– మరమ్మతు చేయని అధికారులు
– ముంచుకొస్తున్న ఖరీఫ్ సీజన్
– ఆందోళన అన్నదాత
నవతెలంగాణ-కల్లూరు
కల్లూరు పెద్ద చెరువులో పెద్ద తూములో షట్టర్ ఇరుక్కుపోయి గత రెండు క్రాఫ్లకు సాగునీరు సక్రమంగా అందక రైతులు ఇబ్బంది పడ్డారు. సీజన్ ప్రారంభం కావటం చెరువు నిండా నీరు ఉండటంతో పనులు చేపట్టడానికి వీలు లేక ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా అధికారులు గత ఖరీఫ్, రబీ సీజనులకు సాగునీరు అందించడం జరిగింది. మే నెల చివరి వారం గడిచిన నేటికీ తూము మరమ్మతు పనులు ప్రారంభించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పెద్ద చెరువుకు పెద్దతూము ద్వారా 450 ఎకరాలు సాగునీరు సరఫరా అవుతుంది. ఏప్రిల్ నెల వరకు నాగార్జునసాగర్ జలాలు సరఫరా కావడంతో నేటికీ చెరువు నిండా నీరు ఉంది. మరమ్మతులు కాంట్రాక్టు పొందిన కాంట్రాక్టర్ చెరువులో నీళ్లు ఉన్నాయంటూ కాలాతీతం చేస్తున్నారు. దీంతో జూన్ మొదటి వారంలో మళ్లీ వర్షాలు పడితే చెరువులోకి వర్షపు నీరు చేరితే అసలు మరమ్మత్తులు చేయడానికి సాధ్యం కాదని రైతులంటున్నారు. ఇప్పుడు తుము షట్టర్ మరమ్మతులు చేయకపోతే మళ్లీ ఖరీఫ్, రబి, సీజన్లో కూడా అటు రైతులు ఇటు అధికారులు ఇబ్బంది పడక తప్పదు. పెద్ద చెరువులో పెద్ద తూములో షట్టర్ ఇరుక్కుపోయి విరిగిపోయింది. ఈ తూము ద్వారా పుల్లయ్య బంజర, లోకవరం, కిష్టయ్య బంజర, హనుమ తండా గన్యా తండా గ్రామాలకు సంబంధించిన 450 ఎకరాలలోని రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఖరీఫ్ సీజన్ మరో వారం రోజుల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే రైతులు ఇటీవల వర్షాలు పడటంతో వరి పొలాలు దుక్కులు దున్నుతున్నారు. దీంతో రైతులకు ఈ ఖరీఫ్ సీజన్ కూడా మరమ్మతులు చేస్తారో లేదో అని ఆందోళన చెపుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కాంట్రాక్టర్ పై ఒత్తిడి తీసుకొచ్చి మరమ్మతులు పనులు చేపట్టకపోతే ఆందోళన దిగుతామని పలువురు రైతులు స్పష్ట చేశారు. ఈ విషయంపై డిఈ రత్నాకర్‌ను వివరణ కోరగా చెరువులో నీటిమట్టం తగ్గుతుందేమోనని చూస్తున్నామన్నారు. సంబంధించిన కాంట్రాక్టర్ కూడా నీరు తగ్గుతుంది ఏమోనని చూస్తున్నారని అన్నారు, సోమవారం నుండి పనులు ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నామని, ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే మరమ్మతు పూర్తిచేస్తామని రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.