‘దళితబంధు’ రాలేదని వ్యక్తి ఆత్మహత్య

Man commits suicide because 'Dalit Bandhu' did not come–  రాకుండా కౌన్సిలర్‌ అడ్డుకుంటున్నాడని సూసైడ్‌ నోట్‌
నవ తెలంగాణ-మోత్కూరు
దళితబంధుకు తనను ఎంపిక చేయడం లేదన్న మనస్తాపంతో ఓ నిరుపేద దళితుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కారు మున్సిపాలిటీలో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మోత్కూరు మున్సిపల్‌ కేంద్రంలోని గాంధీనగర్‌ కాలనీకి చెందిన కూరెళ్ల రమేష్‌ (50) కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. బీఆర్‌ఎస్‌ కార్యకర్త అయిన రమేష్‌ 12వ వార్డు కౌన్సిలర్‌ కూరెళ్ల కుమారస్వామితో కలిసి పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. కాగా, దళితబంధు పథకం మొదటి విడతలో రమేష్‌ పేరు పెట్టకపోవడంతో రెండో విడతలో పెట్టిస్తామని కౌన్సిలర్‌ అతనికి సర్దిచెప్పినట్టు స్థానికులు చెబుతున్నారు. కాగా, రెండో విడత దళితబంధు కోసం కౌన్సిలర్‌ కుమారస్వామి కాలనీకి చెందిన కొందరి పేర్లు ఎంపిక చేసి రెండు రోజుల క్రితం ఎమ్మెల్యేకు పంపారని, ఆ లిస్టులో తన పేరు లేకపోవడంతో రమేష్‌ మనస్తాపం చెందాడు. మంగళవారం గాంధీనగర్‌ కాలనీలో అతని బంధువు చనిపోగా అంత్యక్రియల్లో పాల్గొని సాయంత్రం ఇంటికి రాగా ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఉరి వేసుకున్నాడు. చిన్న కుమారుడు సామేల్‌ ఇంటికి రాగా అప్పటికే రమేష్‌ మృతి చెందాడు. కాగా, మృతుడు రమేష్‌.. దళితబంధులో తనను ఎంపిక చేయలేదని, తనను ఎంపిక చేయకుండా కౌన్సిలర్‌ కూరెళ్ల కుమారస్వామి అడ్డుకుంటున్నారని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సూసైడ్‌ లెటర్‌ కూడా రాసి పెట్టారు. సంఘటనా స్థలాన్ని ఎస్‌ఐ ఏమిరెడ్డి శ్రీకాంత్‌ రెడ్డి సందర్శించి పంచనామా చేసి శవాన్ని పోస్టుమార్టం కోసం రామన్నపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలంలో సూసైడ్‌ లెటర్‌ స్వాధీనం చేసుకున్నట్టు ఎస్‌ఐ తెలిపారు. కాగా, ఈ ఘటనపై కౌన్సిలర్‌ కూరెళ్ల కుమారస్వామిని వివరణ కోరగా.. దళితబంధు రాకపోవడానికి తాను కారణమన్నది అవాస్తవమని, లబ్దిదారుల పేర్ల ఎంపికతో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు.