చేయాల్సింది ఎంతో ఉంది పారిస్‌ ఒప్పందంలో భారత్‌ హామీలపై సీఏటీ నివేదిక

న్యూఢిల్లీ : పారిస్‌లో 2015లో జరిగిన జీ-20 దేశాల సమావేశంలో వాతావరణ మార్పులపై ఇచ్చిన హామీలను అన్నింటినీ నెరవేర్చిన ఏకైక దేశం భారతదేశమేనని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పుకొచ్చారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో కలిసి శ్వేతసౌధంలో నిర్వహించిన సంయుక్త విలేకరుల సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ పారిస్‌ ఒప్పందంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను ప్రస్తావిం చారు. వాస్తవానికి ఈ లక్ష్యాలను చేరుకోవడానికి మన దేశం కొన్ని చర్యలను అమలు చేసింది కూడా. అయితే అన్ని లక్ష్యాలనూ చేరుకోవడంలో మాత్రం చాలా వెనుకబడింది. వాతావరణంపై 40 దేశాలు తీసుకున్న చర్యలు, వాటి ప్రభావంపై ‘ది క్లైమేట్‌ యాక్షన్‌ ట్రాకర్‌’ (సీఏటీ) అనే సంస్థ రూపొందించిన నివేదిక ప్రకారం వాతావరణ మార్పులపై మన దేశం తీసుకున్న చర్యలు లక్ష్యాలను చేరుకోవడానికి ఏ మాత్రం సరిపోవు.
కర్బన ఉద్గమనాల తీవ్రతను 2030 నాటికి 33-35% మేర తగ్గిస్తానని భారత్‌ హామీ ఇచ్చింది. ఆ తర్వాత లక్ష్యాన్ని 40%నికి పెంచింది. అదే సమయంలో స్వచ్ఛమైన ఇంధన వనరుల నుండి సంచిత విద్యుదుత్పతిని 40 శాతానికి పెంచుతానని తెలిపింది. అడవులు, చెట్లను పెంచి వాతావరణంలో కార్బన్‌డైయాక్సైడ్‌ను తగ్గిస్తానని చెప్పింది. స్వచ్ఛమైన ఇంధన వనరుల ప్రాజెక్టులను అభివృద్ధి చేయడంలో మన దేశం కొంత పురోగతి సాధించినప్పటికీ 2022 నాటికి 175 గిగా-వాట్ల పునరుద్పాదక ఇంధనాన్ని ఉత్పత్తి చేస్తానన్న లక్ష్యాన్ని మాత్రం చేరుకోలేక పోయింది.
పారిస్‌ ఒప్పందంలో పొందుపరిచిన లక్ష్యాలను చేరుకోవడమే కాకుండా ఈ విషయంలో అమెరికా వంటి ఇతర దేశాలకు కూడా సాయపడ్డామని మోడీ చెప్పారు. 2021 ఆగస్టులో కూడా ఆయన ఇవే వ్యాఖ్యలు చేశారు. అయితే భారత్‌ చేయాల్సింది ఎంతో ఉందని సీఏటీ తెలిపింది. ఉదాహరణకు ఉష్ణోగ్రత పరిమితికి సంబంధించి భారత్‌ అమలు చేస్తున్న వాతావరణ విధానాలు, నెరవేరుస్తున్న హామీ లు నిలకడగా లేవని తేల్చింది. ‘దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగా అతి తక్కువ కర్బనాన్ని ఉత్పత్తి చేస్తానని ఇచ్చిన హామీ విషయంలో భారత్‌ పనితీరు పేలవం గా ఉంది. బొగ్గు ఉత్పత్తిని కొనసాగించడమే దీనికి కారణం. 2070 నాటికి కర్బన ఉద్గమనాలను జీరో స్థాయికి తీసుకురావాలన్న లక్ష్యాన్ని చేరుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అనుకున్నది సాధించాలంటే స్వల్పకాలిక లక్ష్యాలను నిర్దేశించుకొని అడుగులు వేయాలి’ అని వివరించింది.
పారిస్‌ ఒప్పందంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి జీ-20లోని ఏ ఒక్క దేశం ముందుకు సాగడం లేదని 2020లో విడుదలైన ఒక నివేదిక స్పష్టం చేసింది.
ఉద్గమనాలను జీరో స్థాయికి తీసుకురావాలన్న లక్ష్యం నెరవేరాలంటే భారత్‌, అమెరికా దేశాలు తీసుకోవాల్సిన చట్టపరమైన చర్యలు ఎన్నో ఉన్నాయని ఆ నివేదిక తెలిపింది.