– బాధితురాలిని సంరక్షించాలి
– నిందితులను కఠినంగా శిక్షించాలి
టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ డిమాండ్
నవతెలంగాణ-హైదరాబాద్
రంగారెడ్డి జిల్లా మీర్‌పేటలో మైనర్ బాలికపై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటన తీవ్రంగా కలచివేసిందని తెలుగుదేశం తెలంగాణ శాఖ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాల్ని సంరక్షించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందనీ, ఇంతటి ఘాతుకానికి ఒడిగట్టిన ఆ నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తల్లిదండ్రుల్లేని ఆ బాలిక తన తమ్ముడితో కలిసి జీవిస్తుంటే, నలుగురు మగాళ్ళు చేసిన అఘాయిత్యం మానవత్వానికి ఒక మచ్చగా మారిందన్నారు. బాధిత బాలిక తమ్ముణ్ణి బెదిరించి, గంజాయి మత్తులో తూగుతూ లైంగిక దాడిచేయడాన్ని ఖండించారు. ఆ బాలిక, ఆమె సోదరుడు మనో ధైర్యంతో జీవించేలా చూడాలని కోరారు. విశ్వనగరంగా అభివద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరంలో గంజాయి ముఠాలు పెచ్చరిల్లుతున్న క్రమంలోనే ఇలాంటి అఘాయిత్యాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గంజాయి, డ్రగ్స్ ముఠాలను ప్రభుత్వం కఠినంగా అణచివేసి ఇలాంటి ఘటనలకు అడ్డుకట్ట వేయాలని కాసాని జ్ఞానేశ్వర్ కోరారు. ఈమేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.