రాఖీపండుగ వచ్చిందంటే ఇల్లంతా సందడి, సందడిగా ఉంటుంది. అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్లు కలిసి చాలా సంతోషకరమైన భావంతో ఈ పండుగను జరుపుకుంటారు. చిన్న, పెద్ద అన్న తేడా లేకుండా అన్ని యసుల వారు రాఖీ పౌర్ణమిని ఘనంగా జరుపుకుంటారు. రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని మార్కెట్లో రకరకాల రాఖీలు మనకు దర్శనమిస్తాయి. గతంలో కంటే భిన్నంగా ఈ సారి సృజనాత్మకతతో కూడిన రాఖీలు మార్కెట్లోకి వచ్చాయి. అయితే మీరే స్వయంగా తయారు చేసి కడితే ఈ రాఖీ పండుగ మీకు మరింత ప్రత్యేకంగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం రాఖీను ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం….
సిల్క్ థ్రెడ్ రాఖి
కావాల్సిన మెటీరియల్ : సిల్క్ థ్రెడ్స్, కత్తెర, బీడ్స్, హార్డ్ బ్రిజిల్స్ ఉన్నటువంటి టూత్ బ్రష్, కాటన్ దారపు రీలు, గ్లూ స్టిక్.
తయారు చేసే విధానం : ముందుగా సిల్క్ థ్రెడ్స్‌ను తీసుకోవాలి. అయితే మీకు నచ్చిన రంగులను ఉపయోగించి ఈ రాఖీలను తయారు చేసుకోవచ్చు. మరింత కలర్ ఫుల్‌గా కనిపించాలంటే మల్టీ కలర్‌ను కూడా ఉపయోగించండి. ఈ రాఖీ కోసం సిల్క్ త్రెడ్‌ను 20 నుండి 30 ఇంచెస్ ఉండే వరకు తీసుకోండి. ఇలా తీసుకున్నప్పుడు మీకు నచ్చిన కలర్‌తో పాటుగా బంగారు రంగులో ఉండేటువంటి దారం కూడా దీనికి చేర్చడం వల్ల మరింత అందంగా ఉంటుంది. ఇలా దారపు పోగుల తీసుకున్న తర్వాత వాటిని మధ్యకు ఫోల్డ్ చేయాలి. తర్వాత కాటన్ దారాన్ని తీసుకుని సిల్క్ థ్రెడ్స్‌కి వన్ ఫోర్త్ పోర్షన్ ఉండే విధంగా ముడి వేయాలి. ఈ పోర్షన్‌ను రాఖీ చేయడానికి ఉపయోగిస్తాం. మిగిలింది ముడి వేయడానికి ఉపయోగిస్తాం. అంటే స్ప్రింగ్‌గా ఉపయోగి స్తాము అని అర్థం. కాబట్టి మీ అన్నదమ్ములు చేతి మడమ సైజు ప్రకారం ఆ దారాలను ఉంచి మిగిలినవి కట్ చేయవచ్చు. అయితే ఆ చివరి దారపు అంచులు ముడి పడిపోకుండా ఉండాలి అంటే టూత్ బ్రష్ సహాయంతో రబ్ చేస్తే సరైన విధంగా ఉంటాయి. దాన్ని ముడి వేస్తే గట్టిగా ఉంటుంది. పైగా చిక్కులు పడకుండా ఉంటుంది. ఇలా టూత్ బ్రష్‌తో చేయడం వల్ల సిల్క్ దారాలు సాఫ్ట్, ఫ్లఫ్ఫీగా ఏర్పడతాయి. అయితే పొడవాటి దారాన్ని రెండు భాగాలుగా చేసి చివరగా ముడి వేయండి. ఈ విధంగా స్ట్రింగ్ చేసిన తర్వాత మీకు నచ్చిన విధంగా రాఖీను తయారు చేసుకోండి. సీక్వెన్స్‌లో బీడ్స్‌ను గ్లూ స్టిక్ సహాయంతో అతికించండి. అంతే మీకు విధంగా రాఖీ పై భాగాన్ని తయారు చేసుకుంటే మీకు కావలసినటువంటి రాఖీ సిద్ధమైనట్లే. మీ క్రియేటివిటీని ఉపయోగించి మరింత అందంగా దానిని రూపొందించవచ్చు. అంతే కాకుండా ప్రేమతో చేసిన అనుభూతిని కూడా పొందవచ్చు.
ఊలుతో
ముందుగా ఊలు దారాలు తీసుకుని మీ చేతి వేళ్లకు చుట్టాలి. ఇలా ఇరవై రౌండ్లు వచ్చే వరకు చుట్టి చివరగా ఒక ముడి వేయాలి. ఈ ముడి మధ్యకి వచ్చేటట్టు చూసుకోండి. ఆ తర్వాత రెండు వైపులా చివర్లను కట్ చేసి మధ్యకు తీస్తే పువ్వు ఆకారంలో వచ్చే విధంగా పెట్టండి. ఇలా చేశాక మధ్యలో బీడ్‌ను అతికించండి. అంటే పువ్వు ఆకారంలో మధ్యన బీడ్ ఉండేటట్లు చూసుకోండి. ఇప్పుడు స్ట్రింగ్‌ను సపరేట్‌గా తయారు చేసుకోవాలి. తిరిగి రెండు రకాల ఊలు దారాలు తీసుకుని సరైన లెంత్ చూసుకుని మీ అన్నదమ్ముల చేయి సైజు ప్రకారం వాటిని కట్ చేసుకుని ఫ్యాబ్రిక్ గ్లూ సహాయంతో అతికించండి. స్ట్రింగ్‌ను మరింత అందంగా చేసుకోవాలి. అంటే మరికొన్ని బీడ్స్ నైనా ఉపయోగించి స్ట్రింగ్‌లోకి దూర్చి ముడి వేసుకుంటూ ఉండాలి. ఇలా అయితే బీడ్స్ జారిపోకుండా ఉంటాయి. అలాగే రాఖీ కూడా మరింత అందంగా ఉంటుంది. అంతే ఎంతో సులువుగా ఈ ఊలు రాఖీని తయారు చేసుకోవచ్చు.
యానిమల్ రాఖీ
కావాల్సిన మెటీరియల్ : యానిమల్ స్టిక్కర్స్, రంగు క్లాత్‌లు, కత్తెర, గ్లూ స్టిక్, సాటిన్ రిబ్బన్.
తయారు చేసే విధానం : ముందుగా మీకు నచ్చినటు వంటి క్లాత్‌ను తీసుకుని దాన్ని మీకు కావల్సిన సైజులో సర్కిల్ ఆకారంలో కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక క్లాత్‌ను తీసుకుని దాన్ని కూడా అదే ఆకారంలో కట్ చేసుకోవాలి. తరువాత ఈ రెండిటికి మధ్య ఒక సాటిన్ రిబ్బన్ పెట్టి గ్లూ స్టిక్ సహాయంతో అతికించాలి. తర్వాత సర్కిల్ ఆకారం పైన యానిమల్ స్టిక్కర్‌ను అంటించుకుంటే రాఖీ సిద్ధమవుతుంది. ఎంతో సులువుగా పిల్లలను ఆకర్షించే విధంగా ఈ రాఖీ ఉంటుంది. కాబట్టి ఒకసారి ప్రయత్నించండి. మీరు మళ్లీ మళ్లీ ఇదే పద్ధతిను పాటిస్తారు.
ఫోమ్ రాఖీ
కావాల్సిన మెటీరియల్ : ఫోమ్ బోర్డ్స్ లేక షీట్స్, కార్టూన్ స్టిక్కర్, సాటిన్ దారం, కత్తెర, గ్లూ స్టిక్.
తయారు చేసే విధానం : మీరు ఎంపిక చేసుకున్న రెండు రంగుల ఫోమ్ బోర్డ్స్ లేక షీట్స్ ను తీసుకుని మీకు నచ్చినటువంటి షేప్‌లో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న రెండు ఆకారా లను ఒక దానిపై ఒకటి పెట్టి అతికించాలి. ఇలా చేశాక కార్టూన్ స్పీకర్‌ను రాఖీ పై భాగంలో అతికించాలి. చివరగా సాటిన్ రిబ్బన్‌ను తీసుకొని రాఖీ అడుగు భాగంలో అతికించి, అధనంగా ఉన్న సాటిన్ రిబ్బన్‌ను కట్ చేసుకుంటే సరిపోతుంది.
క్విల్ రాఖి
కావాల్సిన మెటీరియల్ : పేపర్ క్విల్స్, డెకరే టివ్ స్టిక్కర్స్, సాటిన్ రిబ్బన్, కత్తెర, గ్లూ స్టిక్.
తయారు చేసే విధానం : ముందుగా సిద్ధం చేసుకున్న పేపర్ క్విల్స్‌ను తీసుకోవాలి. వాటిని ఎన్నో రకాలుగా, ఆకారాలుగా తీసుకోవచ్చు. క్విల్లింగ్ కిట్‌ను ఉపయోగించి మీకు నచ్చిన విధంగా తయారు చేసుకోవచ్చు. ఇలా చేసిన తర్వాత వాటికి డెకరేటివ్ స్టిక్కర్స్‌ను అతికించి ప్రతి పేపర్ క్విల్‌కు మధ్యన కుందన్ స్టిక్కర్స్ ఉండే విధంగా చూసుకోండి. ఇలా చేసిన తర్వాత సన్నటి సాటిన్ రిబ్బన్‌ను అడుగు భాగం లో అతికిస్తే సరి పోతుంది. అంతే మీ రాఖీ సిద్ధమయినట్లే. మరింత అందంగా ఉండాలంటే డెకరేటివ్ స్టిక్కర్స్‌తో పాటు వివిధ రకాల స్టోన్స్, కుందన్స్ లేక ఇతర మెటీరియల్స్ ను ఉపయోగించి కూడా తయారు చేసుకోవచ్చు.
థ్రెడ్ రాఖీ
కావాల్సిన మెటీరియల్ : దళసరి కాటన్ దారాలు 3, గోల్డ్ కలర్ సిల్క్ దారం, కత్తెర.
తయారు చేసే విధానం : మీరు తీసుకున్న 3 దారాలను ఉపయోగించి జడ అల్లినట్టుగా అల్లు కోవాలి. తర్వాత దారం రెండు వైపులా ముడి వేయాలి అంతే త్రెడ్ రాఖీ సిద్ధమైనట్లే. ఇలా చేస్తు న్నప్పుడు మధ్యలో ఒక దారాన్ని గోల్డ్ కలర్‌లో తీసుకుంటే చూడటానికి మరింత ఆకర్షణీయంగా ఉంటుంది.
బటన్ రాఖీ
కావాల్సిన మెటీరియల్ : కలర్ ఫుల్ బటన్స్, దళసరి క్లాత్ పీసెస్, సాటిన్ రిబ్బన్, కత్తెర, సూది, దారం.
తయారు చేసే విధానం : ముందుగా దళసరి క్లాత్ పీసెస్‌ను తీసుకుని మీకు నచ్చినటువంటి ఆకారంలో కట్ చేసుకొని ఉంచుకోవాలి. అంటే పువ్వులు, నక్షత్రాలు, ఆకులు, సీతాకోకచిలుక వంటి ఆకారాలులో కట్ చేసుకోవచ్చు. ఇలా రెండు పీసెస్ సిద్ధమైన తర్వాత వాటిని రెండు జోడించి సూది దారం సహాయంతో కుట్టాలి. ఇలా కుట్టిన తర్వాత దానిపై బటన్స్ పెట్టి మళ్లీ కుట్టాలి. చివరగా అడుగు భాగంలో సాటిన్ రిబ్బన్ పెడితే సరి పోతుంది.
సోదర ప్రేమకు ప్రతిరూపం
మానవీయ సంబంధాలను పటిష్టం చేస్తూ.. సోదర ప్రేమకు ప్రతిరూపంగా నిలిచే ‘రక్షా బంధన్’ సంప్రాదాయబద్ధమైన మన విలువలను మరింత ఉట్టిపడేలా చేస్తుంది. అమ్మాయిల పట్ల ఉన్మాదత్వం, విచక్షనా వంటి వెకిలి చేష్టలు పేట్రేగి, మనవతా విలువులు మంటగలుస్తున్న ప్రస్తుత యుగంలో ‘రాఖీ పౌర్ణమి’ తన విశిష్టతను చాటిచెబుతూ సోదర ప్రేమ పటిష్టతకు దోహదపడుతుంది. సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే రాఖీ పౌర్ణమిని ప్రతి ఏడాది ఘనంగా జరుపుకొంటాము. కేవలం అన్నాచెల్లెళ్లు.. అక్కాతమ్ముళ్లకే రక్షాబంధన్ పరిమితం కాదు స్నేహానికి ఈ బంధం ప్రతీకగా నిలస్తుంది. విలువలతో కూడిన ప్రేమను ఆస్వాదించే వారు ఎవరైనా సరే రాఖీ వేడుకల్లో మునిగితేలాల్సిందే.
ప్రతి ఏటా శ్రావణమాసంలో వచ్చే రాఖీ పర్వదినాన్ని కులమతాలకు అతీతంగా మన రాష్ట్రంతో పాటు దేశ వ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు జరుపుకుంటారు. శ్రావణ మాసంలో వచ్చే పండుగ కాబట్టి ఈ పండుగను శ్రావణ పౌర్ణమిగా మరి కొందరు రాఖీ పౌర్ణమిగా పిలుస్తారు. కేరళ, తమిళనాడు, ఒరిస్సా రాష్ట్రాల్లో ‘ఆవని ఆవిట్టం’, బిహార్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, చత్తీస్‌గడ్ రాష్ట్రాల్లో ‘కజరి పూర్ణిమ’గా రక్షాబంధన్‌ని నిర్వహిస్తారు. గోవా, కర్నాటక, గుజరాత్, మహారాష్ట్రాల్లో ఈ పండుగతోనే కొత్త రుతువు ప్రారంభమైనట్లు అక్కడ ప్రజలు భావిస్తారు. రాఖీ వెనుక ఎన్నో పురాణ కథలున్నాయి. ఏది ఏమైనా ఆత్మీయ బంధాలను గాలికోదిలేస్తున్న ప్రస్తుత కాలంలో బ్రిటన్, నేపాల్, కెనడా తదితర దేశాల్లో కూడా రాఖీ పౌర్ణమిని జరుపుకుంటున్నారు.