వీర జవాన్‌ చంద్రశేఖర్‌కు కన్నీటి వీడ్కోలు

A tearful farewell to Veera Jawan Chandrasekhar– సైనిక లాంఛనాలతో స్వగ్రామంలో ముగిసిన అంత్యక్రియలు
– పలు రాజకీయ పార్టీ నాయకుల నివాళి
నవతెలంగాణ-షాద్‌నగర్‌
వీర జవాన్‌ చంద్రశేఖర్‌కు చివరిసారిగా కన్నీటి వీడ్కోలు పలికారు. రంగారెడ్డి జిల్లాలోని ఆయన స్వగ్రామమైన తిర్మన్‌దేవునిపల్లిలో సోమవారం అర్ధరాత్రి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. లద్దాఖ్‌లోని బేరి ప్రాంతంలో ఆర్మీ జవాను వాహనం లోయలో పడిపోవటంతో తొమ్మిది మంది జవాన్లు మృతి చెందిన విషయం విధితమే. మృతుల్లో ఒకరైన నీరటి చంద్రశేఖర్‌ (30) కొందుర్గు మండలంలోని తంగళ్లపల్లి గ్రామపంచాయతీ తిర్మన్‌దేవునిపల్లిలోని నీరటి మల్లయ్య, శివమ్మ దంపతుల చిన్న కుమారుడు. దేశానికి సేవ చేయాలనే ఆలోచనతో కష్టపడి ఆర్మీలో ఉద్యోగం సాధించిన చంద్రశేఖర్‌.. అంచెలంచెలుగా ఎదిగి ఉన్నత స్థానానికి చేరుకున్నాడు. కాగా, శనివారం జవాన్లు కేరే గ్యారిసన్‌ నుంచి లేV్‌ా సమీపంలోని క్యారీకి వెళ్తుండగా లద్దాఖ్‌లోని బేరి ప్రాంతంలో ఆర్మీ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం లోయలో పడిన ఘటనలో చంద్రశేఖర్‌ మృతిచెందాడు. అతని మృతదేహాన్ని సోమవారం రాత్రి స్వగ్రామానికి తీసుకొచ్చారు. అదే రోజు రాత్రి రెండు గంటల ప్రాంతంలో సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడు చంద్రశేఖర్‌కు భార్య లాస్య, కుమారుడు (4), ఒక కూతురు (2) ఉన్నారు. అంత్యక్రియల్లో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ పాల్గొని బాధిత కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయం అందజేశారు. టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్‌ చంద్రశేఖర్‌ పాడెను మోశారు. వివిధ రాజకీయ పార్టీ నాయకులు చంద్రశేఖర్‌కు నివాళి అర్పించారు.