రక్షణశాఖపై సుప్రీం ఆగ్రహం

– చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారు..
– సుప్రీం ఉత్తర్వులకు విరుద్ధంగా ఓఆర్‌ఓపీ బకాయిల చెల్లింపు : సీజేఐ
న్యూఢిల్లీ : ‘వన్‌ ర్యాంక్‌ వన్‌ పెన్షన్‌’ పథకంలో పెన్షన్‌ బకాయిల చెల్లింపుపై తాము జారీచేసిన ఉత్తర్వులను రక్షణశాఖ ఉల్లంఘించిందని భారత ప్రధాన న్యాయమూర్తి డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. జనవరి 20న జారీచేసిన నోటిఫికేషన్లను రద్దు చేయాలని రక్షణశాఖను ఆదేశించినా, అమలుకాలేదని, విడతల వారీగా బకాయిల చెల్లింపు కొనసాగిస్తోందని రక్షణశాఖ తీరును తప్పుబట్టింది. సుప్రీం ఉత్తర్వులను పక్కకుపెట్టి, చట్టాన్ని రక్షణశాఖ తన చేతుల్లో తీసుకోలేదు..అంటూ మొట్టికాయలు వేసింది. ‘ఓఆర్‌ఓపీ’ పథకం కింద పెన్షన్‌ బకాయిల చెల్లింపునకు సంబంధించిన కేసుపై సోమవారం సీజేఐ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ పి.ఎస్‌.నర్సింహా, జస్టిస్‌ జె.బి.పార్దివాలాలతో కూడిన థర్మాసనం విచారించింది. అర్హులైన మాజీ సైనిక ఉద్యోగులకు పెన్షన్‌ బకాయిలను మార్చి 15కల్లా చెల్లించాలని అంతకుముందు తీర్పులో సుప్రీం పేర్కొంది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల్ని బేఖాతరు చేస్తూ, బకాయిల చెల్లింపు గడువు పెంచుతూ రక్షణశాఖ ఏకపక్షంగా నోటిఫికేషన్లు జారీచేసింది. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ సీజైఐ చంద్రచూడ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ”చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోవటమే ఇది. ఇలాంటి ప్రయత్నం చేయరాదు. గడువు పెంచుతూ జారీచేసిన నోటిఫికేషన్లు ముందు రద్దు చేసిన తర్వాతే, కేంద్రం దరఖాస్తును పరిశీలిస్తా”మని అటార్నీ జనరల్‌ ఆర్‌.వెంకట రమణికి తెలిపారు. చెల్లించాల్సిన బకాయిలు ఎంత ఉన్నాయి? ఎంచుకున్న పద్ధతులేంటి? వృద్ధులు, వితంతు మహిళలకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నారా? అనే వివరాలు ఇవ్వాలని సీజేఐ ఆదేశించారు. కేసు విచారణను మార్చి 20నాటికి వాయిదా వేశారు.
పిటిషనర్లు, మాజీ సైనిక ఉద్యోగుల తరఫున సీనియర్‌ న్యాయవాది హుజెఫా అహ్మదీ వాదనలు వినిపించారు. ”పెన్షన్‌ బకాయిల చెల్లింపు గడువును కేంద్రం పదే పదే పొడగిస్తోంది. కేంద్రం ఇదే విధంగా వ్యవహరిస్తే, బకాయిల చెల్లింపు పూర్తవ్వడానికి 2024 దాకా ఆగాలి. ఇది చాలా చాలా అన్యాయం. బకాయిల చెల్లింపు తాత్సారం చేయటం వల్ల ఎంతోమంది నష్టపోతున్నారు. ఈమధ్యకాలంలో 4లక్షల మంది పెన్షనర్లు చనిపోయారు. వారు బకాయిలు అందుకోలేరు. ఈ విషయం కోర్టు దృష్టికి తీసుకొచ్చాను. పెన్షనర్లకు చెల్లింపులు అనగానే నిధులు లేవన్న సంగతి కేంద్రానికి గుర్తుకు వస్తోంది” అని హుజెఫా అహ్మదీ అన్నారు.