కవితకు తాత్కాలిక ఊరట

A temporary respite for poetry– నవంబర్‌ 20 వరకు ఎలాంటి సమన్లు ఇవ్వొద్దు : ఈడీకి సుప్రీం కీలక ఆదేశాలు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు లిక్కర్‌ స్కామ్‌ ఈడీ సమన్ల వ్యవహారంలో సుప్రీం కోర్టులో తాత్కాలికంగా ఊరట లభించింది. కవిత పిటిషన్‌ పై విచారణను నవంబర్‌ 20కి సర్వోన్నత న్యాయస్థానం వాయిదా వేసింది. దీంతో ఆ లోపు ఆమెకు ఎలాంటి నోటీసులు జారీ చేయొద్దని ఈడీని ఆదేశించింది. ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌ ను మంగళవారం జస్టిస్‌ సంజరు కిషన్‌ కౌల్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ దర్యాప్తు తీరును తప్పుబడుతూ కవిత పిటిషన్‌ దాఖలు చేశారు. ఈడీపై గతంలో దాఖలైన అభిషేక్‌ బెనర్జీ, నళిని చిదంబరం కేసుతో ట్యాగ్‌ చేసి విచారణ కొనసాగించాలని కోరారు. గత విచారణలో ఈడీ సమన్లను కూడా కవిత తప్పుబట్టారు. సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉండగా సమన్లు జారీ చేయడం తగదన్నారు. నళిని చిదంబరానికి ఇచ్చినట్టే తనకు కూడా వెసులుబాటు ఇవ్వాలని కోరారు.
అయితే మహిళను విచారణకే పిలవకూడదంటే ఎలా? అని సుప్రీం ప్రశ్నించింది. మహిళలను విచారణకు పిలవొచ్చు కాకపోతే రక్షణ ఉండాలని తెలిపింది. అన్నిటికీ ఒకే ఆర్డర్‌ను అప్లై చేయలేమన్న ధర్మాసనం తేల్చి చెప్పింది.10 రోజుల పాటు సమన్లు వాయిదా వేయడానికి ఈడీ అంగీకరించింది. కాగా.. కవిత పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు నవంబర్‌ 20కి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలోనే నవంబర్‌ 20 వరకూ ఆమెకు సమన్లు ఇవ్వొద్దని ఈడీకి సుప్రీం ఆదేశాలు జారీ చేసింది.కాగా ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో ఎన్ఫోర్స్మెంట్‌ డైరెక్టరేట్‌ కవితకు తమ ఎదుట విచారణకు హాజరు కావాలని మరోసారి నోటీసులు పంపిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో.. ఈడీ ఇచ్చిన సమన్లు రద్దు చేయాలని సుప్రీంను కవిత ఆశ్రయించారు. లిక్కర్‌ కేసులో గతంలోనూ ఈడీ నోటీసులు అందుకున్న కవిత.. ఈడీ కార్యాలయం లో విచారణకు హాజయ్యారు. అయితే.. ఈడీ కార్యాలయంలో మహిళల విచారణ సీఆర్సీసీకి విరుద్ధం అంటూ ఆమె మొదటి నుంచి వాదిస్తున్నారు.
నళిని చిదంబరం ఇంటివద్దే తనను విచారణ జరపాలని ఆమె కోరుతున్నారు. ఈ క్రమంలో దర్యాప్తు స తీరును తప్పుబడుతూ ఆమె సుప్రీంలో పిటిషన్‌ దాఖలు చేశారు.
అయినప్పటికీ ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. తన పిటిషన్‌ విచారణలో ఉండగా.. నోటీసులు ఎలా జారీ చేస్తారని ఈడీ తీరును ప్రశ్నించారు. అంతేకాదు తాను విచారణకు రాలేనని కరాకండిగా చెబుతూ వచ్చారు. కవిత బిజీగా ఉంటే నోటీసుల విషయంలో పది రోజుల సమయం పొడగిస్తామని గత విచారణలో ఈడీ కోర్టుకు తెలిపింది. ఈ క్రమంలో మంగళవారంతో పదిరోజులు గడువు ముగిసింది. మంగళవారం విచారణ సందర్భంగా.. కవిత పిటిషన్‌ పై విచారణ కొనసాగుతున్నందున తదుపరి విచారణలోపు ఎలాంటి నోటీసులు జారీ చేయొద్దని సుప్రీం కోర్టు, ఈడీకి స్పష్టం చేసింది.