగడుతూ ప్రజా కళాకారులు ప్రత్యమ్నాయ ప్రజాసంస్కృతిని నిర్మించాలని పిలుపునిచ్చారు. పీడిత ప్రజలు సంఘటిమైన ప్రజాస్వామిక హక్కుల కోసం కళారూపాల ద్వారా పోరాటం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పీఎన్ఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్ట నరసింహ, నాయకులు వేల్పుల వెంకన్న, వినోద్ కుమార్, గడ్డం గణేష్ , దుర్గయ్య, లక్ష్మనారాయణ, అంజమ్మ హరిత తదితరులు పాల్గొన్నారు.