గట్టిచేతల మనిషి వట్టికోట

A hard-nosed manతెలంగాణ నేల మీద ప్రజల కోసం జీవించి, ప్రజల కోసం ప్రాణం విడిచిన త్యాగజీవులకు లెక్కేలేదు. కానీ వట్టికోట ఆళ్వారుస్వామిలాగా జీవించిన వాళ్లు మాత్రం బహు అరుదు. త్యాగాలు ఘనమైనవే. కానీ త్యాగాలు చేసే ముందు, వాటి ఫలాలను అందిపుచ్చుకునే చైతన్యం ప్రజల్లో కల్పించాలన్న అవగాహన ఉండాలి. అందుకు ఆయా స్థాయిలలో అవసరమైన పాత్రను పోషించగలగాలి. అంతేకానీ నేను కవిగానో, ఆదేశాలిచ్చే నాయకుడుగానో ఉంటాననుకోవడం, చరిత్రలో చోటుకోసం ఏదో ఒక ఉన్నతమైన స్థానాన్ని వెతుక్కుని అక్కడ పాదుకుపోయి, చేసే ప్రతిపనిలో కీర్తిని వెతుక్కుంటూ తనకు తాను సామాజికోద్దారకుడుగా భావించుకోవడం సరిపోదు. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకున్నవాడే వట్టికోట అళ్వార్‌స్వామి. అందుకే తాను ఎక్కడో ఓ చోట కార్యకర్తగానో నాయకుడిగానో ఉండిపోలేదు. ఒక్కోసారి ఒక్కోచోట, ఒక్కో సందర్భంలో ఒక్కోపాత్రలో అది చిన్నదా పెద్దదా అని ఆలోచించకుండా చేసే ప్రతిపనిలో బాధ్యతతో, సందర్భాన్ని బట్టి కార్యకర్తగా, నాయకుడుగా, రచయితగా, ప్రచారకుడుగా, వ్యూహకర్తగా, సమన్వయకర్తగా, పాత్రికేయుడుగా అటు సాహిత్య రంగంలోనూ, ఇటు రాజకీయ రంగంలో తన అవసరం ఎక్కడ ఎలా ఉంటే అక్కడ అలా పాత్రోచిత కర్తవ్యాన్ని నిర్వర్తించాడు.
ఒడిదుడుకుల బాల్యం : ఓవైపు ప్రపంచ యుద్ధాలు, మరోవైపు స్వాతంత్య పోరాటం, సాయుధ పోరాటం ఉధృతంగా సాగుతున్న రోజులలో పుట్టి పెరిగి, కాలానుగున్యమైన చర్యలకు స్పందిస్తూ పెరిగినవాడు ఆళ్వార్‌. 1915, నవంబర్‌ 1న నకిరేకల్‌ దగ్గర చెరువు మాదారం గ్రామంలో రామచంద్ర రావు, సింహాద్రమ్మలకు జన్మించినాడు. అతని పదకొండవయేటనే తండ్రిని కోల్పోవడంతో పొట్టపోసుకోవడం కోసం సూర్యాపేట, నకిరేకల్‌, కందిబండల్లోని ఇళ్లల్లో వంటపనులు చేసుకుంటూ గడిపాడు. ఆ విధంగా సీతారామారావు పంతులుకు వంటచేసి పెడుతూ చదువుకోవడం ప్రారంభించాడు. అనంతరం విజయవాడలో హోటల్‌ సర్వర్‌గా పనిచేశాడు. సురవరం ప్రతాపరెడ్డి, కాళోజి నారాయణరావులా వట్టికోటకు చాలా విషయాల్లో సారూప్యత ఉన్నా, వారిలాగా అతని జీవితం వడ్డించిన విస్తరి కాదు. బాల్యం నుండి అనేక కష్టాలకోర్చి మండేకొలిమిలో గుండె దిటవు చేసుకుంటూ పెరిగిన గట్టి చేతల మనిషి.
సాహిత్య జీవితం : సూర్యాపేటలోని గ్రంథాలయంలో పనిచేస్తూ స్వయంకృషితో తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్‌ భాషల్ని నేర్చుకోవడం వల్ల తర్వాతి కాలంలో సాహితీ, సామాజిక, రాజకీయ రంగాల్లోనూ అతని ఆలోచనల విస్తృతి పెరిగి తెలుగు నేల నేలంతా విస్తరించాడు. 1933లో విజయవాడ నుంచి హైదరాబాద్‌ వచ్చి గోల్కొండ పత్రికలో ప్రూఫ్‌రీడర్‌గా పనిచేశాడు. ఆ సమయంలో బూర్గుల రామకష్ణారావు, మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డితో పరిచయం, చర్చాగోస్టులు సాహితి రంగం వైపు మళ్ళించినాయి. ప్రూఫ్‌రీడర్‌ నుంచి పాత్రికేయునిగా, సంపాదకుడిగా, ప్రచురణ కర్తగా, కథా, నవలా రచయితగా, గోల్కొండ, స్రవంతి, ఆంధ్రకేసరి, గుమస్తా, మీర్జాన్‌ లాంటి పత్రికల్లో రచనలుచేస్తూ బహుముఖ ప్రజ్ఞాపాటవాలను కనబరిచారు.
కనువిప్పు నాటికతో పాటు, ‘జైలు లోపల’ అనే కథా సంకలనం వేశాడు. ఇందులో తోటి ఖైదీల జీవితాలను చిత్రించాడు. అంతేకాక సమాజంలో పడిపోతున్న విలువల్ని, ప్రశ్నిస్తూ విశాఖపట్నం నుండి వెలుపడే తెలుగు విద్యార్థి పత్రికలో (1956-57) రామప్ప (తోటి ఖైదీ ) రభస శీర్షికతో వ్యంగ్య రచనలు చేశాడు.
ప్రధానంగా 1935 తర్వాత పరిస్థితులకు ఆయన రాసిన ‘ప్రజల మనిషి’ నవల తెలంగాణ సామాజిక జీవితానికి దర్పణంగా నిలుస్తుంది. అత్యంత దుర్మార్గంగా ఉన్న నిజాం పాలన, భూస్వాముల ఆకృత్యాల మధ్య నలుగుతున్న తెలంగాణ, వాటిని ఎదిరించేదుకు కర్తవ్యోన్ముముఖలవుతున్న ప్రజలు, ప్రజల మధ్య నుంచి త్యాగాలకు సిద్ధమవుతూ ఎదిగి వస్తున్న నాయకత్వం, వీటి వెనకాల ఆంధ్ర మహాసభ నేపథ్యం మనకు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తాయి. ఈ నవలలో కంఠీరవం పాత్ర ద్వారా ప్రజల చైతన్య ప్రవాహ క్రమానుగతను కనిపించేలా చేస్తాడు. ముఖ్యంగా గాంధీయిజం, కాంగ్రెస్‌ సిద్ధాంతాలు, ఆర్య సమాజ ప్రభావం వాటి పరిమితులు దాటి లౌకికతత్వ నిర్మాణం వైపు అడుగులు వేస్తున్న తీరు ఆయా పాత్రాలలో కనిపిస్తుంది. ఆ తర్వాత 1940ల నాటి రాజకీయ సాంఘిక విషయాలను చాలా సహజంగా ప్రస్తావించిన నవల ‘గంగు’. ఇందులో రాజకీయ సాంఘిక పరిస్థితుల వల్ల ప్రజలు కమ్యూనిజం వైపు ఆకర్షితులవుతున్న వైనం కనిపిస్తుంది.
ఇందులో ఆంధ్ర మహాసభ ప్రభావంతో నల్లగొండ జిల్లా సూర్యాపేటకు దగ్గర బీబీగూడలో భూస్వామ్య కుటుంబానికి చెందిన వేములపల్లి సత్యవతి అనే 15 ఏండ్ల బాలిక కమ్యూనిస్టుగా మారేందుకు విజయవాడకు పారిపోయి అక్కడ పొట్లూరి వెంకటేశ్వరరావుని వివాహం చేసుకుంది. ఈ అసలు కథను సుజాత పేరుతొ ‘గంగు’ నవల రాశాడు. మొద్దు నిద్రపోతున్న ఈనాటి సమాజాన్ని మేల్కొల్పడానికి అభ్యుదయ, విప్లవ కవులు, రచయితలు క్రియాశీలతలేని భావజాలాన్నీ వల్లె వేస్తే చాలదని వట్టికోట జీవితం మనకు తెలియజేస్తుంది. ఓవైపు సామాన్యుల ఈతిబాధల్ని ఉన్నది ఉన్నట్టుగా ఆవిష్కరిస్తూనే, అందుకు కారణమైన పాలకుల దాష్టికాన్ని ఎదిరించే ఉద్యమ కర్తవ్యాల్ని నూరిపోస్తాడు. దీన్నిబట్టి వట్టికోట అవసరానికో, దారి తప్పిన ఆవేశానికో లోనైనవాడు కాక, తన ప్రతి క్రియను వ్యూహాత్మకంగా సిద్ధపరచుకుంటూ ఓ స్పష్టమైన సమాజ నిర్మాణాన్ని ఆశించిన వాడుగా కనిపిస్తాడు. అందుకోసం కష్టాల్ని సైతం కొనితెచ్చుకోవడం తప్ప తప్పించుకోవటం ఎరగడు.
దేశోద్ధారక గ్రంథమాల : దీన్ని 1938 సికింద్రాబాద్‌లో ఏర్పాటు చేశారు. చాలామంది చాలా సంస్థల్ని స్థాపించారు. కానీ దేశోద్ధారక గ్రంథమాలకు ఓ ప్రత్యేకత ఉంది. చాలామంది సమకాలీన రచయితల కంటే నాయకుల కంటే, అతను నాటి సమాజాన్ని అర్థం చేసుకున్న తీరే అందుకు కారణం. విజ్ఞానానికి విలువ కట్టని సమాజం పురోభివృద్ధి చెందదని బలంగా నమ్మి, దాని సాధన కోసం స్వీయకార్యాచరణ ఏర్పరచుకున్నాడు. అందులో భాగంగానే దేశోద్ధారక గ్రంథమాలను స్థాపించి 35 గ్రంథాలని అచ్చు వేయించాడు.
ఉద్యమ జీవితం : ఆళ్వారు సూర్యాపేటలో ఉన్నప్పుడు 1942లో స్టేట్‌ కాంగ్రెస్‌ వాదిగా సత్యాగ్రహంలో పాల్గొని అరెస్టై సికింద్రాబాద్‌ జైలుకెళ్లాడు. పీడనకు వ్యతిరేకంగా ప్రజల్లో పోరాటభావన బలపడుతున్న కొద్దీ ఆంధ్రమహాసభ కార్యకర్త నుండి కమ్యూనిస్టు పార్టీ సభ్యుడిగా పరిణామం చెందాడు. 1946లో నిజాం ప్రభుత్వం పార్టీపై నిషేధం విధించడం వల్ల అరెస్టై 1946- 51 జైలు జీవితం అనుభవించాడు. సంగారెడ్డి, వరంగల్‌, గుల్బర్గా, నిజామాబాద్‌ జైళ్లలో ఉన్నాడు. దాశరధి ‘ఓ నిజాము పిశాచమా!..’ అంటూ పద్యాలను జైలుగోడల మీద రాసినప్పుడు, జైలు అధికారులు చెడిపివేస్తే, వాటిని మళ్లీ మళ్ళీ గోడల మీద రాస్తూ దెబ్బలు తినేవాడు. వీరి జంట అధికారులకు ఇబ్బందిగా మారడంతో వీరిని విడదీసి వేరువేరు జైళ్లకు పంపించారు. ఓ విధంగా చెప్పాలంటే వట్టికోట దాశరథిని కూడా అనేక విధాలుగా ప్రభావితం చేశాడు. కాబట్టి దాశరధి తన మొదటి రచన ‘అగ్ని దార’ను వట్టికోటకు అంకితమిచ్చాడు
కార్యాచరణ వాది: వట్టికోట కేవలం రచనలు చేస్తూ తృప్తిపడలేదు. తాను కలగన్న సమాజం కోసం జీవితాన్ని ప్రత్యక్ష కార్యాచరణకు సిద్ధం చేసుకున్నాడు. గుమస్తాలకోసం, రిక్షావాళ్ల కోసం సంఘాలు ఏర్పాటు చేసి, కార్మికులని ఉద్యమ బాట పట్టించాడు. హైదరాబాదులో గుమస్తాలకు నెలలో ఒకరోజు కూడా సెలవు ఉండేది కాదు. ఈ విషయాన్ని నిజాం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి నెలకు నాలుగు రోజులు సెలవులు ఉండేవిధంగా 1944 డిసెంబర్‌ 25న జీవో తీయించాడు. అలాగే మొదటి ప్రపంచయుద్ధ నేపథ్యంలో నిజాం, మనుషులు లాగే రిక్షాలను రద్దు చేశాడు. దీన్ని నిరసిస్తూ రిక్షా కార్మికులను కూడగట్టి పోరాటం చేసి విజయం సాధించి కార్మికుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపాడు. దొడ్డి కొమరయ్య మరణం నేపథ్యంలో పౌర హక్కుల నాయకుడిగా పద్మజానాయుడును వెంటతీసుకొని నిజనిర్ధారణకు కడివెండికి వెళ్ళాడు. ఈ విప్లవ కార్యాచరణయే అతన్ని 1951 వరకు కూడా జైలు నుండి విడుదల కాకుండా చేసింది కాబోలు. నిజాం, నవాబుగా ఉన్నపుడు చేసిన ఒక పర్యటనలో, అతనిపై బాంబు దాడి చేసి, దొరికిపోయి జైలు శిక్ష అనుభవిస్తున్న పవార్‌ అనే వ్యక్తి, తరువాత రామానందతీర్థ ఒత్తిడి మేరకు 1949 లోనే విడుదలయ్యాడని గమనించాలి.
ఇంతటి విస్తృత చరిత్ర కలిగిన వట్టికోట, కాలం మనకు బహుకరించిన వైతాళికుడు. అందుకే ఆయన జీవితం ఆధునికానంతర భావాజాలంలో పడి కొట్టుమిట్టాడుతున్న నేటి సమాజానికి ఓ దిక్సూచి.