సరికొత్త ఒరవడితో తొలిమెట్టు

– 5+1 పద్ధతిలో విద్యార్థుల్లో అభ్యసనా సామర్థ్యాల పెంపు
– హైదరాబాద్‌ జిల్లాలో 200 మంది ఆర్పీలకు శిక్షణ పూర్తి
– వచ్చే నెల 3 నుంచి మండలాల్లో 2వేల మందిపైగా టీచర్లకు ట్రైనింగ్‌
– శిక్షణ అనంతరం హ్యాండ్‌బుక్స్‌, వర్క్‌షీట్స్‌ పంపిణీ
నవతెలంగాణ-సిటీబ్యూరో
ప్రాథమిక విద్యా బలోపేతం లక్ష్యంగా విద్యాశాఖ చర్యలు చేపడుతోంది. గత విద్యాసంవత్సరం నుంచి ఫౌండేషన్‌ లిటరసీ అండ్‌ న్యూమరసీ(ఎఫ్‌ఎల్‌ఎన్‌) పేరుతో తొలిమెట్టు కార్యక్రమానికి విద్యాశాఖ శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంతో విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు కాస్త మెరుగయ్యాయి. అయితే గత విద్యాసంవత్సరంలో ‘తొలిమెట్టు’ అమలు సందర్భంగా క్షేత్రస్థాయిలో ఎదురైన ఇబ్బందులను గుర్తించిన విద్యాశాఖ అధికారులు ఈసారి మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. ఇప్పటికే ఇందుకు అవసరమైన శిక్షణను ఉపాధ్యాయులకు ఇస్తున్నారు.
ఒకటి నుంచి 5వ తరగతి వరకు విద్యార్థుల్లో చదవడం, రాయడం, అభ్యసన సామర్థ్యాలు సాధించే విధంగా మాతృభాషలో, ఇంగ్లీష్‌లో, గణితంలో, ఈవీఎస్‌లో ఉపాధ్యాయులకు శిక్షణ ఇప్పిస్తున్నారు. గతేడాదిలాగే ఇప్పటికే రాష్ట్రస్థాయిలో జిల్లాకు చెందిన పది మంది రిసోర్స్‌ పర్సన్‌లు శిక్షణ తీసుకోగా.. వారు ఒక్కో మండలం నుంచి పది మంది ఆర్పీలకు ఈనెల 24 నుంచి 26వరకు శిక్షణ ఇచ్చారు. ఇలా హైదరాబాద్‌ జిల్లా వ్యాప్తంగా 16 మండలాల(24జోన్ల)కు సంబంధించి తెలుగు, ఇంగ్లీష్‌, ఉర్దూ మీడియం కలిపి 200 మంది వరకు ట్రైనింగ్‌ పూర్తిచేసుకున్నారు. వారంతా మండల స్థాయిలో ఉపాధ్యాయులకు వచ్చేనెల 3 నుంచి 8వ తేదీ వరకు మూడు దశల్లో శిక్షణ పూర్తి చేస్తారు. సబ్జెక్టుకు రెండ్రోజుల చొప్పున శిక్షణ ఇస్తారు. హైదరాబాద్‌ జిల్లాలో మొత్తం 490 ప్రాథమిక పాఠశాలలుండగా.. వీటి పరిధిలో 80 వేల మంది విద్యార్థులు ఉన్నారు. దాదాపు 2200 మంది ఉపాధ్యాయులు ఇందులో భాగస్వాములు కానున్నారు. ఈ శిక్షణా కార్యక్రమం పూర్తి కాగానే ఉపాధ్యాయులకు లెసెన్‌ ప్లాన్స్‌, పీరియడ్‌ ప్లాన్స్‌తో కూడిన 200 పేజీల హ్యాండ్‌ బుక్స్‌ అందిస్తారు. విద్యార్థులకు ఎస్సీఈఆర్టీ రూపొందించిన వర్క్‌ షీట్స్‌ ఇవ్వనున్నారు. ప్రయివేటుకు దీటుగా రూపొందించిన ఈ వర్క్‌షీట్స్‌ ఉపాధ్యాయుల పనిభారం తగ్గించాయని.. నాంపల్లి మహుబూబియా హైస్కూల్లో జరిగిన శిక్షణ క్యాంపునకు వచ్చిన విద్యాశాఖ ప్రిన్సిపాల్‌ సెక్రటరీ వాకాటి కరుణ, డీఈవో రోహిణికి తెలియజేసి.. కృతజ్ఞతలు తెలిపారు.
ప్రతి పాఠాన్నీ 5ప్లస్‌ 1 పద్ధతిలో రూపకల్పన
గత విద్యాసంవత్సరం తొలిమెట్టు కార్యక్రమాన్ని అమలు చేసే క్రమంలో క్షేత్రస్థాయిలో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. అందుకు సంబంధించి ఉపాధ్యాయుల నుంచి సేకరించిన సమాచారాన్ని పరిగణనలోకి తీసుకున్న విద్యాశాఖ హ్యాండ్‌ బుక్స్‌, వర్క్‌ షీట్స్‌కి రూపకల్పన చేసింది. ఉదాహరణకు తెలుగు, ఇంగ్లీష్‌, మ్యాథ్స్‌ ఇలా ఎదైనా వర్క్‌షీట్‌లో ప్రతి పాఠానికి 5ప్లస్‌1 పద్ధతిలో రూపొందించారు. ఐదు పని దినాలలో ఐదు పీరియడ్‌ ప్లాన్స్‌ రూపొందించారు. ప్రతిరోజూ పీరియడ్‌ తర్వాత పిల్లల చేత టీచర్‌ అభ్యసన పత్రాన్ని పూర్తిచేయిస్తారు. ఆరో రోజు విద్యార్థులు మూల్యాంకన పత్రాన్ని పూరిస్తారు. అలా విద్యార్థులు ఆ పాఠానికి సంబంధించిన సామర్థ్యాలను సాధించారా? లేదా అనే విషయాన్ని ఉపాధ్యాయులు తెలుసుకోగలుగుతారు. ఈ కార్యక్రమానికి ప్రధానోపాధ్యాయులు, కాంప్లెక్స్‌ హెచ్‌ఎంలు, మండల విద్యాధికారులు, గెజిటెడ్‌ హెచ్‌ఎంలు నోడల్‌ అధికారులుగా ఉండి అమలును పర్యవేక్షిస్తారు. జిల్లా స్థాయిలో డీఈవో, సెక్టోరియల్‌ అధికారులు, ఎన్‌సీఆర్టీ అధికారులతో మానిటరింగ్‌ బృందాల పర్యవేక్షణ ఉంటుంది.
ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇది నిదర్శనం ఆర్‌.రోహిణి, డీఈవో, హైదరాబాద్‌
సాధారణంగా ప్రయివేట్‌ స్కూళ్లలో చదివే పిల్లలకు వర్క్‌బుక్స్‌ ఇస్తారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఈ విద్యాసంవత్సరం ‘తొలిమెట్టు’లో భాగంగా రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రభుత్వ ప్రాథమిక స్థాయి విద్యార్థులకు వర్క్‌ షీట్స్‌, టీచర్లకు హ్యాండ్‌ బుక్స్‌ అందించడం గొప్ప విషయం. ఈ పుస్తకాల వల్ల ఉపాధ్యాయులు సైతం తమకు చాలా వరకు పనిభారం తగ్గుతుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.