ప్రత్యేక కోర్టుకు ఇమ్రాన్‌

– అల్‌ఖదీర్‌ ట్రస్టు కేసులో 8రోజులు ఎన్‌ఏబీ కస్టడీకి
– తోషఖానా అవినీతి కేసులో అభిశంసన
– పాకిస్తాన్‌లో పీటీఐ కార్యకర్తల నిరసలు
ఇస్లామాబాద్‌ :
అవినీతి కేసులో అరెస్టయిన పాకిస్తాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ను బుధవారం ఇక్కడ ప్రత్యేక కోర్టులో హాజరుపర్చారు. ఆయనను 14రోజులపాటు తమ కస్టడీకి పంపాల్సిందిగా తొలుత అవినీతి నిరోధక పర్యవేక్షక సంస్థ కోరింది. కానీ కోర్టు 8రోజుల రిమాండ్‌కు అంగీకరించిందని ఇమ్రాన్‌ తరపు న్యాయవాదులు తెలిపారు. కేసు విచారణ నిమిత్తం ఇస్లామాబాద్‌ హైకోర్టుకు మంగళవారం ఇమ్రాన్‌ రాగా పేరా మిలటరీ రేంజర్లు బలవంతంగా గదిలోకి చొరబడి మరీ ఆయనను అరెస్టు చేశారు. జాతీయ అకౌంటబిలిటీ బ్యూరో (ఎన్‌ఏబీ) ఆదేశాల మేరకే ఈ అరెస్టు జరిగింది. కాగా, ఇస్లామాబాద్‌లో పోలీసు లైన్స్‌ హెడ్‌క్వార్టర్స్‌ ఆవరణలో కొత్తగా కట్టిన పోలీసు గెస్ట్‌ హౌస్‌ను ప్రస్తుతం రెండు కేసుల్లో ఇమ్రాన్‌ను విచారించే నిమిత్తం కోర్టుగా ప్రకటించారు. ప్రభుత్వ ఖజానాకు రూ.5వేల కోట్లకు పైగా నష్టానికి కారణమైన అల్‌ఖదీర్‌ ట్రస్టు కేసులో విచారణ ప్రారంభమైన వెంటనే, ఖాన్‌ను 14రోజుల పాటు రిమాండ్‌కు పంపాల్సిందిగా ఎన్‌ఎబి లాయర్లు కోరారు. ఖాన్‌ తరపు న్యాయవాది మాట్లాడుతూ, తన క్లయింట్‌పై నమోదైన అభియోగాలన్నీ కల్పితాలైందున, వెంటనే ఆయనను విడుదల చేయాలని కోరారు. కాగా, ప్రభుత్వ బహుమతుల అమ్మకాల ద్వారా వచ్చిన మొత్తాల వివరాలను దాచడానికి సంబంధించి రెండవ కేసు కూడా జిల్లాసెషన్స్‌ కోర్టులో విచారణ జరగనుంది. గతేడాది పాక్‌ ఎన్నికల కమిషన్‌ ఈ కేసును దాఖలు చేసింది. పాలకులకు, పార్లమెంటేరియన్లకు, బ్యూరోక్రాట్లకు ఇతర దేశాల ప్రభుత్వాధినేతలు, విదేశీ ప్రముఖులు ఇచ్చే బహుమతులను ప్రధానిగా రాయితీ ధరకు కొనుగోలు చేసి వాటిని లాభాలకు అమ్ముకున్నారన్నది ఈ రెండో కేసు సారాంశం.
దేశవ్యాప్త సమ్మెకు పీటీఐ పిలుపు
ఇమ్రాన్‌ అరెస్టును తీవ్రంగా నిరసిస్తున్న పిటిఐ నాయకత్వం సమ్మెకు సిద్ధం కావాల్సిందిగా ప్రజలకు పిలుపునిచ్చింది. పెరుగుతున్న ఫాసిజాన్ని నిరసించాలని, ఏదో ఒకటి తేల్చుకునే క్షణం ఆసన్నమవుతోందని పేర్కొంది. ఇస్లామాబాద్‌, రావల్పండి, లాహోర్‌, కరాచి, గుజ్రాన్‌వాలా, ఫైజలాబాద్‌, ముల్తాన్‌, మర్దన్‌ నగరాల్లో పీటీఐ కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. కరాచిలో పోలీసులతో ప్రదర్శకులు ఘర్షణ పడ్డారు. పోలీసు వాహనాలపై రాళ్ళు విసరడం, వీధి లైట్లను పగలగొట్టడం చేశారు. ఇమ్రాన్‌ను విడుదల చేయాలంటూ నినాదాలు చేశారు. మరోపక్క తమ నేతను కలుసుకునేందుకు, విచారణను చూసేందుకు వస్తున్న పిటిఐ నేతలను లోపలకు రానివ్వకుండా విస్తృతంగా బందోబస్తు ఏర్పాట్లు చేశారు. మీడియాను కూడా లోపలకు రానివ్వడం లేదు. తమను అనుమతించనందుకు నిరసనగా పిటిఐ సీనియర్‌ ఉపాధ్యక్షుడు, మాజీ విదేశాంగ మంత్రి షా మహమూద్‌ ఖురేషి, సెక్రటరీ జనరల్‌ అసద్‌ ఉమర్‌లు పోలీసులపై కేసు వేసేందుకు హైకోర్టుకు వెళ్ళారు. కానీ ఈలోగానే వారిద్దరినీ అరెస్టు చేశారు. ఉమర్‌పై రెండు కేసులు నమోదు చేశారు. అంతకుముందు ఖురేషి మీడియాతో మాట్లాడుతూ, శాంతియుత నిరసన అనేది రాజ్యాంగ హక్కు, దాన్ని ఉపయోగించుకోండి, అంతేకానీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని కార్యకర్తలను కోరారు.

Spread the love