సింగర్ సునీత తనయుడు ఆకాష్ ‘సర్కారు నౌకరి’ సినిమాతో హీరోగా పరిచయవుతున్నారు. భావన హీరోయిన్. ఈ చిత్రాన్ని ఆర్కే టెలీ షో బ్యానర్ పై దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నిర్మించారు. గంగనమోని శేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న థియేటర్స్‌లో విడుదలవుతోంది. ఈ సందర్భంగా హీరో ఆకాష్ శుక్రవారం మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాల సమాహారం.. ‘నాకు యాక్టింగ్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. చిరంజీవి సినిమాలు ఎక్కువగా చూస్తుండేవాడిని. అలాగే డ్యాన్స్ క్లాసులకు వెళ్లాను. ఉత్తేజ్ మయూఖ ఇన్ స్టిట్యూట్‌లో రెండున్నర నెలలు యాక్టింగ్ కోర్సు చేశాను. నాకు, అమ్మకు కలిపి దర్శకుడు శేఖర్ ఈ కథ చెప్పారు. కథ వినగానే నాకు బాగా నచ్చింది. గ్రామీణ ప్రాంత ప్రజలకు కండోమ్స్ వాడకం, ఎయిడ్స్ మీద అవగాహన కల్పించే క్రమంలో ఓ ప్రభుత్వ ఉద్యోగి ఎలాంటి సంఘర్షణ ఎదుర్కొన్నాడు?, తన లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడు?, ఇందుకు అతనిలో ఉన్న మరో బలమైన కారణం ఏంటి అనేది ఈ సినిమా కథాంశం. ఈ కథలో ఎమోషన్, ఎంటర్‌టైన్‌మెంట్, మెసేజ్ అన్నీ ఉన్నాయి. అలాగే నా క్యారెక్టర్‌లో ఉద్యోగ ధర్మం, ప్రజల్ని చైతన్య చేయాలనే లక్ష్యం ఉంటాయి. అదే టైమ్‌లో నా ఉద్యోగం పట్ల నా మిత్రులు, నా భార్య ఎలా రియాక్ట్ అయ్యారు అనేది ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. మన సొసైటీలో ఒక టైమ్‌లో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్‌కి ఫిక్షన్ కలిపి ఈ సినిమా చేశాం. ఇందులో నా క్యారెక్టర్‌లో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. దర్శకేంద్రుడి చేతుల మీదుగా నేను హీరోగా లాంచ్ అవడాన్ని నా లైఫ్ లో మర్చిపోలేను. టీజర్ లాంచ్‌లో అమ్మ కన్నీళ్లు పెట్టుకుంది. నేను రాఘవేంద్రరావు, తనికెళ్ల భరణి లాంటి పెద్ద వాళ్లతో కలిసి పనిచేస్తున్నాను అనే ఫీలింగ్ అమ్మకు, నాకు ఎంతో గర్వంగా అనిపించింది. నటుడిగా నిరూపించుకోవాలని ఉంది. ఇకపై కమర్షియల్ సినిమాల్లోనూ నటించాలని ఉంది’.