న్యూఢిల్లీ : వినియోగ వ్యయం, ఉపాధిపై 2019లో ఏర్పాటు చేసిన స్టాండింగ్ కమిటీ ఆన్ ఎకనామిక్స్ స్టాటిస్టిక్స్ (ఎస్‌సీఈఎస్) సమీక్షించిన చేసిన గృహ సర్వేలు, సమాచారంపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో మొత్తం అధికారిక సమాచారాన్ని సమీక్షించడానికి మరొక కొత్త ప్యానెల్‌ను కేంద్రం ఏర్పాటు చేసింది. స్టాండింగ్ కమిటీ ఆన్ స్టాటిస్టిక్స్(ఎస్‌సీఈఎస్)ను ఏర్పాటు కేంద్ర గణాంక మంత్రిత్వ శాఖ గురువారం అర్థరాత్రి ఈ మేరకు ఉత్తర్వలు జారీ చేసింది. జాతీయ గణాంక కార్యాలయం నేతృత్వంలో చేసిన అన్ని సర్వేల ఫలితాలను, సమాచారాన్ని ఈ కొత్త ప్యానెల్ మరొకసారి సమీక్షిస్తుంది. ఎస్‌సీఈఎస్ కేవలం ఆర్థిక సమాచార సర్వేలపై మాత్రమే సమీక్షించగా, కొత్త ప్యానెల్ మాత్రం ఆర్థిక, సామాజిక అంశాలతో సహా మొత్తం సమాచారంపై సమీక్షలు చేస్తుంది. సర్వే ఫలితాలు, అంతరాలపై కేంద్ర ప్రభుత్వానికి సలహాలు ఇస్తుంది. భారత దేశపు మొట్టమొదటి ముఖ్య గణాంక శాస్త్రవేత్త, జాతీయ గణాంక కమిషన్ (ఎన్‌ఎస్‌సీ) మాజీ చైర్మన్ ప్రొనభ్ సేన్ ఈ ప్యానెల్‌కు అధ్యక్షులుగా ఉంటారు. ఈ ప్యానెల్ పది మంది అధికారిక సభ్యులు, మరో నలుగురు ప్రముఖ విద్యావేత్తలు అనధికార సభ్యులుగా ఉంటారు. కేంద్ర గణాంక మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు ప్రకారం ఈ ప్యానెల్‌లో గరిష్టంగా 16 మంది వరకూ సభ్యులు ఉండవచ్చు.
ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యులు, ఛైర్‌పర్సన్ వివేక్ దేబ్రారుతో సహా అనేక మంది ప్రముఖులు ఎస్‌సీఈఎస్ సమాచారంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. సర్వేల రూపకల్పనల్లో భారత స్టాటిస్టికల్ సర్వీస్‌కు సరైన నైపుణ్యం లేదని విమర్శించారు. కాగా సర్వే ఫలితాలను ఖరారు చేయడంలో ఈ కొత్త ప్యానెల్ సహాయం చేస్తుంది. ముఖ్యంగా పారిశ్రామిక రంగం, సేవల రంగం, కార్మిక శక్తి గణాంకాలను ప్యానెల్ తప్పనిసరిగా సమీక్షిస్తుంది. అయితే ఈ ఫలితాల వెల్లడిని ఆమోదించే అంతిమ అధికారం ఎన్‌ఎస్‌సీకి మాత్రమే ఉంటుంది. గత డిసెంబర్‌లో ఎన్‌ఎస్‌సీని కేంద్రం పునర్మించింది. దాని పార్ట్‌టైమ్ చైర్‌పర్సన్‌గా చెన్నై మ్యాథమెటికల్ ఇనిస్టూట్యూట్ ప్రొఫెసర్ రాజీవ లక్ష్మణ్ కరాండికర్‌ను నియమించారు. ఎన్‌ఎస్‌సీలో ఇంకా రెండు ఖాళీలు ఉన్నాయి.