– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
నవతెలంగాణ-ఖమ్మం
జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో సీపీఐ(ఎం) అభ్యర్థులను గెలిపించడం ద్వారా మాత్రమే ఖమ్మం జిల్లా సమగ్రాభివృద్ధి జరుగుతుందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు తెలిపారు. శనివారం సీపీఐ(ఎం) ఖమ్మం టూ టౌన్ కమిటీ, బీవీకే కమిటీ ఆధ్వర్యంలో నెల నెలా ఉచిత మెడికల్ క్యాంపు మంచికంటి పంక్షన్ హల్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రాజెక్టులు పూర్తి కావాలని సుదీర్ఘ పాదయాత్ర చేసింది సీపీఐ(ఎం) మాత్రమే అని, నిధులు కేటాయించి ప్రాజెక్టులు పూర్తి చేసి జిల్లాను సస్యశ్యామలం చేయాలని తీవ్ర ఆందోళనలు చేసింది సీపీఐ(ఎం) తెలిపారు. ఖమ్మం నియోజకవర్గంలో 30 సంవత్సరాలకుపైగా ఎటువంటి అవినీతి లేకుండా, అక్రమాలు, అరాచకాలు లేకుండా నిజాయితీ పరిపాలన చేసి ప్రజా సమస్యలు పరిష్కారం చేసిన ఘనత సీపీఐ(ఎం)కే దక్కిందన్నారు. ఖమ్మం నగరంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆమరణదీక్ష ఆనాడు చేసి పేదలకు వేల ఇళ్ల స్థలాలు ఇప్పించడంలో పార్టీ చురుకైన పాత్ర నిర్వహించిందని చెప్పారు. రోడ్లు, డ్రైనేజీ, వీధి లైట్లు, ఇతర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటాలు పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించామని గుర్తుచేశారు. ఈనెల 30 న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గుర్తు సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకి ఓటు వేసి తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై.విక్రమ్, నాయకులు వై. శ్రీనివాసరావు, పి. ఝాన్సీ, బోడపట్ల సుదర్శన్, పి.సుబ్బారావు, శివనారయణ, ఆప్జల్, శవాసిరెడ్డి వీరభద్రం, పి.వాసు తదితరులు పాల్గొన్నారు.