– రోడ్డు పక్కనచెత్త ఊడ్చుతుండగా ఘటన..
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
రోడ్డు పక్కన చెత్త ఊడుస్తున్న జీహెచ్‌ఎంసీ పారిశుధ్య కార్మికురాలిని వేగంగా దూసుకొచ్చిన ఓ ప్రయివేటు కళాశాల బస్సు ఢ కొనడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణం కోల్పోయింది. ఈ ఘటన హైదరాబాద్ నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం జరిగిందిజ నారాయణగూడ సీఐ యు.చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. సీతాఫల్‌మండి ప్రాంతానికి చెందిన తిప్పారపు సునీత(41) 10 ఏండ్ల నుంచి జీహెచ్‌ఎంసీ, ఎస్‌ఎఫ్‌ఏ అర్జున్ టీంలో (21 మంది టీం) అవుట్ సోర్సింగ్ విభాగంలో పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తుంది. సోమవారం రాంకోఠి ప్రాంతంలో సునీత ఉదయం రోడ్డుపై చెత్త ఊడుస్తుండగా దుండిగల్ ప్రాంతానికి చెందిన అయాన్ ఇనిస్టిట్యూట్ మెడికల్ సైన్స్ కళాశాల బస్సు అతి వేగంగా వచ్చి ఆమెను ఢకొీట్టింది. దాంతో బస్సు, అక్కడే ఉన్న చెట్టుకు మధ్యలో ఆమె నలిగిపోయి విలవిల్లాడి అక్కడికక్కడే ప్రాణం విడిచింది. స్థానికుల సమాచారం మేరకు నారాయణగూడ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని బస్సు డ్రైవర్ ఎండి.మహమ్మద్ మోమిన్‌ను అదుపులోకి తీసుకున్నారు.
బస్సును సీజ్ చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు. సునీత మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మిగతా సమాచారం కోసం మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్‌కు ఈ కేసును బదిలీ చేసినట్టు నారాయణగూడ సీఐ తెలిపారు. కాగా.. సునీతకు కుమారుడు, కూతురు ఉన్నారు. ఆమె భర్త వికలాంగుడు అవడంతో ఇంటి బాధ్యతలు ఆమెనే మోసేది. నెలకు రూ.14 వేల వేతనంతో జీవనం కొనసాగించేది. సునీత తల్లి చంద్రకళ పారిశుధ్య కార్మికురాలుగా రిటైర్మెంట్ కావడంతో తల్లి ఉద్యోగం ఆమెకు వచ్చింది. ఇప్పుడు ఆ కుటుంబం ఉన్న ఒక్క ఆధారమైన పెద్దదిక్కును కోల్పోయింది.