అర్హులకు ‘గిరిజన బంధు’ ఇవ్వాలి

నవతెలంగాణ- సంతోష్‌ నగర్‌
అర్హులైన గిరిజనులకు ‘గిరిజన బంధు’ ఇవ్వాలని తెలంగాణ గిరిజన సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. తెలంగాణ గిరిజన సంఘం, ప్రదేశ్‌ ఎరుకుల సంఘం ఆధ్వర్యంలో సైదాబాద్‌ డివిజన్‌ ఖాజాబాగ్‌ కాలనీలో గురువారం ధర్నా నిర్వహించారు. తెలంగాణ గిరిజన సంఘం సహాయ కార్యదర్శి రాష్ట్ర ఎం. బాలు నాయక్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం. ధర్మానాయక్‌, తెలంగాణ ప్రదేశ్‌ ఎరుకల సంఘం రాష్ట్ర కార్యదర్శి రఘులు మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ గిరిజన భవన్‌ను ప్రారంభించిన సందర్భంగా రాష్ట్రంలో గిరిజనులకు కూడా ‘గిరిజన బంధు’ ఇస్తానని ప్రకటించి ఏడాది అవుతున్నా ఇప్పటికీ అమలు చేయలేదని మండిపడ్డారు. హైదరాబాద్‌ నగరంలో ఉన్న గిరిజనులకు సొంత ఇండ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సైదాబాద్‌ డివిజన్‌ ఖాజాబాగ్‌ గిరిజన కాలనీలో వారానికి ఒకసారి నల్లానీళ్లు వస్తున్నాయని.. అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించకోవడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలుచేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం రాష్ట్ర నాయకుడు రామావత్‌ పాండునాయక్‌, రాజు, బిచ్య, రమేష్‌, రాష్ట్ర గిరిజన మీడియా ఇంచార్జ్‌ జర్నలిస్ట్‌ సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.