అంగన్వాడీ సమస్యలు పరిష్కరించకపోతే…ప్రభుత్వ పతనం తప్పదు

If the Anganwadi issues are not resolved...
The fall of the government is inevitable– సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏజే.రమేష్‌
నవతెలంగాణ-పాల్వంచ
తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నిరవధిక సమ్మె చేస్తున్న అంగన్వాడీల పట్ల నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించినా, కోర్కెలను పరిష్కరించకపోతే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి పతనం తప్పదని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏజే.రమేష్‌ హెచ్చరించారు. పాల్వంచలో మున్సిపల్‌ కార్యాలయం వద్ద రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా మొదటి రోజు సమ్మె శిబిరాన్ని ప్రారంభిస్తూ మాట్లాడారు. గత నెలలో రాష్ట్ర ప్రభుత్వానికి అంగన్వాడీ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని ప్రయత్నిస్తే, స్వయంగా మంత్రే యూనియన్‌లతో చర్చలు జరిపారని అన్నారు. చర్చల్లో అంగీకరించిన రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ని కుడించారని, ఎటువంటి షరతులు లేకుండా మినీ టీచర్స్‌ని మెయిన్‌ టీచర్స్‌గా గుర్తిస్తామన్న హామీని విస్మరించి, అనేక షరతులతో మినీలను మెయిన్‌ టీచర్స్‌గా గుర్తుస్తామని సర్క్యులర్‌ విడుదల చేశారని అన్నారు. స్వయంగా మంత్రే చర్చల్లో ఇచ్చిన హామీలకు దిక్కే లేకుండా పోయిందన్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ఆశా వర్కర్లు, మధ్యాహ్న భోజనం కార్మికులు, ఐకేపీ, వీఓఏలను పంపి అంగన్వాడీ సెంటర్లను నడపడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఈ ప్రయత్నాలను విరమించుకొకపోతే వారందరినీ అడ్డుకుని తీరుతామని హెచ్చరించారు. అనంతరం సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు దొడ్డ రవి కుమార్‌ మాట్లాడారు. అంగన్వాడీల శ్రమతో ప్రభుత్వానికి అనేక అవార్డ్‌లు వస్తున్నాయని, అంగన్వాడీ శ్రమని, కష్టాన్ని గుర్తించకుండా ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తుందని అన్నారు. ఐసీడీఎస్‌కి సంబంధం లేని అనేక బాధ్యతలను అంగన్వాడీలకు అప్పగిస్తూ పని భారాన్ని పెంచుతున్నారని అన్నారు. సమ్మె పట్ల అధికారులు దూకుడుగా వ్యవహరిస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ సమ్మె ప్రారంభ కార్యక్రమానికి అంగన్వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా ఉపాధ్యక్షురాలు రాజ్య లక్ష్మి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధి కారి వెంకటరమణ, జిల్లా కమిటీ సభ్యులు రమ్య, భాను, అచ్చమ్మ, ఆవాజ్‌ జిల్లా ఉపాధ్యక్షులు నిరంజన్‌, పట్టణ, జిల్లా నాయకులు పి.తులసిరామ్‌ తదితరులు పాల్గొన్నారు.
అంగన్వాడీ ఉద్యోగులును ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి
భద్రాచలం రూరల్‌: భద్రాచలంలో ప్రారంభమైన సమ్మెకు శ్రామిక మహిళా పట్టణ కన్వీనర్‌ మర్లపాటి రేణుక అధ్యక్షతన జరిగిన సమ్మెను ప్రారంభిస్తూ సీఐటీయూ కన్వీనర్‌ ఎంబి.నర్సారెడ్డి మాట్లాడుతూ ఐసీడీఎస్‌లో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్లకు, మినీ టీచర్లకు, హెల్పర్లకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ చట్టాన్ని అమలు చేయాలని రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ టీచర్లకు రూ.10 లక్షలు, హెల్పర్‌కు రూ.5 లక్షలు ప్రకటించాలని, మినీ అంగన్వాడీ కేంద్రాలను ఎటువంటి షరతులు లేకుండా మెయిన్‌ అంగన్వాడి కేంద్రాలుగా మార్పు చేస్తూ ప్రభుత్వం వెంటనే జీవో ఇవ్వాలని మినీ అంగన్వాడీ కేంద్రాలకు హెల్పర్లు నియమిస్తూ నోటిఫికేషన్‌ ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె చేపట్టిన నేపథ్యంలో తెలంగాణ అంగన్వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ సీఐటీయూ, ఏఐటియుసి కమిటీల ఆధ్వర్యంలో భద్రాచలం పట్టణ కేంద్రంలో తొలిరోజు సమ్మెను అంబేద్కర్‌ సెంటర్లో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ పట్టణ నాయకులు బి.వెంకటరెడ్డి, ఎన్‌.నాగరాజు, జి.లక్ష్మీకాంత్‌, అజరు కుమార్‌, ఎం.సుబ్బలక్ష్మి, తెలంగాణ అంగన్వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ సీఐటీయూ నాయకులు ఝాన్సీ, అనురాధ, అధ్యక్ష, కార్యదర్శులు లలిత, విజయలక్ష్మి, మినీ అంగనవాడి టీచర్స్‌ సమ్మెలో పాల్గొన్నారు.
అంగన్వాడీ టీచర్లను పర్మినెంట్‌ చేయాలి : రమేష్‌
బూర్గంపాడు : అంగన్వాడీ టీచర్లను పర్మినెంట్‌ చేసి, ఉద్యోగ భద్రత కల్పించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏజే రమేష్‌ అన్నారు. తెలంగాణ అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఇచ్చిన నిరవధిక సమ్మె పిలుపుతో మండల కేంద్రంలో సమ్మె శిబిరాన్ని ఏర్పాటు చేశారు. సోమవారం 120 మంది అంగన్వాడీలు సమ్మె దీక్ష శిబిరంలో పాల్గొన్నారు. దీక్ష శిబిరాన్ని సీఐటీయూ మండల కన్వీనర్‌ బర్ల తిరుపతిరావు ప్రారంభించగా ఏజే రమేష్‌ మాట్లాడారు. రాష్ట్ర వ్యప్తంగా 70 వేల మంది అంగన్వాడీలు ఈ నిరవధిక సమ్మెలో పాల్గొంటున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నిట్ట అనసూయ, కేసుపాక వెంకటరమణ, లెక్కల పద్మ, రాయల వెంకటేశ్వర్లు, బయ్య రాము, తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వం స్పందించకుంటే పోరాటాలు ఉధృతం
కొత్తగూడెం : అంగన్‌వాడీల సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించని పక్షంలో పోరాటాలు ఉధృతం చేస్తామని అంగన్వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.పద్మ, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి డి.వీరన్నలు స్పష్టం చేశారు. సోమవారం కొత్తగూడెం బస్టాండ్‌ సెంటర్‌ చిల్డ్రన్‌ పార్క్‌ ఎదురుగా ఏర్పాట్లు చేసిన దీక్షా శిబిరాన్ని వారు ప్రారంభించి, మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంగన్‌ వాడీల నిరవధిక సమ్మెలో భాగంగా కొత్తగూడెం పట్టణంలోని అంగన్వాడీ నిరవధిక సమ్మె చేయడం జరుగుతుందని చెప్పారు. వెంటనే ప్రభుత్వం స్పందించాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్‌ నాయకులు పద్మ, కళావతి, మాధవి, శైలజ, జయలక్ష్మి, పుష్ప, సునీత, జుబేదా, తదితరులు పాల్గొన్నారు.
అశ్వారావుపేట: అంగన్వాడీలకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, గ్రాడ్యూటీ చట్టం అమలు చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్‌ డిమాండ్‌ చేశారు. అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక మూడు రోడ్ల కూడలిలో టెంట్‌ వేసి నిరవధిక సమ్మెకు దిగారు. ఈ సందర్భంగా అర్జున్‌, సీపీఐ(ఎం) నాయకులు చిరంజీవి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్‌ నాయకులు రాధ, రాజేశ్వరి, ఉష, వాణి, విజయ, లక్ష్మి, కృష్ణవేణి, ప్రవీణ, ప్రభావతి తదితరులు పాల్గొన్నారు.
జూలూరుపాడు: అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చండ్ర నరేంద్ర కుమార్‌, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు పద్మ ఢిమాండ్‌ చేశారు. ఏఐటీయూసీ, సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్స్‌ హెల్పర్స్‌ రాష్ట్ర జాయింట్‌ యాక్షన్‌ కమిటీ పిలుపులో భాగంగా జూలూరుపాడులో సమ్మె శిబిరాన్ని సోమవారం వారు ప్రారంభించి, మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి గుండె పిన్ని వెంకటేశ్వర్లు, సీపీఐ(ఎం) మండల నాయకులు వలమల చందర్‌ రావు, ఏఐవైఎఫ్‌ మండల కార్యదర్శి ఎస్కే చాంద్‌ పాషా, ఏఐటీయూసీ, సీఐటీయూ నాయకులు లలిత, సీత, మహాలక్ష్మి, రాజ్యం తదితరులు పాల్గొన్నారు.
దమ్మపేట: తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట అంగనవాడీి టీచర్లు, మినీ అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు నిరవధిక సమ్మెలో సోమవారం పాల్గొన్నారు. వారికి సంఘీభావంగా సీపీఐ(ఎం), సీపీఐ, సీఐటీయూ, ఏఐటీయూసీ నాయకులు వారి సమస్యల పరిష్కారం అయ్యేవరకు మీకు అండగా ఉంటామని వారికి మద్దతు తెలియజేశారు. ఈ కార్యక్ర మంలో సీపీఐ జిల్లా కమిటీ నాయకులు యార్లగడ్డ భాస్కర రావు, జిల్లా కమిటీ సభ్యులు దొడ్డ లక్ష్మీనారాయణ, సీపీఐ (ఎం) మండల కార్యదర్శి మోరంపూడి శ్రీనివాసరావు, సీఐటీ యూ నాయకులు శ్రీనివాసరావు, కొలిగిపోగు శ్రీనివాసరావు, సీపీఐ మండల నాయకులు శివకృష్ణ పాల్గొన్నారు.
కొత్తగూడెం: అంగన్వాడీ నిరవధిక సమ్మె విచ్ఛిన్నం చేసేందుకు రాష్ట్ర బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ కుట్రలకు గ్రామ పంచాయతీ కార్యదర్శులు, మధ్యాహ్న భోజనం కార్మికులు, ఆశా వర్కర్లు, ఐకేపీ వీఓఏలు బలి కావద్దని సిఐటియూ జిల్లా కార్యదర్శి ఏజె.రమేష్‌ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కార్మికులను మోసం చేయడంలో దిట్ట అని, కార్మికుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నదని విమర్శించారు. సమ్మెలో ఉన్న అంగన్వాడీ కార్మికులకు అన్ని మండల కేంద్రాల్లో సంఘీభావం తెలపాలని ఆశా వర్కర్లు, మధ్యాహ్న భోజన కార్మికులు, ఐకేపీ,విఓఏ, గ్రామ పంచాయతీ కార్యదర్శులకు ఏజే.రమేష్‌ విజ్ఞప్తి చేశారు.