– ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకునే హక్కు పేదలకే..: సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్. వీరయ్య
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకునే హక్కు కేవలం పేదలకే ఉందని, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకునే కబ్జాదారులకు వత్తాసు పలికే అధికారులకు పేదల గుడిసెలను తొలగించే హక్కు లేదని, మరోమారు తొలగించే ప్రయత్నం చేస్తే ఉద్యమం ఉధృతం చేస్తామని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్. వీరయ్య హెచ్చరించారు. వరంగల్ నగరంలోని ఎంహెచ్‌నగర్ 2లో పేదలు వేసుకున్న గుడిసెలను పోలీసులు దౌర్జన్యంగా నేలమట్టం చేసిన సంగతి తెలిసిందే. ఆ గుడిసెలను మంగళవారం సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు టి.సాగర్, రాష్ట్ర కమిటీ సభ్యులు జగదీశ్‌తో కలిసి వీరయ్య పరిశీలించారు. గుడిసెవాసులతో మాట్లాడి వారిలో ధైర్యాన్ని నింపారు. ఈ సందర్భంగా వీరయ్య మాట్లాడుతూ.. ప్రభుత్వం స్పందించకపోవడం వల్లే నిలువ నీడ లేని పేదలు ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకుంటున్నారని తెలిపారు. ప్రభుత్వమే ఇంటి స్థలాలు, ఇండ్లను నిర్మించి పేదలకు ఇస్తే గుడిసెలు వేసుకునే అవసరమెందుకు వస్తుందని ప్రశ్నించారు. హైకోర్టు జీవించే హక్కు ఇచ్చిందని, ఈ తీర్పు ఇచ్చి రెండు, మూడు నెలలు కాకముందే పోలీసులు, రెవెన్యూ అధికారులు గుడిసెలు వేసుకున్న నిరుపేదలపై దాడులు చేస్తూ ఈ తీర్పును నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. వరంగల్ జిల్లాలోని జక్కలొద్దిలో ప్రారంభమైన ఈ పోరాటం జిల్లాలో 7 ప్రాంతాల్లో విస్తరించి, రాష్ట్రంలో 65 భూ పోరాట కేంద్రాలు ఏర్పడ్డాయని, సుమారు లక్ష మంది పేదలు గుడిసెలు వేసుకొని ఇండ్ల స్థలాల కోసం పోరాటం చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ సర్వేలో 30 లక్షల మందికి ఇండ్లు, ఇండ్ల స్థలాలు లేవని, దీన్ని ఆధారం చేసుకునే రాష్ట్ర ప్రభుత్వం 5.60 లక్షల డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు నిర్మించి ఇస్తామని ప్రకటించిందన్నారు. కానీ ఎనిమిదేండ్లయినా నేటికీ పావువంతు మందికి కూడా ఇండ్లు రాలేదని ఆరోపించారు. 158, 159 జీవోలిచ్చి.. డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను మరిచిపోవాలని చెబుతున్నారన్నారు. గృహలక్ష్మి పథకంలో మహిళ పేరిట సొంత భూమి రిజిస్ట్రేషన్ ఉంటేనే రూ.3 లక్షలు ఇస్తామంటున్నారని, ఎక్కడైనా మహిళల పేరిట భూములు రిజిస్ట్రేషన్ ఉన్నాయా అని ప్రశ్నించారు. డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల నిర్మాణానికే రూ.7 లక్షలు అవసరమవుతుందని ప్రభుత్వమే చెబుతుందని, గృహలక్ష్మి పథకం కింద ఇచ్చే రూ.3 లక్షలతో ఇల్లు నిర్మించడం సాధ్యమేనా అని ప్రశ్నించారు. నిరుపేదలు ఇండ్లు నిర్మించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షలు, కేంద్ర ప్రభుత్వం రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వంద ఎకరాలున్న చిన్నవడ్డేపల్లి చెరువు కింద.. 40 ఎకరాలకుపైగా పెద్దపెద్దోళ్లు ఆక్రమించుకొని బిల్డింగులు కట్టుకుంటే కండ్లు మూసుకున్న అధికారులు, ఇప్పుడు ఈ ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకున్న పేదలపై అధికారులు దాడి చేయడం సమంజసం కాదన్నారు. మీ పోరాటానికి సీపీఐ(ఎం) అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
అనంతరం సాగర్ మాట్లాడుతూ.. నిరుపేదలకు జాగలు, ఇండ్లు ఇచ్చేంత వరకూ పోరాటం చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్న సంపన్నులను వదిలేస్తున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు.. 60 గజాల్లో గుడిసెలు వేసుకున్న పేదలపై దౌర్జన్యం చేయడం సమంజసం కాదన్నారు. జిల్లా మంత్రి, స్థానిక ఎమ్మెల్యే జోక్యం చేసుకొని నిరుపేదల గుడిసెలు తొలగించకుండా చూడాలని కోరారు. జగదీశ్ మాట్లాడుతూ.. గుడిసెలు వేసుకున్న పేదలపై బుల్డోజర్లు ఎక్కిస్తున్న వారికి ఎన్నికల్లో గుణపాఠం తప్పదన్నారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) వరంగల్ జిల్లా కార్యదర్శి సిహెచ్ రంగయ్య, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సింగారపు బాబు, మాలోత్ సాగర్, ముక్కెర రామస్వామి, జిల్లా కమిటీ సభ్యులు ఎం. యాదగిరి, అరూరి కుమార్, నాయకులు ఎండీ బషీర్ అహ్మద్, జన్ను సురేష్, వై. రమేష్, సుమన్, కల్పన, రజిత, సునీత తదితరులు పాల్గొన్నారు.