వేసవిలోనే పూర్తిస్థాయిలో నిండిన మూసీ ప్రాజెక్ట్‌

– దిగువకు నీటిని విడుదల చేసిన అధికారులు
నవతెలంగాణ-కేతేపల్లి
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రెండో పెద్ద ప్రాజెక్ట్‌ అయిన మూసీ రిజర్వాయర్‌ వేసవిలోనే పూర్తిస్థాయిలో నిండి.. గరిష్ట నీటిమట్టం 645 అడుగులకు చేరుకున్నదని అధికారులు తెలిపారు. దాంతో అప్రమత్తమైన అధికారులు సోమవారం 3వ నెంబర్‌ క్రస్ట్‌ గేట్‌ అరఫీట్‌ మేర పైకి ఎత్తి 330 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెప్పారు. కాగా, ప్రాజెక్టుకు ఇన్‌ ఫ్లో 243.16 క్యూసెక్కులు, అవుట్‌ ఫ్లో 88.17 క్యూసెక్కులు నీటి ప్రవాహం ఉన్నట్టు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. పూర్తి స్థాయి నీటిమట్టం 645 ఫీట్లు కాగా, ప్రస్తుత నీటిమట్టం 644.60 ఫీట్లు వద్ద స్థిరంగా ఉంది. పూర్తి స్థాయి సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 4.36 టీఎంసీలుగా నమోదైంది. ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండటంతో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండి దిగువకు నీటిని విడుదల చేయడంతో ఆయకట్టు రైతులు వానాకాలం సాగుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కార్యక్రమంలో డీఈ చంద్రశేఖర్‌, ఏఈలు ఉదరు కుమార్‌, మమత, స్వప్న పాల్గొన్నారు.