”పరిశోధన ఒక జాతి అభివృద్ధి పరిణామానికి, వికాస దశకు సూచిక. వ్యక్తి, సమూహం, సమాజం, తరం తమ మూలాల వైపు, పరంపర వైపు దృష్టిసారించి వెలికి తీసేది పరిశోధన”
– డా. నందిని సిధారెడ్డి
దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాల తెలుగుశాఖల నుంచి ప్రతి సంవత్సరం కొన్ని వందల పిహెచ్.డి. థీసిస్‌లు రాయబడి అవార్డు పొందుతున్నాయి. వాటిలో ఎన్ని నాణ్యమైనవి, ఎన్ని కాలానికి నిలిచేవి, ఎన్ని భవిష్యత్ తరాలకు ఉపయోగపడేవి, ఎన్ని సమాజాన్ని మార్చేవి అనేది కాలమే నిర్ణయించాలి. ఏదో ఒక విషయికంగా ఎక్కువ సమాచారాన్ని ప్రోది చేసుకున్నవి, ఉత్తమ పరిశోధనా ప్రమాణాలను పాటించినవి, ప్రజల జీవితాలను ప్రభావితం చేసేవి పాఠకుల చేత, పరిశోధకుల చేత, పర్యవేక్షకుల చేత, విమర్శకుల చేత ఉత్తమ పరిశోధనా గ్రంథాలుగా గుర్తింపు పొందుతున్నాయి. వాటిని మాత్రమే విభిన్న పాఠకులు పదేపదే చదువుతున్నారు. సంప్రదిస్తున్నారు. రానురాను పరిశోధనా నాణ్యతా ప్రమాణాలు పడిపోతున్న సందర్భంలో, సోమరి పరిశోధకులే ఎక్కువున్న కాలంలో కొన్ని వందల పుటల పరిశోధనా గ్రంథాలను తెరిచి చదివేవారు చాలా తక్కువ. నిజానికి ఒక వ్యాసం రాయాలంటే మన ముందు తరాల వాళ్లు రాసిన వ్యాసాలు కనీసం వంద చదవాలి. అలాగే ఒక పరిశోధన చేయాలంటే ఉత్తమ పరిశోధనా గ్రంథాలనదగ్గవి కనీసం వంద థీసిస్‌లను సంప్రదించాలి. అప్పుడే ఒక సిద్ధాంత వ్యాసాన్ని రాసే భాషాపాటవం, శైలీశిల్పాలు, పరిశోధనా విధానం, సిద్ధాంత ప్రతిపాదన, అనుసరించాల్సిన మెథాడాలజీతో పాటు ఎన్నో సూక్ష్మ విషయాలు బోధపడుతాయి. తద్వారా ఒక ఉత్తమ పరిశోధనా గ్రంథం రూపొందుతుంది. కానీ ఇదంతా పరిశోధకుడు పరిశోధన పట్ల సానుకూల దృక్పథం కలిగియున్నప్పుడు మాత్రమే సంభవించే విషయం. ఇప్పటి డిజిటల్ తరం, అన్నీ స్మార్ట్‌గా అయిపోవాలని ఉబలాటపడే నవీన పరిశోధకులలో అంత ఓపిక, నేర్చుకునే వైఖరి సన్నగిల్లుతుంది. అలాంటి వారి కోసమే డా. అట్టెం దత్తయ్య తెలుగులో ఇప్పటిదాకా వెలువడిన కొన్ని ఉత్తమ పరిశోధనా గ్రంథాల సారాంశాన్ని అందించాలనే తలంపుతో ‘సారాంశం’ పేర రెండు సంపుటాలు వెలువరించాడు. పూర్తి సిద్ధాంత వ్యాసాలను చదవలేని, అందుబాటులో లేని పాఠకులు కనీసం వాటి ‘సారాంశం’ అయినా తెలుసుకోవాలి అని చేసిందే ఈ ప్రయత్నం
ఈ ‘సారాంశ’ వ్యాసాలు చక్కని అమరికతో, ఏకరూపతతో వెలువడడానికి కారణం సంపాదకుడు వ్యాసకర్తలకు కొన్ని విలువైన సూచనలు చేసి వాటిని అతిక్రమించకుండా రాయించడమేనని చెప్పాలి. ఈ రెండు సంపుటాలలో కలిపి 110 వ్యాసాలున్నాయి. ఇవన్నీ భావి పరిశోధకులకు ఎంతో కొంత పరిశోధనా ప్రణాళికా రచనలో మార్గదర్శనం చేసేవే కావడం గమనార్హం. వీటి ద్వారా నూతన పరిశోధకులు జ్ఞానాన్ని, చైతన్యాన్ని, కొత్త ఆలోచనా విధానాన్ని అలవర్చుకొని స్ఫూర్తి పొందుతారని భావించవచ్చు.
తెలుగు పరిశోధక విద్యార్థులు ఇవాళ చౌరస్తాలో నిలబడ్డారని చెప్పాలి. పరిశోధనకు ఏ విషయాన్ని ఎన్నుకోవాలో తెలియదు. ఇప్పటిదాకా ఏయే విషయాల మీద పరిశోధనలు జరిగాయో తెలియదు. (ఆచార్య వెలుదండ నిత్యానందరావు వెలువరించిన ‘విశ్వవిద్యాలయాల్లో తెలుగు పరిశోధన’ 1930 -2013 వరకు జరిగిన పరిశోధనలను గురించిన సమాచారం ఇచ్చినప్పటికీ) సిద్ధాంత వ్యాస రచనకు నియమిత శైలీపత్రం ఇప్పటికీ లేదు. ఇలాంటి సంక్షోభ సందర్భంలో ఈ సారాంశ వ్యాసాలు పరిశోధక విద్యార్థులకు కొంత ఉపయోగపడుతాయని చెప్పవచ్చు. పరిశోధన అంశ ఎన్నికలో, అధ్యాయాల విభజనలో, పాటించాల్సిన ప్రామాణికతలో, సిద్ధాంత వ్యాస రచనా విధానంలో ఈ వ్యాసాలు కొత్త చూపును, ప్రేరణను ప్రసాదిస్తాయి.
వివిధ ప్రక్రియలపై మన పూర్వ పరిశోధకులు చేసిన గ్రంథాలపై ఇందులో విలువైన వ్యాసాలున్నాయి. ఇవి తదుపరి పరిశోధనలను ఎంతో ప్రభావితం చేశాయని చెప్పవచ్చు. అలాగే ఉస్మానియా విశ్వవిద్యాలయం 1968లో మహాభారత ‘సంశోధిత ముద్రణ’ను వెలువరించి భారతం మీద విశిష్టమైన పరిశోధలను చేయించింది. ఆ వ్యాసాలు కూడా ఇందులో ఉన్నాయి. ఇక కావ్యాల మీద సాధికారికంగా చేసిన పరిశోధనలకు సంబంధించిన వ్యాసాలు విద్యార్థులకు ఎంతో ఉపయుక్తం. రచయితల సాహిత్య మంచి చెడులను విడమరిచి చెప్పే విమర్శ గురించిన పరిశోధనల మీద రెండు వ్యాసాలున్నాయి. ఇవి విమర్శ ఆంతర్యాన్ని ఆవిష్కృతం చేశాయి. కవిత్వం లోతుపాతులను చర్చించిన ‘ఆధునికాంధ్ర కవిత్వము – సంప్రదాయములు, ప్రయోగములు’, ‘తెలుగులో కవిత్వాదర్శాలు – పరిణామాలు’, ‘ఆధునిక తెలుగు కవిత్వం – వాస్తవికత, అధివాస్తవికత’ అనే పరిశోధనల మీద రాయబడిన వ్యాసాలు నమూనా వ్యాసాలనదగ్గవి. ఆయా కవుల సాహిత్య సేవను పరిశీలిస్తూ చేసిన పరిశోధనల మీద కూడా కొన్ని వ్యాసాలున్నాయి. అవి కూడా ఆయా కవుల సాహిత్యపు వెలుగును, అవి సమాజం మీద చూపిన ప్రభావాన్ని ఎత్తి చూపాయి. మానవుని తొలి వ్యక్తీకరణ అయిన పాట మీద కూడా కొన్ని ఎన్నిక చేసిన పరిశోధన గ్రంథాల మీద వ్యాసాలున్నాయి. ఇవి పాట గురించిన లోతైన అవగాహనను కల్పిస్తాయి. పాట మీద పరిశోధన చేయాలనుకునే విద్యార్థులకు ఇవి మార్గదర్శకాలు. భాష, ఛందస్సు, వ్యాకరణం, అలంకారం మీద కూడా వచ్చిన వేరువేరు పరిశోధనలను పరిచయం చేస్తూ రాసిన వ్యాసాలు ఎన్నో నూతన అంశాలను చెప్తున్నాయి. నవల, కవిసమయములు, పేరడీ, యాత్రా చరిత్రల పైన వచ్చిన పిహెచ్. డి. గ్రంథాలను పరిచయం చేయడం ద్వారా పాఠకులకు ఎన్నో కొత్త విషయాలు తెలియపరుస్తాయి.
ఈ నూటపది వ్యాసాలు తెలుగు సాహిత్య పరిశోధనా క్రమవికాసాన్ని, పరిశోధనలో అవలంభించాల్సిన రీతులను, కఠోర పరిశ్రమను తెలుపుతాయి. తద్వారా పాఠకులకు కొంత నూతన ఆలోచనా ధోరణి, విస్తృతి, పరిణతి కలుగుతాయి. ముఖ్యంగా ఇప్పటి పరిశోధక విద్యార్థులకు పరిశోధనాంశ ఎన్నికకు, ఉన్నత ప్రమాణాలతో సిద్ధాంత గ్రంథాన్ని ఎలా రూపొందించాలో, శాస్త్రీయ ప్రమాణాలకు కట్టుబడుతూ విషయ నిరూపణ ఎలా చేయాలో, ప్రతిపాదనలను ఎలా స్థిరీకరించాలో ఈ రెండు గ్రంథాలు బోధపరుస్తాయి. పరిశోధనపట్ల ఆసక్తి, సత్యశోధన, విషయ విశ్లేషణ, సప్రమాణ నిరూపణ ఈ నాలుగు గుణాలు ఉత్తమ పరిశోధనకు మరింత సారాన్ని అందిస్తాయి. శ్రద్ధ, సహనం, పరిశోధనా గ్రంథాన్ని ఉత్తమంగా రాసే సామర్థ్యం లేకపోతే పేలవమైన సిద్ధాంత గ్రంథమే బయటకు వస్తుంది. ఈ ప్రమాదాన్ని దాటడానికి ఉపయోగపడే ఉత్తమ వ్యాసాల సంకలనమే ఈ ‘సారాంశం’.
తెలుగులో ఉత్తమ ప్రామాణిక పరిశోధన గ్రంథాలనదగ్గ వాటిని ఎన్నుకొని ఎంతో శ్రమించి ఈ వ్యాసాలను రాయించడం ద్వారా సంపాదకుడు ఆశించిన లక్ష్యం నెరవేరినట్లయింది. పరిశోధన గ్రంథాన్ని స్థాయి తగ్గకుండా ఎలా రాయాలో ఈ గ్రంథాలు తెలియజేస్తాయి. ‘మంది ఎక్కువైతే మజ్జిగ పలుచన’ అయినట్లు కాలక్రమంలో పరిశోధకులు పెరిగిపోవడం వలన నీరసమైన, నాణ్యతలేని పరిశోధనా గ్రంథాలే ఎక్కువ వెలువడుతున్నాయి. పరిశోధన స్థాయిని మెరుగుపరుచుకోవడానికి, రాసే విధానం తెలుసుకోవడానికి ఈ వ్యాసాలు ఎంతో మేలు చేస్తాయి.
సాహిత్య కృషిలో ఎంతో లబ్దప్రతిష్ఠులైన వారు, కీర్తిగడించిన వారు కూడా పరిశోధన రంగంలో రాణించలేకపోయారు. కారణం పరిశోధనకు ఆవేశం పనికిరాదు. సంయమనం, ఓర్పు, నేర్పులాంటి ఎన్నో ఉత్తమ గుణాలు కావాలి. లేకపోతే అంతా రసాభాస అయిపోయి మొదటికే మోసం వచ్చి పరిశోధన రంగం నుండి పూర్తిగా తప్పుకోవాల్సి వస్తుంది. అలా మధ్యలోనే పుట్టి ముంచి తప్పుకున్న పరిశోధకులు ఎంతో మంది ఉన్నారు. అలాంటి ప్రమాదాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి, పరిశోధనలో మెలకువలను నేర్చుకోవడానిక ఈ వ్యాసాలు మార్గాన్ని చూపుతాయనడంలో అతిశయోక్తి లేదు. పరిశోధనలో ఇంకా ఖాళీలు ఎక్కడున్నాయో కనీస అవగాహన కలుగుతుంది. జరిగిన పరిశోధనలు ఎంత ఉత్తమంగా జరిగాయి, ఇప్పుడు ఇంకెంత ఉత్తమోత్తమంగా పరిశోధనలు రావాల్సి ఉన్నది అనే జ్ఞానం కలుగుతుంది. అరిగిపోయిన అంశాలు, ఒక పరిశోధనకు నఖలులాంటి పరిశోధనల నుంచి తప్పుకోవడానికి ఈ ‘సారాంశం’ ఉపయోగపడుతుంది.
కాలక్రమానుసారం మనకు తెలియకుండానే సమాజంలో, సాహిత్యంలో ఎంతో మార్పు వచ్చింది. వచ్చిన మార్పును ఎలా పట్టుకోవాలి. దాని ద్వారా సమాజం ఎంత ప్రభావితం అయిందని పరిశీలించడానికి, కొత్త అంశాలను ఎన్నుకోవడానికి సూక్ష్మంగా అర్థం చేసుకోవడానికి ఈ వ్యాసాలు దారి చూపిస్తాయి. నిత్యం ఎన్నో మార్పులకు గురవుతూ కదిలిపోతున్న సమాజాన్ని, సాహిత్యాన్ని అవలోకనం చేసుకొని నూతన పరిశోధనలు రావాలని ఈ వ్యాసాలు ఆకాంక్షిస్తాయి. ప్రపంచీకరణ తరువాత అన్ని రంగాలలో వేగం పెరిగిపోయింది. దానికి పరిశోధనా రంగం కూడా అతీతం కాదు. దీని వల్ల లోతైన పరిశీలన లేకుండానే ఎన్నో పరిశోధనా గ్రంథాలు రాయబడుతున్నాయి. అవార్డు పొందుతున్నాయి. ఈ ధోరణి మంచిది కాదని చెప్పడానికి చేసిన ప్రయత్నం ఇది. మన పూర్వ పరిశోధనలు ఎంత గొప్పగా, నాణ్యతగా ఉన్నాయో ఇప్పటి తరానికి తెలియజెప్పడానికి ఈ వ్యాసాలు ప్రయత్నించాయి. రాబోయే పరిశోధనలు మరింత సారవంతంగా ఉండాలనే సంపాదకుని తపన ఏ మాత్రం ఫలిస్తుందో కాలమే చెప్పాలి.
అధ్యయనం లేకుండానే పరిశోధనా సౌధం మెట్లను ఎక్కడం సాధ్యం కాదని ఈ ‘సారాంశం’ గ్రంథాలు నిరూపించాయి. ఆయా వ్యాస రచయితలు సూచించిన సూచనలను పరిగణనలోకి తీసుకొని ముందుకు అడుగేస్తే దారి అదే దొరుకుతుందని తెలిపిన వ్యాసాలివి. ఈ రెండు గ్రంథాల చివర రెండు భాగాలుగా ఆచార్య జి.ఎస్. మోహన్ రాసిన ‘పరిశోధన స్వరూప స్వభావాలు’ వ్యాసం ఎంతో విలువైనది. ప్రతి పరిశోధక విద్యార్థీ చదివి తీరవలసిన వ్యాసం ఇది. పరిశోధన అంశ ఎన్నిక నుంచి మొదలుకొని సిద్ధాంత గ్రంథం తుది ప్రతి రూపకల్పన దాకా అన్ని విషయాల మీద ఒక స్థూల అవగాహన ఈ వ్యాసం కల్పిస్తుంది. పరిశోధనకు ఉపయోగపడే ఎన్నో సూక్ష్మ అంశాలను చర్చించిన వ్యాసం ఇది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రెండు సంపుటాల ‘సారాంశం’ నూతన పరిశోధకులకొక స్వర్గం.
-డా||వెల్దండి శ్రీధర్
9866977741