– అందులో మన పాత్ర తప్పకుండా ఉంటది
– ఈ నెల నుంచే ”చేనేత మిత్ర” అమలు
– ప్రతి మగ్గానికీ నెలకు రూ.3వేలు ఇస్తాం..
– ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్
– మన్నెగూడలో జాతీయ చేనేత దినోత్సవం
– మినీ శిల్పారామంలో చేనేత మ్యూజియానికి మంత్రి శంకుస్థాపన
నవతెలంగాణ-తుర్కయాంజల్
కేంద్రంలో ఈ సారి తప్పకుండా సంకీర్ణ ప్రభుత్వమే వస్తదని.. అందులో మన పాత్ర తప్పకుండా ఉంటుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్ మున్సిపాల్టీ మన్నెగూడలోని ఓ ఫంక్షన్ హాల్లో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. నరాలను పోగులుగా చేసి.. రక్తాన్ని రసాయనాలుగా రంగరించి.. దేశానికి అద్భుతమైన నాగరికతను నేర్పించింది చేనేత కార్మికులని కొనియాడారు. అలాంటి నేతన్నల కోసం ”చేనేత మిత్ర” పథకాన్ని ఈనెల నుంచే అమలు చేస్తామని చెప్పారు. చేనేతమిత్ర పథకం కింద ప్రతి మగ్గానికీ నెలకు రూ. 3 వేలు ఇస్తామన్నారు. ఇక చేనేత మీద 5 శాతం జీఎస్టీ వేసిన మొట్టమొదటి ప్రధాని మోడీ అని విమర్శించారు. చిన్నప్పుడు చేనేతకారుల ఇంట్లో ఉండి సీఎం కేసీఆర్ చదువుకున్నారని, చేనేత కార్మికుల గురించి కేసీఆర్‌కు తెలిసినంత ఏ ముఖ్యమంత్రికీ తెలియదన్నారు. అందుకే చేనేతకు చేయూత పథకం తీసుకొచ్చారని చెప్పారు.
చేనేతలకు రూ.200 కోట్ల రుణాలు
చేనేతలకు డీసీసీబీ, టెస్కాబ్ ద్వారా రూ.200 కోట్ల రుణాలు అందిస్తున్నామని కేటీఆర్ తెలిపారు. చేనేతలు తమ నివాసాల వద్ద గృహలక్ష్మి పథకం కింద షెడ్ నిర్మించుకునేందుకు సాయం చేస్తామని ప్రకటించారు. నేతన్నకు చేయూత ద్వారా 59 నుంచి 75 ఏండ్ల వయస్సు వరకు బీమా అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ పథకం ద్వారా రూ.5 లక్షల బీమా కల్పిస్తామన్నారు. నేటి నుంచి తెలంగాణ చేనేత మగ్గం పథకం అమలు చేస్తున్నట్టు తెలిపారు. రూ.40.50 కోట్లతో 10,652 ఫ్రేమ్ మగ్గాలు అందుబాటులోకి తెస్తామని చెప్పారు.
నేతన్నలకు చేనేత హెల్త్ కార్డు
మృతిచెందిన కార్మికుల కుటుంబానికి టెస్కో సాయం రూ.25 వేలకు పెంచుతామని మంత్రి తెలిపారు. నేతన్నల కోసం చేనేత హెల్త్ కార్డు ప్రారంభిస్తున్నామన్నారు. ఈ కార్డుల ద్వారా ఓపీ సేవలకు రూ.25 వేలు ఇస్తామని ప్రకటించారు. వరంగల్‌లో కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు చేశామని, నేతన్నలు శ్రామికులుగా సూరత్ వెళ్లి పారిశ్రామికులుగా స్వరాష్ట్రం తిరిగి వచ్చారన్నారు. ఉప్పల్‌లో అద్భుతమైన హ్యాండ్‌లూం మ్యూజియం నిర్మిస్తామని తెలిపారు. పోచంపల్లి హ్యాండ్‌లూం పార్కును రూ.12.60 కోట్లతో పునరుద్ధరణ చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్, ఎమ్మెల్సీ ఎల్.రమణ, బీఆర్‌ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మెన్ చింత ప్రభాకర్, పవర్‌లూమ్ కార్పొరేషన్ చైర్మెన్ గూడూరు ప్రవీణ్ కుమార్, కార్యదర్శి బుద్ధ ప్రకాష్, డైరెక్టర్ అలుగు వర్షిణి తదితరులు పాల్గొన్నారు.
మినీ శిల్పారామంలో చేనేత మ్యూజియం
ఉప్పల్ మినీ శిల్పారామంలో చేనేత భవనం (పర్మినెంట్ కన్వెన్షన్ సెంటర్ హాట్) కోసం రూ.50 కోట్లతో 2576 చదరపు గజాల విస్తీర్ణంలో, మ్యూజియం కోసం రూ.15 కోట్లతో 500 చదరపు గజాలలో నిర్మాణాల పనులకు మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్ రమణతో కలిసి శంకుస్థాపన చేశారు. ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి వరంగల్ జాతీయ రహదారి మెయిన్ రోడ్డు కారిడార్ పనులను పూర్తి చేయాలని, ఉప్పల్ భగాయత్‌లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు, మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్‌కు రెండెకరాల చొప్పున కేటాయించాలని, వంద పడకల ఆస్పత్రి నిర్మాణం చేపట్టాలని ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి మంత్రికి విన్నవించారు. కార్యక్రమంలో సీపీ డీఎస్. చౌహన్, పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్ రెడ్డి, ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ పంకజ, ఉప్పల్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్, ఉప్పల్ ఎమ్మార్వో కృష్ణారెడ్డి, డాక్టర్ జ్యోతి బుద్ధ ప్రకాష్ పాల్గొన్నారు.