కనీస పెన్షన్‌ రూ.9 వేలు చెల్లించాలి

–  ఆలిండియా ఈపీఎఫ్‌ పెన్షనర్‌ సంఘాల సమన్వయ కమిటీ డిమాండ్‌
–  మహారాష్ట్రలో 3వ జాతీయ మహాసభ ప్రారంభం
నవతెలంగాణ – మహారాష్ట్ర
ఆలిండియా ఈపీఎఫ్‌ పెన్షనర్‌ సంఘాల సమన్వయ కమిటీ మూడో జాతీయ మహాసభలు మహారాష్ట్రలోని అకోలా జిల్లాలో ఉన్న షెగాంవ్‌ పట్టణంలో మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ మహాసభలకు తెలంగాణ ఆల్‌ పెన్షనర్స్‌ అండ్‌ రిటైర్డ్‌ పర్సన్ల సంఘం (టీఏపీఆర్‌పీఏ) తరఫున 32 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పోతుల నారా యణరెడ్డి, పాలకుర్తి కృష్ణమూర్తి నేతృత్వంలో ఎం జనార్ధన్‌రెడ్డి, ఎన్‌ బ్రహ్మచారి, బి రామారావు, లింగా అరుణ తదితరులు ఆ మహాసభలకు సంబంధించిన చర్చల్లో పాలొన్నారు. పెన్షనర్లకు కనీస పెన్షన్‌ రూ.తొమ్మిది వేలు చెల్లించాలని, ఈపీఎఫ్‌ కార్పస్‌ ఫండ్‌ను ప్రయివేటీకరించొద్దని, ఈపీఎస్‌ స్కీంకు 2014లో చేసిన సవరణలన్నింటినీ రద్దు చేసి హయ్యర్‌ పెన్షన్‌కు ఆప్షన్‌ సౌకర్యం కల్పించాలని, ప్రొ రెటా పద్ధతిలో పెన్షన్‌ను లెక్కించొద్దని, 60 ఏండ్ల సగటు వేతనానికి బదులు గా ఉద్యోగ విరమణ సమయంలో వేతనంలో సగం పెన్షన్‌గా నిర్ధారించాలని, నిత్యావసర సరుకులు, ప్రయాణ రాయితీలు, ఆరోగ్య సదుపాయాలను కల్పించాలని, ప్రాంతీయ కార్యాలయాల్లో సిబ్బందిని నియమించాలని, పీఎఫ్‌నకు చెల్లించిన మిగిలిన 50 శాతం సొమ్మును పెన్షన్‌ ఫండ్‌కు జమ చేయాలని మహాసభల్లో తీర్మానాలను ఆమోదించారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమ కార్యాచరణను రూపొందించాలని నిర్ణయించారు.