పాకిస్తాన్‌లో ఆత్మాహుతి దాడి

A suicide attack in Pakistan– 59 మంది మృతి వంద మందికిపైగా గాయాలు
కరాచీ : పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌ ప్రావిన్స్‌లో శక్తిమంతమైన బాంబు పేలుడు సంభవించింది. ఓ మసీదు ప్రాంగణంలో జరిగిన ఈ ఘటనలో దాదాపు 55 మంది మరణించినట్టు పాక్‌ మీడియా కథనాలు వెల్లడించాయి. మృతుల్లో ఓ పోలీసు ఉన్నతాధికారి కూడా ఉన్నారు. ఈ ఘటన ఆత్మాహుతి దాడిగా తెలుస్తోంది. మిలాద్‌ ఉన్‌ నబీని పురస్కరించుకుని మస్తుంగ్‌ జిల్లాలోని ఓ మసీదు వద్ద శుక్రవారం మధ్యాహ్నం ర్యాలీ నిర్వహించారు. ఇందులో పెద్ద ఎత్తున స్థానికులు పాల్గొని ప్రార్థనలు చేశారు. ఆ సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 59 మంది మతిచెందగా.. మరో 100 మందికి పైగా గాయపడినట్టు పాక్‌ మీడియా వెల్లడించింది. క్షతగాత్రుల్లో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్టు తెలుస్తోంది.
అన్ని ఆస్పత్రుల్లో అత్యవసర పరిస్థితి…
బలూచిస్తాన్‌ తాత్కాలిక సమాచార మంత్రి జాన్‌ అచక్జారు మాట్లాడుతూ … ఈ బాంబు పేలుడులో తీవ్రంగా గాయపడినవారిని క్వెట్టాకు బదిలీ చేస్తున్నారని తెలిపారు. అన్ని ఆస్పత్రుల్లో అత్యవసర పరిస్థితి విధించబడిందని అన్నారు.
భద్రతలను కఠినతరం చేయండి : కరాచీ పోలీసులకు ఆదేశాలు
బాంబు పేలుడు నేపథ్యంలో… అధికార యంత్రాంగమంతా పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని, ఈద్‌-ఐ-మిలాద్‌ ఊరేగింపుల కోసం పోలీసులు భద్రతా ఏర్పాట్లను కఠినతరం చేయాలని కరాచీ అదనపు ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ పోలీసులను ఆదేశించినట్టు కరాచీ పోలీసులు తెలిపారు.