శిథిలావస్థలో గ్రంథాలయం

నవతెలంగాణ-జూలూరుపాడు
పది మందికి విజ్ఞానాన్ని అందించేందుకు గతంలో మండలానికో గ్రంథాలయాన్ని నిర్మించారు. తర్వాత వాటి బాగోగులు పట్టించుకోక పోవడంతో అవి నేడు ప్రాణాలు తీసేలా తయారయ్యాయి. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన గ్రంథాలయం ఎప్పుడు కూలుతుందోనన్న స్థితిలో ఉంది. దీంతో నిత్యం గ్రంథాలయానికి వచ్చే పాఠకులు భయాందోళనకు గురవుతున్నారు. కొంతమంది రావడం మానేశారు. అధికారులు పలుమార్లు శిథిల భవనాన్ని చూసి వెళుతున్నారే తప్ప.. కనీసం భవనానికి మరమ్మతుల కోసం నిధులు మంజూరు చేయించడం లేదు. ఇక పాలకులైతే మనకెందుకులే అన్నట్లుగా ఉన్నారు. ఈ గ్రంథాలయాన్ని 1997లో టీడీపీ హయాంలో భారీ నీటి పారుదల శాఖామాత్యులు తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభోత్సవం చేశారు. ఇందులో రెండు గదులు, ఒక వరండా మాత్రమే ఉన్నాయి. స్లాబు దెబ్బతిని ఇనుప కమ్మీలు బయటపడి పెచ్చులూడుతున్నాయి.ఇక వర్షం వస్తే గదుల్లో ఉన్న పుస్తకాలు, పత్రికలు తడిసి ముద్దవుతాయి. కాగా పంచాయతీల నుంచి ఒక్క రూపాయి గ్రంథాలయాలకు జమ కావడం లేదని లైబ్రేరియన్‌ ఇటీవల తనిఖీలకు వచ్చిన అధికారులకు తెలిపారు. టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పంచాయతీకో డిజిటల్‌ లైబ్రరీ (గ్రంథాలయం) నిర్మాణం చేస్తామని హామీలు ఇచ్చారు. అవి ఇప్పటికీ నిర్మాణాలకు ఎక్కడా నోచుకోలేదు. కనీసం శిథిలావస్థలో ఉన్న భవనాలకు మరమ్మతుల కోసం నిధులు మంజూరు చేస్తే ప్రయోజనం ఉంటుందని పాఠకులు భావిస్తున్నారు.