తప్పని నిర్ణయం…!

కొంతమంది తల్లిదండ్రులకు పెండ్లి తర్వాత పిల్లలు తమకు దూరమవుతారన భయం ఎక్కువగా ఉంటుంది. ఇది అబ్బాయిల విషయంలో మరీ ఎక్కువగా ఉంటుంది. కొత్తగా వచ్చిన కోడలు తన కొడుకును తనకు కాకుండా చేస్తుందనే ఆత్మన్యూనతా భావం అత్తగారిలో పెరిగి పోతుంది. ఆ భయంలో కొడుకు సంతోషాన్ని కూడా పట్టించుకోకుండా తమ పెత్తనం చెలాయించాలని చూస్తుంటారు. కొన్ని ఆంక్షలు పెడుతుంటారు. దీని వల్ల కొడుకూ, కోడలు బాధ పడతారనే ఆలోచన కూడా వారికి రాదు. అలాంటి ఓ సమస్య గురించి ఈ వారం ఐద్వా అదాలత్‌లో తెలుసుకుందాం…
నాజీయాకు 23 ఏండ్లు ఉంటాయి. ముగ్గురు అన్నయ్యలు, ఒక తమ్ముడు ఉన్నారు. ఏడాది కిందట తల్లిదండ్రులు ఆమెకు యాసిన్‌తో వివాహం చేశారు. యాసిన్‌కు తండ్రి లేరు. తల్లి అన్న, తమ్ముడు, ఐదుగురు అక్కచెల్లెళ్లు ఉన్నారు. యాసిన్‌ వాళ్ళ వదినకు, అమ్మకు పడకపోవడంతో పెండ్లి అయిన నాలుగు నెలలకే వేరు కాపురం పెట్టారు. తమ్ముడు కూడా విడిగా ఉంటున్నాడు. నాజీయా పెండ్లి చేసుకుని వెళ్ళినపుడు ఆ ఇంట్లో ముగ్గురు మాత్రమే ఉండేవారు. అది కేవలం చెప్పుకోడానికి మాత్రమే. ఆడపడుచు పిల్లలు ఎవరో ఒకరు ఇంటికి వస్తుండేవారు. యాసిన్‌కు వాళ్ళ అమ్మ అంటే చాలా ఇష్టం. తన చిన్నతనంలోనే తండ్రి చనిపోతే ఆమే వాళ్ళను పెంచి పెద్ద చేసింది. అందుకే ఆయనకు తల్లి అంటే విపరీతమైన అభిమానం. ఆమె ఏం చేసినా కరక్టే అంటాడు. అదే ఇప్పుడు అతనికి పెద్ద సమస్యగా మారింది.
నాజీయా చాలా సున్నితంగా, బలహీనంగా కనిపించేది. పెండ్లయిన వారం నుండే ‘నీవు చాలా బలహీనంగా వున్నావు. ఏదో ఆరోగ్య సమస్య ఉంది’ అంటూ వాళ్ళ అమ్మా వాళ్ళను పిలిచి ‘మీ అమ్మాయిని ఆస్పత్రికి తీసుకువెళ్ళి పరీక్షలు నిర్వహించి, ఏ సమస్యా లేదు అంటేనే ఇక్కడకు తీసుకురండి. లేకపోతే లేదు’ అంటూ అత్త హుకుమ్‌ జారీ చేసింది. సరే అంటూ వాళ్ళు ఆస్పత్రికి తీసుకువెళ్ళి అన్ని పరీక్షలు నిర్వహించారు. డాక్టర్లు టెస్టులు చేసి ‘ఈ అమ్మాయికి ఎలాంటి ఆరోగ్య సమస్యా లేదు. ఏదో విషయానికి బాగా భయపడుతున్నట్లు ఉంది’ అని బలం కోసం కొన్ని మందులు రాసి ఇచ్చారు. పది రోజుల తర్వాత తల్లిదండ్రులు తీసుకువెళ్ళి నాజీయాను వాళ్ళ ఇంట్లో వదిలి పెట్టి, డాక్టరు చెప్పిన విషయం చెప్పి వెళ్ళిపోయారు. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉన్నా నాజీయా అత్త ఒప్పుకునేది కాదు. ఇద్దరినీ మాట్లాడుకోనిచ్చేది కాదు. ‘వంట చేయడం రాదు, బట్టలు ఉతకడం రాదు, కనీసం ఇల్లు కూడా ఊడవటం రాదు’ అంటూ ఇష్టం వచ్చినట్లుగా తిట్టేది, కొట్టేది. ఆ విషయం భర్తకు చెప్పినా పట్టించుకునేవాడు కాదు. బట్టల కోసం వాషింగ్‌ మిషన్‌ ఉన్నా వాడనిచ్చేది కాదు. ఇంట్లో బోర్‌ వున్నా బయటి నుండి నీళ్ళు తీసుకురమ్మనేది.
ఇంట్లో ఎప్పుడు ఎవరో ఒకరు వస్తుండడం వల్ల ఇల్లు సరిపోయేది కాదు. దాంతో యాసిన్‌ పక్కనే చిన్న రూమ్‌ అద్దెకు తీసుకున్నాడు. అయినా అత్త వాళ్ళని అక్కడకు వెళ్ళనిచ్చేది కాదు. చుట్టుపక్కల వాళ్ళతో కూడా మాట్లాడనిచ్చేది కాదు. ఇప్పుడు యాసిన్‌ మళ్ళీ పెండ్లి చేసుకుంటాను అంటున్నాడు. ఇలాంటి సమస్యలతో నాజీయా మా దగ్గరకు వచ్చింది. ‘నేను ఆయనతో ఉండలేను. నాకు విడాకులు కావాలి’ అంటూ ఏడ్చేసింది. ‘తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. అది నీ జీవితానికి, కుటుంబానికి మంచిది కాదు. ముందు మేము నీ భర్తను, అత్తను పిలిచి మాట్లాడతాము. అప్పటికీ వారు మారకపోతే అప్పుడు నీకు నచ్చినట్టు చేద్దువు’ అన్నాము. మేము యాసిన్‌ని పిలిచి ‘మీ పెండ్లయి ఆరు నెలలే అవుతుంది. రెండో పెండ్లి ఎందుకు చేసుకోవాలను కుంటున్నావు’ అని అడిగాము. దానికి అతను ‘ఆరు నెలలు అవుతున్నా ఇప్పటి వరకు ఆమెకు గర్భం రాలేదు. అంతే కాదు ఎప్పుడూ మా అమ్మపై నాకు ఏదో ఒకటి చెబుతూనే ఉంటుంది. ఏమైనా అంటే నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అంటుంది. అయినా మా కమ్యూనిటిలో మొదటి భార్య ఉన్నా మేము రెండో పెండ్లి చేసుకోవచ్చు. అందుకే నేను రెండో పెండ్లి చేసుకుంటాను’ అన్నాడు.
‘పిల్లలు పుట్టాలంటే మీరు ముందు ఒకరితో ఒకరు అన్యోన్యంగా ఉండాలి. ఆ తర్వాత డాక్టరు దగ్గరకు వెళితే సమస్య ఏదైనా ఉంటే చికిత్స చేస్తారు. ఏ కమ్యూనిటీలోనైనా మొదటి భార్య అనుమతి లేకుండా రెండో పెండ్లి చేసుకుంటే శిక్ష పడుతుంది’ అని హెచ్చరించాము. ఇక అప్పటి నుంచి అతను రెండో పెండ్లి గురించి మాట్లాడలేదు. వాళ్ళ అత్తను కూడా పలిపించి ‘మీ కొడకూ కోడలు సంతోషంగా ఉంటేనే మీరూ సంతోషంగా ఉండగలరు. వాళ్ళ ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేకుండా చేస్తున్నారు. దీని వల్ల మీరు పొందే సంతోషం ఏముంది. అనవసరంగా మీ కొడుకు జీవితాన్ని నాశనం చేస్తున్నారు’ అని చెప్పాము. ఇలా సుమారు నాలుగు వారాల పాటు వాళ్ళకు కౌన్సెలింగ్‌ ఇచ్చాము. ప్రస్తుతం యాసిన్‌, నజీయా ఇద్దరూ ప్రేమగా ఉంటున్నారు. సమస్య వాళ్ళ అమ్మతో కాబట్టి ఆమెను ఒక పదిహేను రోజులు వాళ్ళ పెద్ద అబ్బాయి దగ్గరకు పంపించాము. దాంతో భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకునే అవకాశం దొరికింది. కానీ ఆమె తిరిగి రావడంతో సమస్య మళ్ళీ మొదటికి వచ్చింది. యాసిన్‌ వాళ్ళ చిన్న అక్క భర్త నుండి విడిపోయి వచ్చేసింది. దాంతో వీళ్ళ సమస్య రెట్టింపు అయింది. అత్తా, ఆడపడుచు ఇద్దరూ కలిసి ఆమెను హింసించడం మొదలు పెట్టారు. భరించలేక నాజీయా వాళ్ళ ఇంటికి వచ్చేసింది.
నాజీయా వాళ్ళ అమ్మ ‘నువ్వు ఇక అతనితో ఉండవల్సిన అవసరం లేదు, మనం విడాకులు తీసుకుందాం, ఎన్ని రోజులు ఇలా కష్టాలు అనుభవిస్తావు’ అనేది. అటు యాసిన్‌ వాళ్ళ అమ్మ ‘నాజీయాతో విడాకులు తీసుకో. నేను నీకు ఇంకో పెండ్లి చేస్తాను. అమ్మాయిలకే పెండ్లి చేశాను. నీకు ఎందుకు చేయను’ అంటూ ప్రోత్సహించింది. కానీ అతనికి నాజీయా నుండి విడిపోవడం ఇష్టంలేదు. ‘నాకు నాజీయా అంటే చాలా ఇష్టం’ అని తల్లితో కచ్చితంగా చెప్పేశాడు. కానీ నాజీయా వాళ్ళ అమ్మా, పిన్ని ‘నువ్వు అక్కడకు వెళితే నిన్ను వాళ్ళు చంపేస్తారు’ అంటూ ఆమెను భయపెట్టారు. ఈ మధ్య కాలంలో వాళ్ళ ఇంటికి దగ్గర్లో అలాంటి ఘటన ఒకటి జరిగింది. అది చెప్పి ఆమెను ఇంకా భయపడేలా చేసింది వాళ్ళ పిన్ని. అలాంటి పరిస్థితుల్లో మేము పిలిచి ‘కొన్ని రోజులు యాసిన్‌ని వాళ్ళ అమ్మను వదిలేసి హైదరాబాద్‌లో భార్యతో కలిసి ఉండమని చెప్పాము. కానీ తల్లిని వదిలి రావడం యాసిన్‌కు ఇష్టంలేదు. దాంతో భార్యా భర్తలకు ఒకరంటే ఒకరికి ఇష్టం ఉన్నా విడాకులు తీసుకోవాలని నిర్ణయించు కున్నారు. యాసిన్‌, నాజీయాకు భరణం కింద లక్ష రూపాయలు ఇచ్చాడు. అలాగే వాళ్ళు ఇచ్చిన వస్తువులు కూడా తిరిగి ఇచ్చేశాడు. ఈ విడాకుల కారణంగా ఇరు కుటుంబాలు సంతో షించాయి కానీ భార్యా భర్తలు పడ్డ బాధ వాళ్ళ కండ్లలో మాకు స్పష్టంగా కనిపించింది.

– వై. వరలక్ష్మి, 9948794051