అన్నాచెల్లెలు, అక్కాతమ్ముళ్ల ఆత్మీయతకు చిహ్నం రాఖీ. శ్రావణ పూర్ణిమ రోజు నిర్వహించుకునే ఈ రాఖీని ఆత్మీయతతో పాటు తియ్యగా మార్చుకుంటే ఇంకా ఆనందంగా ఉంటుంది కదా! అందుకే ఈ వారం రాఖీ స్పెషల్‌గా కొన్ని స్వీట్స్…
కొబ్బరి కోవా లడ్లు
కావాల్సిన పదార్థాలు: ఎండుకొబ్బరి కోరు – పావు కేజీ, కోవా – నూటయాభై గ్రా., చక్కెర – నూటయాభై గ్రా., బాదం, జీడిపప్పు పొడి – చెంచా,
తయారు చేసే విధానం: అరకప్పు నీటిలో పంచదార కలిపి స్టవ్ మీద పెట్టి కరిగించాలి. మరో పాత్రలో కోవా తీసుకుని దోరగా వేయించి కొబ్బరికోరును కలపాలి. తర్వాత చక్కెర పాకం చేర్చి.. స్టవ్ మీదనే ఉంచి కలుపుతూ ఉండాలి. మిశ్రమం బాగా దగ్గరగా అయ్యాక బాదం, జీడిపప్పు పొడి కలిపి దింపేస్తే సరిపోతుంది. కాస్త వేడి తగ్గాక ఉండల్లా చేసుకోవాలి.
వేరుశెనగ బర్ఫీ
కావాల్సిన పదార్థాలు: వేరు సెనగపప్పు – అరకేజీ, యాలకులపొడి – కొద్దిగా చక్కెర – అరకేజీ, జీడిపప్పు పలుకులు – పావుకేజీ కన్నా కొద్దిగా తక్కువ, నెయ్యి- కొద్దిగా..
తయారు చేసే విధానం: వేరుసెనగపప్పును నూనె లేకుండా వేయించి, పొట్టు పూర్తిగా తీసేయాలి. వీటిని మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగానే పొడి చేసుకోవాలి. తర్వాత జీడిపప్పును కూడా బరకగా పొడి చేసుకోవాలి. కడాయిలో కొన్ని నీళ్ళు తీసుకుని చక్కెర చేర్చి పాకం పట్టాలి. పాకం కొద్దిగా ముదురు అవుతున్నప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న వేరుశెనగ, జీడిపప్పు పొడి, యాలకుల పొడి ఒక దాని తర్వాత ఒకటి వేసి బాగా కలపాలి. మిశ్రమం దగ్గరగా అయ్యాక నెయ్యి రాసిన పళ్లెంలోకి మార్చుకుని బిళ్లల్లా కట్ చేసుకోవాలి. పైన జీడిపప్పు పలుకులు అద్దిదే సరి.
కోవా గులాబ్‌జామ్
కావాల్సిన పదార్థాలు: చక్కెర వేయని కోవా – కప్పు, పనీర్ తురుము – కప్పు, మైదా – చెంచా, చక్కెర – ఒకటిన్నర కప్పు, నెయ్యి – వేయించడానికి సరిపడా, యాలకుల పొడి – చెంచా.
తయారు చేసే విధానం: చక్కెరలో సరిపడా నీళ్లు చేర్చి లేత పాకం వచ్చేదాకా స్టవ్ మీద పెట్టి కరిగించుకోవాలి. తర్వాత యాలకుల పొడి చల్లి దింపేయాలి. మరో పాత్రలో కోవా, పనీర్ తురుము, మైదా తీసుకుని గట్టిగా ముద్దలా కలుపుకోవాలి. చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని ఈ మిశ్రమాన్ని చిన్నచిన్న ఉండల్లా చేసుకుని సన్నని మంటపై ఉంచి నెయ్యి కరిగించి అందులో వేయించాలి. ఇవి తేలిగ్గా విచ్చుకుంటాయి కాబట్టి నెమ్మదిగా తిరగేయాల్సి ఉంటుంది. బంగారు వర్ణంలోకి వచ్చాక తీసి చక్కెర పాకంలో వేయాలి. చల్లారక తింటే బాగుంటాయి.
గోధుమరవ్వ పాయసం
కావాల్సిన పదార్థాలు: సన్నని గోధుమరవ్వ – ముప్పావు కప్పు, నీళ్లు – మూడు కప్పులు, చిక్కని కొబ్బరిపాలు – కప్పు, చిక్కని పాలు – కప్పు, బెల్లం – కప్పు, నెయ్యి – రెండు చెంచాలు, జీడిపప్పు, ఎండుద్రాక్ష – పావు కప్పు కన్నా కొద్దిగా తక్కువ, యాలకుల పొడి – అర చెంచా.
తయారు చేసే విధానం: స్టవ్ మీద కడాయి పెట్టి చెంచా నెయ్యి వేసి గోధుమ రవ్వను వేయించు కోవాలి. ఈ రవ్వను పక్కకు పెట్టుకుని అదే కడాయిలో నీళ్లు చేర్చి మరుగుతున్నప్పుడు రవ్వ వేసి సన్న మంట మీద ఉడికించుకోవాల. ఈ మిశ్రమాన్ని పక్కకు పెట్టుకోవాలి. మరో కడాయిలో చెంచా నెయ్యి వేసి ఎండుద్రాక్ష, జీడిపప్పు పలుకులను వేయించి విడిగా తీసుకోవాలి. అందులోనే పాలు మరిగించి ఉడికిన రవ్వ చేర్చాలి. కాస్త దగ్గరగా అయ్యాక బెల్లం తురుము కూడా వేసి.. పూర్తిగా కలిశాక దింపేముందు కొబ్బరిపాలు, యాలకులపొడి, వేయించి పెట్టుకున్న జీడిపప్పు, ఎండుద్రాక్ష పలుకులు, మిగిలిన నెయ్యి ఒకదాని తర్వాత మరొకటి వేస్తే సరిపోతుంది. అంతే గోధుమరవ్వ పాయసం సిద్ధం.
తీపి సమోసాలు
కావాల్సిన పదార్థాలు: గోధుమపిండి – రెండుకప్పులు, నెయ్యి – రెండు చెంచాలు, పాలు – సరిపడా, ఆకుపచ్చ ఫుడ్ కలర్ – కొద్దిగా, నూనె – వేయించడానికి సరిపడా.
ఫిల్లింగ్ కోసం: కొబ్బరి తురుము – కప్పు, జీడిపప్పు – పావుకప్పు, పల్లీలు, కిస్మిస్ – కలిపి అరకప్పు, చక్కెర – ఒకటిన్నర కప్పు, యాలకుల పొడి – చెంచా, నెయ్యి – మూెడు చెంచాలు.
తయారు చేసే విధానం: కడాయిలో నెయ్యి కరిగించి జీడిపప్పు, పల్లీలూ, కిస్మిస్ వేయించుకోవాలి. తర్వాత కొబ్బరి తురుము కూడా వేయించుకోవాలి. అందులో చక్కెర వేసి కలుపుతూ ఉంటే కాసేపటికి కరుగుతుంది. దింపే ముందు యాలకులపొడి వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఓ గిన్నెలో గోధుమపిండి తీసుకుని ఫుడ్‌కలర్ వేసుకుని పాలూ, నీళ్లు పోసుకుంటూ పూరీ పిండిలా కలపాలి. ఇప్పుడు నెయ్యి వేసుకుని మరోసారి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇది నానాక కొద్దిగా తీసుకుని అర్ధచంద్రాకారంలో వత్తుకోవాలి. దాన్ని కోన్‌లా మడిచి మధ్యలో ముందుగా చేసిపెట్టుకున్న మిశ్రమాన్ని ఉంచి అంచుల్ని మూసేయాలి. ఇలా మిగిలిన పిండిని చేసుకుని నూనెలో వేసి ఎర్రగా వేగే వరకూ వేయించుకుంటే, వేడివేడి తీపి సమోసాలు సిద్ధం.
నువ్వుల బర్ఫీ
కావాల్సిన పదార్థాలు: నువ్వులు – కప్పు, చక్కెర – కప్పు, యాలకులు – పది, డ్రైఫ్రూట్స్ – పావు కప్పు
తయారు చేసే విధానం: కడాయి వేడిచేసి నూనె లేకుండా నువ్వుల్ని సన్న మంట మీద వేయించుకోవాలి. వాటి వేడి తగ్గాక మెత్తగా పొడి చేసుకోవాలి. మరో గిన్నె స్టవ్ మీద పెట్టి చక్కెర, కొన్ని నీళ్లు పోసి గట్టి పాకం పట్టుకోవాలి. అందులో నువ్వుల పొడి, యాలకుల పొడి వేసుకోవాలి. బర్ఫీ మిశ్రమం దగ్గర పడుతు న్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన పళ్లెంలోకి తీసుకుని పైన డ్రై ఫ్రూట్స్ వేసేయాలి. వేడి తగ్గాక ముక్కల్లా కట్ చేసుకుంటే సరి.