– ప్రజా వ్యతిరేకతలో బీజేపీ
– కుల గణన ఎజెండాతో కాంగ్రెస్
– బీజేపీని వెంటాడుతున్న 50 శాతం కమీషన్
మధ్యప్రదేశ్‌లో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య పోటీ నెలకొంది. ఈసారి కాంగ్రెస్ గెలుపు ఖాయమని అనేక సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. బీజేపీ ఎదుర్కొంటున్న ప్రజా వ్యతిరేకతలో మోడీ, షా ద్వయం తర్జనభర్జన పడుతోంది. ఎలా గట్టెక్కాలో తెలియక, తలలు పట్టుకుంటుంది. అందుకే విద్వేషాలను రెచ్చగొట్టేందుకు, విషం చిమ్మేందుకు ప్రయత్నిస్తుంది.
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
2018 మధ్యప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ 41.02 శాతం సాధించి 109 అసెంబ్లీ సీట్లు దక్కించుకుంది. కాంగ్రెస్ 40.89 శాతం ఓట్లు సాధించింది. బీజేపీ కన్నా కాంగ్రెస్ కాస్త తక్కువ ఓటు శాతం సాధించినా.. 114 నియోజకవర్గాల్లో గెలుపొందింది. అయితే ఎప్పటి నుంచో మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్, బీజేపీ మధ్య ద్విముఖ పోరు జరుగుతోంది. మధ్యప్రదేశ్ ఓటర్లు బీజేపీపై కోపం వచ్చినప్పుడు కాంగ్రెస్‌కు, కాంగ్రెస్‌పై కోపంగా ఉన్నప్పుడు బీజేపీకి పట్టం కడుతున్నారు. అయితే గత ఐదేండ్లలో కాంగ్రెస్ (15 నెలలు), బీజేపీ (మిగతా కాలం) అధికారం పంచుకున్నాయి. దీంతో ఇప్పుడు మధ్యప్రదేశ్ ప్రజలు ఎవరికి అధికారం కట్టబెడుతారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో ముస్లిం ఓటు బ్యాంకు కాంగ్రెస్‌కు ఆశలు రేపుతోంది.
వర్గపోరు లేకపోవడమే కాంగ్రెస్‌కు కలిసొచ్చే విషయం
గత ఎన్నికల్లో 114 సీట్లు గెలిచి మ్యాజిక్ ఫిగర్‌కు అతి చేరువగా వచ్చిన కాంగ్రెస్.. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ బీజేపీ డైరెక్షన్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత జ్వోతిరాదిత్య సింథియా 22 మంది ఎమ్మెల్యేలతో కలిసి తిరుగుబాటు చేయడంతో 15 నెలల్లోనే ఆ ప్రభుత్వం కుప్పకూలింది. ఆ తర్వాత శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రిగా బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది. జ్వోతిరాదిత్య సింథియా సహా యానికి ప్రతిఫలంగా బీజేపీ ఆయనను కేంద్ర మంత్రిని చేసింది. కానీ ఆయన వర్గీ యులు బీజేపీలో ఉండలేక పోతున్నారు. ఇటీవల ఒక్కొక్కరుగా బీజేపీని వీడుతున్నారు.
ఇది జ్వోతిరాదిత్య సింథియాకు సవాలుగా మారింది. మధ్యప్రదేశ్‌లో మాజీ ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు కమల్ నాథ్.. కమలం పార్టీకి గట్టి పోటీ ఇస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం 50 శాతం కమీషన్ సర్కారంటూ కాంగ్రెస్ ఆరోపణలు గుప్పిస్తోంది. కుల గణనను ప్రధాన ఎజెండాగా కాంగ్రెస్ ప్రచారం చేస్తుంది. కాంగ్రెస్‌లో వర్గపోరు లేకపోవడం, మాజీ ముఖ్యమంత్రి దిగ్విజరు సింగ్ పూర్తిగా కమల్ నాథ్ వెనుక నిలవడం, రాష్ట్రంలో కొద్దికాలానికే అధికారాన్ని కోల్పోవడంపై ప్రజల్లో సానుభూతి నెలకొనడం తమకు కలిసి వస్తాయని కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది.
ముఖ్యమంత్రి అభ్యర్థి లేని బీజేపీ 15 నెలలు మినహా 2005 నుంచి నేటి వరకు శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. వివిధ వర్గాలను ఆకట్టుకునే పథకాల ద్వారా ‘మామ’గా ఆయన ప్రసిద్ధులు. అయితే తీవ్ర ప్రజా వ్యతిరేకతను చౌహాన్ ఎదుర్కొం టున్నారు. ఆర్‌ఎస్‌ఎస్ ప్రయోగశాలగా చెప్పుకొనే మధ్యప్రదేశ్‌లో హిందూత్వపై, ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రచారంపై బీజేపీ నమ్మకం పెట్టుకుంది. కొందరు కేంద్ర మంత్రులను బరిలో దింపింది. ఈసారి ఆమాద్మీ కూడా ఇక్కడ బరిలో దిగుతోంది. ఇండియా కూటమిగా కలిసి పోటీ చేసేందుకు కాంగ్రెస్, ఎస్పీ ప్రయత్నించిన ప్పటికీ, అది బెడిసికొట్టింది. ఎస్పీతో సీట్ల సర్దుబాట్లపై చర్చ జరుగుతున్నప్పటికీ, కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. దీనిపై ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్‌పై మండిపడ్డారు. తాము పోటీకి వెనక్కి తగ్గేదేలేదని స్పష్టం చేశారు. మరోవైపు బీఎస్పీ కూడా బరిలోకి దిగింది.
కీలకమైన అంశాలు
నిరుద్యోగం, రైతు సమస్యలు, అవినీతి, 50 శాతం కమీషన్, కరువు, బుందేల్ ఖండ్ అభివద్ధి, మహిళలు, దళితులపై పెరుగుతున్న నేరాలు వంటి
అంశాలు ఎన్నికల్లో కీలకం కానున్నాయి. తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోవడం బీజేపీకి ప్రతికూలం కాగా, వర్గపోరు లేకపోవడం, కుల గణన డిమాండ్ కాంగ్రెస్‌కు సానుకూలం కానుంది.
సామాజిక సమీకరణలు
అంచనాల ప్రకారం ఆరు కోట్ల కంటే ఎక్కువ జనాభా ఉన్న మధ్యప్రదేశ్‌లో దాదాపు 50శాతం పైబడి ఓబీసీలు ఉన్నారు. 22 శాతం షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ), 14 శాతం షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) జనాభా ఉంది. మొత్తం జనాభాలో ముస్లింలు 5 శాతం ఉండగా, బ్రాహ్మణులు 5 శాతం ఉన్నారు. అంతేకాక మొత్తం జనాభాలో ఐదు శాతం చొప్పున గణనీయమైన జనాభా కలిగిన అహిర్లు, రాజ్‌పుత్‌లు ఉన్నారు. మధ్యప్రదేశ్ జనాభాలో తెలిస్, కుర్మీలు, లోధ్‌లు కూడా మూడు
శాతం మంది ఉన్నారు.
47 అసెంబ్లీ స్థానాల్లో ముస్లింల ప్రభావం
మధ్యప్రదేశ్‌లో ముస్లీంల జనాభా ఐదు శాతం ఉంది. 47 అసెంబ్లీ స్థానాల్లో ఈ ముస్లిం ఓటర్లు ప్రభావం చూపించే అవకాశం ఉంది. అందులో హౌరాహౌరీ పోరు నెలకొనే 22 నియోజకవర్గాల్లో ముస్లిం ఓటింగ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ కానుంది.
బుందేల్ ఖండే విజయానికి సోపానం
పేదరికం, కరవుకు పుట్టినిల్లుగా గుర్తింపు ఉన్న బుందేల్ ఖండ్‌లో ఆధిక్యం సాధించిన పార్టీకే మధ్య ప్రదేశ్‌లో అధికారం దక్కుతుందని 20 ఏండ్ల ఎన్నికల ఫలితాలు చాటుతున్నాయి. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ సరిహద్దులో మొత్తం ఆరు జిల్లాల్లో విస్తరించిన బుందేల్ ఖండ్‌కు 26 శాసనసభ స్థానాలు ఉన్నాయి. అందులో ఆరు ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గాల్లోనే ఎస్పీ, బీఎస్పీ పార్టీల బలం గణనీయంగా ఉంది.